అసలు లక్ష్యం అదే

ప్రజల్లోకి వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమయింది. నేటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలను చేయనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి [more]

Update: 2020-02-19 00:30 GMT

ప్రజల్లోకి వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమయింది. నేటి నుంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలను చేయనుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయిన తెలుగుదేశం పార్టీ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఈ యాత్రలను ప్రారంభించింది. ప్రజాసమస్యలపై పోరాడుతూ వారి వెంట ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరవచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.

నేటి నుంచే….

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కీలక నేతలలో సమావేశమై ప్రజా చైతన్య యాత్రలపై చర్చించారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఈ చైతన్య యాత్రలను జరపాలని చంద్రబాబు ఆదేశించారు. మొత్తం 45 రోజుల పాటు ఈ యాత్రలు చేయాలని నిర్ణయించారు. వారానికి ఒక శాసనసభ నియోజకవర్గంలో జరిగే ప్రజా చైతన్య యాత్రలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొనేలా ప్రోగ్రాంను టీడీపీ డిజైన్ చేసింది.

ప్రజలకు అండగా ఉండి…..

ఇప్పటికే ఇసుక కొరతపై ఆందోళనలు చేసి కొంతవరకూ ప్రజలకు చేరువయ్యామని టీడీపీ నమ్మకంతో ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో నవశకం పేరిట సర్వే నిర్వహిస్తే పింఛన్లు, రేషన్ కార్డులను తొలగిస్తుండటం ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనిని వినియోగించుకోవాలని టీడీపీ భావిస్తుంది. పేదలకు చెందిన తెల్ల రేషన్ కార్డులను కూడా రద్దు చేస్తుండటాన్ని టీడీపీ తీవ్రంగా తప్పు పడుతోంది. ప్రజలకు అండగా ఉండేందుకు టీడీపీ పోరాటం చేయాలని నిశ్చయించింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో….

ఈరోజు నుంచి జరిగే ప్రజా చైతన్య యాత్రలో చంద్రబాబు మార్టూరులో పాల్గొననున్నారు. ఇప్పటికే తొలగించిన రేషన్ కార్డులను, పింఛన్లను తిరిగి పునరుద్ధరించేవరకూ పోరాటం ఆగదని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వీటితో పాటు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలతో పెట్టుబడులు రాకపోవడం, పరిశ్రమలు తరలి వెళ్లిపోవడంపైనా యాత్రల్లో ప్రజలకు వివరించాలని టీడీపీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఉద్యమాలతో ప్రజల్లో ఉండి తిరిగి బలపడి స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని చేస్తున్న టీడీపీ ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.

Tags:    

Similar News