సైడ్ చేసేయాలనేనా?

కావాలనే టీడీపీ ఓ కొత్త ప్రచారం మొదలుపెట్టిది. ఏపీలో జగన్ ని ఒంటరిని చేయడం రాజకీయ వ్యూహంలో భాగమైతే అన్ని పార్టీలు తమతో ఉన్నాయని చెప్పుకోవడం మరో [more]

Update: 2019-09-06 05:00 GMT

కావాలనే టీడీపీ ఓ కొత్త ప్రచారం మొదలుపెట్టిది. ఏపీలో జగన్ ని ఒంటరిని చేయడం రాజకీయ వ్యూహంలో భాగమైతే అన్ని పార్టీలు తమతో ఉన్నాయని చెప్పుకోవడం మరో భాగం. ఇలా తమ్ముళ్లకు నైతిక స్థైర్యం నింపడంతో పాటు, జనాల్లో కూడా పలుచన కాకుండా ఉండేందుకు వేస్తున్న ఎత్తులు ఇవి అని అందరికీ తెలుసు. చంద్రబాబుకు నమ్మిన బంటుగా ఉన్న అయ్యన్నపాత్రుడు ఈ మధ్య చేసిన కొన్ని కామెంట్స్ ఏపీలో బలపడదామనుకుంటున్న బీజేపీకి, తాను గట్టిగా ఫోకస్ కావాలనుకుంటున్న జనసేన పవన్ కళ్యాణ్ కి దెబ్బ తీసేవేనని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అంతా కలసి పోటీ చేస్తామని అయ్యన్నపాత్రుడు బాహాటంగా స్టేట్ మెంట్ ఇవ్వడం ద్వారా టీడీపీకి పొలిటికల్ మైలేజ్ తెచ్చే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఏపీ పవర్ రేసులో ముందుకు పోదామనుకుంటున్న బీజేపీ, జనసేన పార్టీలను సబ్ జూనియర్ పార్టనర్లుగా మార్చేశారు.

సైలెంట్ గా ఉంటే ముప్పే…..

నిజానికి ఏపీలో తామే అధికారంలోకి రావాలన్నది బీజేపీకి ఉన్న గట్టి పట్టుదల. గత కొన్ని దశాబ్దాలుగా తోక పార్టీగా ఉంటూ బంగారం లాంటి అవకాశాలను ఎన్నో చేజార్చుకున్న బీజేపీకి ఇపుడు పొత్తుల గోల కంటే ఎత్తులూ, జిత్తులూ ఎక్కువయ్యాయి. టీడీపీని మింగేసి అయినా బలపడిపోదామని చూస్తున్న బీజేపీకి అయ్యన్న మాటలు అసలు నచ్చవంటే నచ్చవు. కానీ ఆ పార్టీ నుంచి వ్యతిరేకంగా ఒక్క కామెంట్ కూడా నెగిటివ్ గా ఇప్పటివరకూ రాకపోవడమే విశేషం. ఇక మరో పార్టీ జనసేన ఉంది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ తానేనని ఆశపెట్టుకుని ఉన్నారు. ఆయనను సైతం సైడ్ క్యారక్టర్ గా చేసిపారేస్తే ఎందుకో మౌనమే నా సమాధానం అన్నట్లుగా ఉన్నారు.

ఊపు సైతం గల్లంతే….

ఏపీలో వైసీపీ గెలిచిన తరువాత సహజంగానే టీడీపీ డీలా పడింది. దాంతో తామే వైసీపీకి పోటీ అంటూ బీజేపీ ముందుకు వచ్చింది. టీడీపీ తమ్ముళ్లను కొందరిని చేర్చుకుని మరీ జబర్దస్తు చేస్తోంది. 2024లో అధికారం ఖాయమని కూడా ప్రకటనలు గట్టిగా ఇస్తోంది. మరి టీడీపీతో పొత్తు అంటే బీజేపీలో ఎవరు చేరుతారు. తోక పార్టీగానే ఉంటామని మౌనంగా ఒప్పుకుంటే ఇక ఏపీలో బీజేపీ ఎదుగుదల ఉంటుందా అన్నది పెద్ద ప్రశ్న. మరో వైపు పవన్ సైతం తాను సొంతంగా పోరాడాలని భావిస్తున్నారు. వీలైతే ఎన్నికల‌ టైంలో పొత్తులు అనుకుంటే అనుకోవచ్చు కాక. కానీ ఎన్నికల ఫలితాలు వచ్చిన మూడు నెలలకే పొత్తుల పేరిట ప్రచారంతో టీడీపీ వెనక నిలబడేలా పరిస్థితి ఉంటే రేపు పవన్ ని సొంత పార్టీ నేతలైనా నమ్ముతారా. ఓ పద్ధతి ప్రకారం పొత్తుల ఎత్తులకు టీడీపీ తెరతీస్తే దానిని ఖండించకుండా ఈ రెండు పార్టీలు మౌనం దాల్చడం పట్ల కూడా చర్చ సాగుతోంది. ఇదే తీరున టీడీపీ ప్రచారం కొనసాగితే రేపటి రోజున వైసీపీకి కచ్చితంగా పసుపు పార్టీయే ఎదురునిలుస్తుంది. మరి టీడీపీ అజెండాను తెలిసే అమలు పరచాలనుకుంటే మాత్రం ఆ రెండు పార్టీలకు దెబ్బ పడిపోవడం ఖాయమంటున్నారు.

Tags:    

Similar News