పసుపు పండగ ఏం తేల్చనుంది? పరువు దక్కుతుందా?

మ‌హానాడు-ఈ పేరు విన‌గానే టీడీపీ శ్రేణుల్లో ఎక్కడో తెలియ‌ని ఉత్సాహం క‌ట్టలు తెగుతుంది. మొత్తంగా మూడు రోజులు జ‌రిగే ఈ ప‌చ్చ పండుగ‌కు ఎక్కడెక్కడి నుంచో నాయ‌కులు, [more]

Update: 2020-05-20 14:30 GMT

మ‌హానాడు-ఈ పేరు విన‌గానే టీడీపీ శ్రేణుల్లో ఎక్కడో తెలియ‌ని ఉత్సాహం క‌ట్టలు తెగుతుంది. మొత్తంగా మూడు రోజులు జ‌రిగే ఈ ప‌చ్చ పండుగ‌కు ఎక్కడెక్కడి నుంచో నాయ‌కులు, కార్యక‌ర్తలు, అభిమానులు పోటెత్తుతారు. గ‌తాన్ని గుర్తు చేసుకుంటూ.. వ‌ర్తమానాన్ని చ‌ర్చించుకుంటూ.. భ‌విష్యత్తును నిర్మించుకునేందుకు టీడీపీ ఏర్పాటు చేసుకున్న.. మ‌రే పార్టీకి లేని అద్భుత‌మైన వేదిక మ‌హానాడు. ఏటా మే నెల చివ‌రి వారంలో నిర్వహించే ఈ వేడుక‌కు పార్టీలోనే కాకుండా ఇత‌ర రాజ‌కీయ పార్టీల్లోనూ ఆస‌క్తి ఉంటుంది. టీడీపీ వ్యూహాలు ఏంటి? గ‌తానికి భిన్నంగా పార్టీ ఎలా ముందుకు వెళ్తుంది?

అందరికీ ఆసక్తే….

ఎలాంటి విష‌యాల‌ను దిశానిర్దేశం చేస్తుంది? గ‌త తాలూకు అనుభ‌వాల నుంచి నేర్చుకున్న పాఠాలు ఏంటి ? వ‌ంటి అనేక విష‌యాల‌ను రాజ‌కీయాల‌తో ప‌రిచ‌యం ఉన్న ప్రతి ఒక్కరూ ఆ మూడు రోజులు టీడీపీని ఫాలో అవుతారు. సుమారు వేల‌ల్లో వ‌చ్చే అభిమానుల‌కు భారీ ఎత్తున చేసే సౌక‌ర్యాలు, విందు భోజ‌నాలు వంటివి కామ‌న్‌. ఇక‌, గ‌త ఏడాది భారీ ఎత్తున నిర్వహించాల‌ని అనుకున్నారు. అయితే, అది పార్టీ తిరిగి అధికారంలోకి వ‌స్తే. కానీ, అనూహ్యంగా పార్టీ ఓడిపోవ‌డంతో అధినేత చంద్రబాబు ఆశ‌లు ఆవిర‌య్యాయి. పార్టీ అధికారంలోకి రాలేదు క‌దా.. 23 మందితో అతి క‌ష్టం మీద ప్రధాన ప్రతిప‌క్ష హోదాను ద‌క్కించుకుంది. దీంతో ఆ ఏడాది మ‌హానాడును వాయిదా వేసుకున్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో…..

ఇక‌, ఈ ఏడాది ఈ నెల చివ‌రి వారంలో మ‌హానాడుకు రూప‌క‌ల్పన చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లా, మండ‌ల స్థాయి నాయ‌కుల‌ను చంద్రబాబు అప్రమ‌త్తం చేస్తున్నారు. ఇంకా వేదిక ఖ‌రారు కాన‌ప్పటికీ.. త్వర‌లోనే మ‌హానాడు మాత్రం జ‌రిగి తీరుతుంద‌నే విష‌యం మాత్రం తాజాగా ఖ‌రారైంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మ‌హానాడులో ఏం జ‌రుగుతుంది? ఏయే విష‌యాల‌ను చ‌ర్చిస్తారు ? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. అదేస‌మ‌యంలో గ‌త ఏడాది మ‌హానాడు జ‌ర‌గ‌క‌పోయినా.. నాయ‌కులు బాగానే ఉన్నారు. కానీ, ఇప్పుడు పార్టీలో కీల‌క నాయ‌కులు ఎక్కడా క‌నిపించ‌డం లేదు. చాలా మంది సీనియ‌ర్లు పార్టీ మారిపోయారు. గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు పార్టీకి దూర‌మ‌య్యారు.

యాక్టివ్ గా లేకపోవడంతో…

చంద్రబాబు వ్యూహాల‌పై న‌మ్మకం లేద‌ని లోలోనే విమ‌ర్శిస్తూ.. ఇంటికే ప‌రిమిత‌మైన మాజీ మంత్రులు ఉన్నారు. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిలో మ‌హానాడుతో చంద్రబాబు ఏం చేయ‌నున్నారు? ఎలాంటి దిశానిర్దేశం చేయ‌నున్నారు? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆస‌క్తిగా మారింది. అదేస‌మయంలో మ‌ళ్లీ పార్టీ అధ్యక్షుడిగా తానే ఏక‌గ్రీవంగా ఎన్నిక కానున్న నేప‌థ్యంలో పార్టీలో ఏమైనా మార్పు ఉంటుందా? అనేది ఆస‌క్తిగా మారింది. మ‌రి చూడాలి బాబు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారో..! ఏం చేస్తారో?

Tags:    

Similar News