బ్యాడ్ లక్ టీడీపీకి రిపీట్ ?

అదేంటో సుఖాలు వస్తే ఒకే కానీ. కష్టాలు వస్తే మాత్రం అన్నీ కట్టకట్టుకుని ఒకేసారి వస్తాయని అంటారు. ఇపుడు టీడీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఓ [more]

Update: 2020-05-14 13:30 GMT

అదేంటో సుఖాలు వస్తే ఒకే కానీ. కష్టాలు వస్తే మాత్రం అన్నీ కట్టకట్టుకుని ఒకేసారి వస్తాయని అంటారు. ఇపుడు టీడీపీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఓ వైపు ఎటూ అధికారం పోయింది. గత ఏడాది 23 సీట్లతో పతనం అంచులు చూసిన టీడీపీకి వరసగా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి. నిజానికి ఈ దరిద్రం 2019లోనే పట్టిందనుకోవాలేమో. పార్టీకి ప్రాణప్రదంగా భావించే మహానాడు కూడా టీడీపీ జరుపుకోలేని దుస్థితి ఇపుడు దాపురించింది. వరసగా ఇది రెండవసారి ఏడాది కావస్తోంది. టీడీపీ పార్టీ పండుగను జరుపుకోకుండా పస్తులు ఉండడం. ఇది నిజంగా పార్టీకి,క్యాడర్ కి మధ్య ఉన్న సున్నితమైన బంధాన్ని తెంచేసేలా ఉంది. మరో విధంగా చెప్పాలంటే పార్టీకి ఉత్తేజం ఇస్తూ దశ, దిశ నిర్ణయించుకునే అవకాశాన్ని కూడా లేకుండా చేస్తోంది.

నాడు అలా…

టీడీపీ 2018లో చివరి సారిగా విజయవాడలో ఆర్భాటంగా మహానాడు వేడుక జరుపుకుంది. ఆనాడు మరో ఏడాదిలో ఎన్నికలు జరుగుతాయనుకుని పార్టీ హడావుడి చేసింది. మళ్ళీ మననే అధికారంలోకి వస్తామంటూ గొప్ప ప్రకటనలు కూడా చంద్రబాబు చేశారు. ఆ మరుసటి ఏడాది 2019లో మహనాడు జరుగుతుంది అనుకుంటే ఎన్నికల ఫలితాలు సరిగ్గా మే 23న వచ్చాయి. దాంట్లో టీడీపీ దారుణంగా ఓడిపోయింది. ఆ విషాద ఘటన నుంచి కోలుకోలేక మహనాడుని మొత్తానికి రద్దు చేశారు. వచ్చే ఏడాది బాగా జరుపుకుందామని నాడు అనుకున్నారు.

కరోనా దెబ్బకు….

ఇక ఈ ఏడాది మహానాడు జరుపుకుందామనుకుంటే కరోనా దెబ్బకు ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతోంది. గత రెండు నెలలుగా చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలనే అసలు కలవడంలేదు. దాంతో మహానాడుతోనైనా బంధం పెనవేసుకుందామనుకుంటే లాక్ డౌన్ తో ఎటూ కదిలేట్టులేదు పైగా లాక్ డౌన్ మరిన్ని రోజులు కంటిన్యూ అయ్యేలా ఉంది అంటున్నారు. ఈ నేపధ్యం నుంచి చూసుకున్నపుడు లాక్ డౌన్ ఉంచినా తీసినా ఈ తక్కువ సమయంలో మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లకు సమయం సరిపోదని కూడా భావిస్తున్నారు. ఈసారి కూడా మహానాడు రద్దు అయినట్లేనని పార్టీలో వినిపిస్తోంది. ఎక్కడివారు అక్కడే ఉంటూ ఆ రోజు పార్టీ గురించి ఇంట్లోనే ఒకసారి మననం చేసుకోవడమేనని నాయకుల నుంచి ప్రస్తుతం వినిపిస్తున్న మాట.

పట్టు జారేనా…?

టీడీపీకి క్యాడరే బలం. వారి కోసమే మహానాడు లాంటి వేదికలు ఉంటాయి. అంతే కాదు, క్యాడర్ నుంచి అభిప్రాయాలు తీసుకుని పార్టీని కొత్తగా మలచుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక సంస్థాగతంగా పార్టీని బలంగా రూపొందించుకోవాలన్నా, కమిటీలు వేసి కొత్త వారికి పదవులు ఇవ్వాలన్నా కూడా మహానాడు ఒక వేదికగా ఉంటుంది. నాయకులు, కార్యకర్తలు మొత్తం ఒకేచోట చేరి సాధకబాధకాలు పంచుకునేది కూడా మహానాడులోనే. అటువంటి మహానాడు ఇలా వరసగా రెండవ ఏడాది కూడా వాయిదా పడుతుందని వార్తలు వస్తున్న నేపధ్యంలో తమ్ముళ్ళు పూర్తి నిరాశలో ఉన్నారు. మరి ఇదే కనుక కొనసాగితే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీకి కొత్త చిక్కులు తప్పవని అంటున్నారు.

Tags:    

Similar News