ఆ న‌లుగురు ఇప్పుడెక్కడ‌..?

వారంతా కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులు. కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున పుంజుకున్నప్పుడు ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి గెలిచి, అనేక ప‌ద‌వులు అలంక‌రించారు. ఎంపీలుగా, [more]

Update: 2020-02-05 15:30 GMT

వారంతా కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులు. కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున పుంజుకున్నప్పుడు ఆ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసి గెలిచి, అనేక ప‌ద‌వులు అలంక‌రించారు. ఎంపీలుగా, మంత్రులుగా కూడా చక్రాలు తిప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి వీర విధేయులుగా కూడా ముద్ర వేయించుకున్నారు. అటు రాష్ట్రంలోను, ఇటు కేంద్రంలోనూ కూడా చ‌క్రాలు తిప్పారు. మ‌రి అలాంటి నాయ‌కులు త‌ర్వాత కాలంలో కాంగ్రెస్ క‌ష్టకాలంలో ఉన్న స‌మ‌యంలో పార్టీని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో కాంగ్రెస్‌ను ప్రజ‌లు ఛీత్కరించ‌డంతో పార్టీ పూర్తిగా ప‌ట్టుత‌ప్పింది. మ‌రి ఇలాంటి స‌మ‌యంలో పార్టీని నిల‌బెట్టాల్సిన నాయ‌కులు త‌మ త‌మ వ్యూహాలు మార్చుకుని త‌మ రాజ‌కీయ అజెండాల‌ను పండించుకున్నారు.

టీడీపీలో చేరి….

ఈ క్రమంలోనే కేంద్ర మాజీ మంత్రులు ప‌న‌బాక ల‌క్ష్మి, వైరిచ‌ర్ల కిశోర్ చంద్రదేవ్ స‌హా మాజీ ఎంపీ స‌బ్బంహ‌రి, రాష్ట్ర మంత్రి కొండ్రు ముర‌ళీలు త‌మ దారి తాము చూసుకున్నారు. వాస్తవానికి అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ర‌ఘువీరారెడ్డి ఘ‌ర్ వాప‌సీ నినాదం ఇచ్చినా ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. పైగా 2019 ఎన్నిక‌ల‌కు ముందు ఈ న‌లుగురు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ చేశారు. అయ‌తే, జ‌గ‌న్ సునామీలో వీరంతా కొట్టుకు పోయారు. మ‌రి ఇప్పుడు ఏం చేస్తున్నారు? అనేది కీల‌క ప్రశ్న. అయితే, ఈ న‌లుగురిలో కేవ‌లం ఇద్దరు త‌ప్ప మిగిలిన ఇద్దరు కంటికి కూడా క‌నిపించ‌డం లేదు.

ప‌న‌బాక ల‌క్ష్మి: బాప‌ట్ల ఎంపీ స్థానం నుంచి గెలిచి.. గ‌తంలో కేంద్ర మంత్రిగా కూడా చ‌క్రం తిప్పారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల‌కు కొద్ది రోజుల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ క్రమంలోనే బాపట్ల నుంచి పోటీ చేయాల‌ని భావించినా అవ‌కాశం ద‌క్కలేదు. దీంతో ఆమె తిరుప‌తి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక‌, ప్రస్తుతం రాజ‌ధానిపై ఇంత ర‌గ‌డ జ‌రుగుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు ఓ రేంజ్‌లో ఆందోళ‌న‌లు చేస్తున్నా.. ప‌న‌బాక ఎక్కడా క‌నిపించ‌డం లేదు.

వైరిచ‌ర్ల : ఎస్టీ వ‌ర్గానికి చెందిన వైరిచ‌ర్ల అర‌కు ఎంపీ స్తానం నుంచి గతంలో విజ‌యం సాధించి కేంద్రంలో మంత్రి ప‌ద‌విని పొందారు. అయితే, కాంగ్రెస్ దెబ్బతిన‌డంతో ఆయ‌న 2019 ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీలో చేరారు. అయితే, ఈయన కూడా ఓడిపోయారు. ప్రస్తుతం ఈయ‌న కూడా ఎక్కడా క‌నిపించ‌డం లేదు.

స‌బ్బం హ‌రి: అన‌కాప‌ల్లి ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున గ‌తంలో గెలిచిన ఈయ‌న 2014లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇక‌, 2019 ఎన్నిక‌ల్లో భీమిలి నుంచి టీడీపీ త‌ర‌ఫున అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ప్రతి విష‌యంలో పార్టీల‌తో సంబంధం లేకుండా యాక్టివ్‌గా ఉండే ఆయ‌న ఓడిపోయాక టీడీపీ త‌ర‌పున వాయిస్ వినిపించ‌డం లేదన్న అభిప్రాయం స‌ర్వత్రా ఉంది.

కోండ్రు ముర‌ళి: ఎస్సీ వ‌ర్గానికి చెందిన యువ నాయ‌కుడిగా ఉన్న ముర‌ళి రాజాం నియోజ‌క‌వ‌ర్గం నుంచి అసెంబ్లీకి గెలిచి గ‌తంలో మంత్రి ప‌ద‌విని సైతం పొందారు. అయితే, 2019 ఎన్నిక‌ల్లో అప్పటి వ‌ర‌కు ఉన్న కాంగ్రెస్ జెండాను వ‌దిలి టీడీపీ అజెండాను భుజాన వేసుకున్నారు. ఈ క్రమంలోనేఆ య‌న టీడీపీ త‌ర‌ఫున పోటీ చేశారు. అయితే, ప్రజ‌లు ఆయ‌న‌ను ఓడించారు. ప్రస్తుతం టీడీపీ నుంచి వినిపిస్తున్న జంపింగుల జాబితాలో కోండ్రు పేరు ప్రముఖంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News