సైకిలెక్కి సెల్ఫ్ డిస్మిస్ అయ్యారే

రాష్ట్ర విభజన దెబ్బతో ఏపీలో కాంగ్రెస్ నేలమట్టం అయిపోయిన విషయం తెలిసిందే. ఈ దెబ్బకు కాంగ్రెస్ లో భవిష్యత్తు లేకపోవడంతో అందులోని నేతలు ఎక్కువ మంది వైసీపీలోకి, [more]

Update: 2019-12-04 06:30 GMT

రాష్ట్ర విభజన దెబ్బతో ఏపీలో కాంగ్రెస్ నేలమట్టం అయిపోయిన విషయం తెలిసిందే. ఈ దెబ్బకు కాంగ్రెస్ లో భవిష్యత్తు లేకపోవడంతో అందులోని నేతలు ఎక్కువ మంది వైసీపీలోకి, మరికొందరు టీడీపీలోకి వెళ్ళిపోయారు. క‌న్నా, కావూరి, పురందేశ్వరి లాంటి వాళ్లు బీజేపీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో వైసీపీలోకి వెళ్లిన వారు వైసీపీ ఓడిపోవడంతో కొందరు నేతలు మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. ఈ విధంగా రాష్ట్ర విభజన దెబ్బ వల్ల టీడీపీలోకి వచ్చి పడ్డ నేతల్లో కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నేతలు పిన్నమనేని వెంకటేశ్వరరావు, బూరగడ్డ వేదవ్యాస్ కూడా ఉన్నారు. ఈ ఇద్దరు నేతలు కాంగ్రెస్ లోని ఎదిగి చివరికి టీడీపీలో రాజ‌కీయంగా చివ‌రి ద‌శ‌కు వ‌చ్చేశారు.

ఈ ఇద్దరూ…

పిన్నమనేని వెంకటేశ్వరరావు రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ లోనే మొదలుపెట్టారు. తన తండ్రి పిన్నమ‌నేని కోటేశ్వరరావు కాంగ్రెస్ నేత కావడంతో ఆయన కూడా కాంగ్రెస్‌లోనే కీల‌క నేత‌గా ఎదిగారు. పిన్నమనేని తొలిసారి 1989 ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజనకు ముందున్న ముదినేపల్లి నుంచి కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 1994 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 1999. 2004 ఎన్నికల్లో గెలిచారు. ఇక 2004లో ఆయన వైఎస్ కేబినెట్ లో మంత్రి కూడా పని చేశారు. తర్వాత నియోజకవర్గాలు పునర్విభజన జరగడంతో ముదినేప‌ల్లి ర‌ద్దయ్యింది. 2009లో కాంగ్రెస్ నుంచి గుడివాడలో పోటీ చేసి ప్రస్తుతం మంత్రి కొడాలి నాని చేతిలో ఓటమి పాలయ్యారు.

పదవికి రాజీనామా చేసి….

2019లో గుడివాడ‌లో ఓడిపోయిన ఆయనకు కృష్ణా జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ పదవి ఇచ్చారు. అయితే తర్వాత వైఎస్ మరణం, రాష్ట్ర విభజనతో ఆయన టీడీపీలోకి వచ్చేశారు. టీడీపీలోకి వచ్చిన ఆయనకు పోటీ చేసే అవకాశం రాలేదు. టీడీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆప్కాబ్ చైర్మన్‌గానే కొనసాగారు. ఇక మొన్న ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడంతో పదవికి రాజీనామా చేసేశారు. అయితే రానున్న రోజుల్లో కూడా ఈయనకు మళ్ళీ పోటీ చేసే అవకాశం కూడా దక్కకపోవచ్చని తెలుస్తోంది.

టీడీపీలో చేరి…..

అటు మాజీ విప్ బూరగడ్డ వేదవ్యాస్ పరిస్తితి కూడా ఇలాగే ఉంది. 1989, 2004 ఎన్నికల్లో మల్లేశ్వరం (నియోజకవర్గాల పునర్విభజన ముందు) నుంచి కాంగ్రెస్ తర‌పున గెలిచారు. ఓ సాధార‌ణ రైతు కుటుంబం నుంచి వ‌చ్చిన ఆయ‌న దివంగ‌త వైఎస్‌కు అత్యంత స‌న్నిహితుడు. ఇక 2009లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలోకి వెళ్ళి బందరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ రోజు వైఎస్ వేద‌వ్యాస్ పార్టీ మార‌వ‌ద్దు.. మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని చెప్పినా విన‌లేదు. ఇక 2014 ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి వచ్చి పెడన నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమి తర్వాత టీడీపీలో చేరిన ఆయనకు…. మచిలీపట్నం అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (మడా) ఛైర్మన్ ఇచ్చారు. ఇక 2019 ఎన్నికల్లో ఆయనకు సీటు దక్కలేదు. ఎలాగో పార్టీ కూడా అధికారం కోల్పోవడంతో చైర్మన్ పదవికి రాజీనామా చేసేశారు.

ఉంటే గింటే…..

అయితే ప్రస్తుతానికి ఈ ఇద్దరు మాజీ కాంగ్రెస్ నేతలు టీడీపీలోనే ఉన్నప్పటికీ అంత యాక్టివ్ గా లేరు. అలా అని వీరు వైసీపీలోకి వెళ్ళే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే జగన్ ఫేడ్ ఔట్ అయిపోయిన వీరిని తీసుకోరు. దీంతో వీరు ఉంటే గింటే టీడీపీలోనే ఉండాలి. టీడీపీలో ఉంటే భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కడం కష్టం. మొత్తానికి ఈ ఇద్దరు నేతల రాజకీయం ఇంతటితో ముగిసినట్లే కనిపిస్తుంది.

Tags:    

Similar News