టీజీ దెబ్బకు జీరో అవుతారా..?

కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల్లో కర్నూలు ఒకటి. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ కుమారుడు టి.జి.భరత్ [more]

Update: 2019-04-10 03:30 GMT

కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న నియోజకవర్గాల్లో కర్నూలు ఒకటి. ఇక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ కుమారుడు టి.జి.భరత్ బరిలో ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొత్త అభ్యర్థి హఫీజ్ ఖాన్ కు టిక్కెట్ దక్కింది. వీరిద్దరి మధ్య నియోజకవర్గంలో హోరాహోరీ పోరు ఉంది. గత ఎన్నికల్లోనూ కర్నూలు నియోజకవర్గంలో పోరు తీవ్రంగా జరగగా టీడీపీ అభ్యర్థి టి.జి.వెంకటేష్ పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎస్వీ మోహన్ రెడ్డి 3,479 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత ఆయన వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ టిక్కెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్ రెడ్డితో పాటు టి.జి.భరత్ ఇద్దరూ గట్టిగా ప్రయత్నించారు. చివరకు టి.జి.భరత్ కు టిక్కెట్ దక్కడంతో మోహన్ రెడ్డి టీడీపీని వీడి షరతులు లేకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చేరిపోయారు. తనకు టిక్కెట్ ఇవ్వని టీడీపీని ఓడించేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

గట్టి పోటీ ఇస్తున్న టి.జి.భరత్

కర్నూలు నియోజకవర్గంలో టి.జి.వెంకటేష్ బలమైన నేతగా ఉన్నారు. 1999, 2009లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఆర్థికంగా బలంగా ఉన్న ఆయన ఇరవై ఏళ్లుగా నియోజకవర్గంలో రాజకీయం చేస్తున్నారు. ఈసారి తన కుమారుడిని రంగంలోకి దించాలని ముందుగానే నిర్ణయించుకున్న ఆయన టిక్కెట్ ఇప్పించగలిగారు. టి.జి.భరత్ ఐదేళ్లుగా నియోజకవర్గంలోనూ ఉంటూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపట్టారు. తనకంటూ ప్రత్యేకంగా పెద్ద ఎత్తున క్యాడర్ ను ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేకించి యువత ఆయనకు పెద్ద ఎత్తున మద్దతుగా ఉంది. ఆర్థికంగానూ చాలా బలంగా ఉండటం, తండ్రికి సైతం మంచి గుర్తింపు ఉండటం ఆయనకు కలిసి వచ్చే అవకాశం ఉంది.

మోహన్ రెడ్డి రాకతో పెరిగిన వైసీపీ బలం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి ముస్లిం వర్గానికి చెందిన హఫీజ్ ఖాన్ కు టిక్కెట్ ఇచ్చింది. ఆయన కూడా వ్యాపారి కావడం, ఆర్థికంగా బలంగా ఉండటంతో టి.జి.భరత్ కు గట్టి పోటీ ఇస్తున్నారు. కర్నూలు నియోజకవర్గంలో ముస్లింలే గెలుపోటములనుచ ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. ముస్లింలు ఏకపక్షంగా హఫీజ్ ఖాన్ వైపు మొగ్గు చూపితే ఆయన విజయం సులువే. కానీ, టి.జి.భరత్ కూడా వారిని మచ్చిక చేసుకున్నారు. ఇక, హఫీజ్ ఖాన్ రాజకీయాల్లోకి కొత్త కావడం, ప్రజల్లోకి చొచ్చుకెళ్లలేకపోతుండటం కొంత మైనస్ అవుతుంది. ఇదే సమయంలో ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వైసీపీలో చేరడం, హఫీజ్ ఖాన్ విజయానికి పూర్తిగా సహకరిస్తుండటం ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశం ఉంది. తానే అభ్యర్థి అన్నంతలా మోహన్ రెడ్డి హఫీజ్ తో కలిసి ప్రచారం చేస్తున్నారు. తనకు టిక్కెట్ దక్కకుండా చేసిన టి.జి.భరత్ ను ఓడించాలని ఆయన పట్టుదలగా ఉన్నారు. ఇక్కడ, సీపీఎం కూడా బలంగా ఉంది. 1994, 2004లో సీపీఎం ఇక్కడ విజయం సాధించింది. దీంతో జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీ కూడా బాగానే ఓట్లు సాధించే అవకాశం ఉన్నా ప్రధానంగా పోరు మాత్రం టీడీపీ – వైసీపీ మధ్యే ఉంది. ఇందులో టి.జి.భరత్ కొంత ముందున్నా ఆయనే గెలుస్తారని కచ్చితంగా చెప్పలేం.

Tags:    

Similar News