ఫ్యూచర్ బాగానే కనపడుతుందట

అదేంటో టీడీపీ తమ్ముళ్లకు ఓడిపోయిన తరువాత ఒక్క నిముషం కూడా తోచడంలేదులా ఉంది. బంపర్ మెజారిటీతో జగన్ గెలవడంతో ఇక తమ పని ఖాళీ అని అనుకున్న [more]

Update: 2019-09-05 02:00 GMT

అదేంటో టీడీపీ తమ్ముళ్లకు ఓడిపోయిన తరువాత ఒక్క నిముషం కూడా తోచడంలేదులా ఉంది. బంపర్ మెజారిటీతో జగన్ గెలవడంతో ఇక తమ పని ఖాళీ అని అనుకున్న పసుపు నేతలు ఇపుడు ఎందుకో మళ్ళీ కలుగు నుంచి బయటకు వస్తున్నారు. అమరావతి, పోలవరం రెండూ తమను జనంలోకి తీసుకువస్తాయన్న ఆశలు ఎక్కువగా ఉన్నాయెమో, మరో వైపు ఆర్ధిక మాంద్యం. ఖజానాను ఖాళీ చేసి పెట్టిన చంద్రబాబు పుణ్యమాని జగన్ నవరత్నాల హామీలను ఎటూ తీర్చలేని స్థితిలో పడ్డారు, ఇక కేంద్ర సాయం కూడా పెద్దగా లేదు, బాబుతో వేగిన మోడీ షాలకు ఇపుడు జగన్ బాగా దొరికేశారు. ఒక్క పైసా ఏపీకి ఇచ్చినా తన ఘనతగా జగన్ చెప్పుకుంటాడన్న ముందు చూపుతో కేంద్ర పెద్దలు ఉన్నారు. ఈ రకమైన పద్మవ్యూహ రాజకీయాల్లో జగన్ ఉక్కిరిబిక్కిరి అవుతూంటే భవిష్యత్తు టీడీపీ నేతలకు ముందే కనిపిస్తున్నట్లుగా ఉంది.

మూడుగా కలసి వస్తామంటున్న….

నిన్నటి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామన్నది పక్కన పెట్టి రాజకీయ లెక్కలను సీనియర్ నేత, విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీస్తున్నారు. జగన్ అంటే మోజు వల్ల ఒక్క ఛాన్స్ అని అడిగారని ఓటేశారు తప్ప చంద్రబాబు, టీడీపీ అంటే ప్రజలకు అభిమానం పోలేదని ఆయన విశ్లేషిస్తున్నారు. ఇక అమరావతి, పోలవరం వంటివి ఆపేయడం ఏపీ జనాలకు నచ్చడంలేదని అన్నారు. మరో వైపు నవరత్నాల పధకాలు సైతం జనానికి ఇవ్వలేక చతికిలపడిన జగన్ ని జనం మళ్ళీ ఎన్నుకోరని కూడా ఆయన కుండబద్దలు కొట్టి చెప్పేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ టీడీపీయే శరణ్యమని, ఇంట్లో కూర్చున్నా చంద్రబాబుని బంగారు పళ్ళెంలో పెట్టి మరీ జనం ఎన్నుకుంటారని కూడా అయ్యన్న కడు ధైర్యంగా చెప్పేస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ, జనసేనలతో కలసి తాము పొత్తులు పెట్టుకుని మరీ వస్తామని, జగన్ ని ఓడించి తీరుతామని కూడా ఆయన చెప్పేస్తున్నారు.

ఒక్కటి అయినట్లేనా..?

ఏపీలో బీజేపీ టీడీపీ మధ్య విభేధాలు పోయినట్లేనా, మరో వైపు అవినీతి టీడీపీ అంటూ నిప్పులు చెరగిన పవన్ కళ్యాణ్ సైతం బాబుతో చేయి కలిపేందుకు రెడీయేనా. అంతా కేవలం మూడు నెలల్లో జగన్ కు వ్యతిరేకంగా అలా సెట్ అయిపోయిందా, ఇక బాబు మోదీని ఏపీకి రానివ్వమని అరెస్ట్ చేస్తామని చేసిన హెచ్చరికలను మరచి బీజేపీ పొత్తులకి రెడీ అవుతుందా, బాబును జైలుకు పంపిస్తామని పెద్ద గొంతుతో చెప్పిన బీజేపీ నేతలు రాజీ పడినట్లేనా. 2024లో తామే అధికారంలోకి వస్తామని బీరాలు పలికిన బీజేపీ పొత్తులకు రెడీ అయి మరో మారు బాబును సీఎం చేయడానికి సిధ్ధమేనా అంటే ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలే. కానీ మాజీ మంత్రిగా సీనియర్ గా అయ్యన్న మాటలను కొట్టిపారేయడానికి లేదు. ఇపుడున్న పరిస్థితులు చూస్తే ఒకే గొంతుగా ఈ మూడు పార్టీలు ఉన్నాయి. మరి 2024 లో జరిగే ఎన్నికల గురించి ఇపుడే చెప్పలేం కానీ ఇప్పటికైతే మూడు పార్టీలు రహస్య మిత్రులుగా ఉన్నారని అంతా భావిస్తున్న దాన్ని అయ్యన్న తన నోటితో తానే చెప్పి గుట్టు బయటపెట్టారనుకోవాలి

Tags:    

Similar News