టీడీపీలో కోట్లకు కోట్లు మాయం చేసిందెవ‌రు? హాట్ టాపిక్‌

అవ‌కాశం వ‌స్తే.. చాలు.. అందిన కాడికి నొక్కేసే నేత‌లు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. అయితే, ఆయా విష‌యాలు మాత్రం ఎప్పుడో కానీ.. బ‌య‌ట‌కు రావు. పైగా పెద్ద [more]

Update: 2020-09-28 11:00 GMT

అవ‌కాశం వ‌స్తే.. చాలు.. అందిన కాడికి నొక్కేసే నేత‌లు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు. అయితే, ఆయా విష‌యాలు మాత్రం ఎప్పుడో కానీ.. బ‌య‌ట‌కు రావు. పైగా పెద్ద పెద్ద ప్రాంతీయ పార్టీల్లో అయితే.. ఈ విష‌యాలు చాలా గోప్యంగా ఉంచుతారు. పార్టీ ప‌రువు ఎక్కడ పోతుందోన‌నే బెంగ‌తో నాయ‌కుల నొక్కుడు వ్యవ‌హారాల‌ను లోపాయికారీగా ప‌రిష్కరించేస్తారు. ఇప్పుడు ఇలాంటి ఉదంత‌మే ఒక‌టి టీడీపీలో వెలుగు చూసింది. అది కూడా కీల‌క‌మైన ప‌శ్చిమ గోదావ‌రిజిల్లాలోనే వెలుగు చూడ‌డం గ‌మ‌నార్హం. పార్టీకి వెన్నెముక‌గా ఉన్న జిల్లాలో గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో తిరిగి పార్టీని పుంజుకునేలా చేయాల‌ని భావించిన పార్టీ అధిష్టానం.. కోట్లకు కోట్లు నిధులు ఇచ్చింది.

ఎన్నికల నిధులు ఇచ్చినా…

ఎన్నిక‌ల ఖ‌ర్చుకు ఎవ‌రూ వెనుకాడ‌వ‌ద్దని, బ‌ల‌మైన పోటీ ఇచ్చిన వైసీపీని చిత్తుగా ఓడించాల‌ని ఈ క్రమంలో నిధులు కూడా పార్టీ అధిష్టాన‌మే స‌ర్దుబాటు చేసింది. టీడీపీ అనుకున్న విధంగా ఇక్కడి మెట్ట ప్రాంతంలోని నాలుగు రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గానికీ రూ.25 కోట్లు చొప్పున ఇచ్చిన‌ట్టు నాయ‌కుల మ‌ధ్య అప్పట్లోనే చ‌ర్చ న‌డిచింది. ఇక‌, ఇక్కడ నేత‌లు కూడా అదే రేంజ్‌లో ఖ‌ర్చుచేశారు. అయితే, స్థానికంగా బ‌లంగా ఉన్న ఓ నాయ‌కుడు నిధుల విష‌యంలో అన్నీ తానై వ్యవ‌హ‌రించారు. “అధిష్టానం నుంచి నిధులు తెచ్చే బాధ్యత నాది. మీరు ఖ‌ర్చుకు ఎక్కడా వెనుకాడ‌వద్దు. ముందు మీరు ఖ‌ర్చు పెట్టుకోండి. ప్రతి పైసా కూడా నేనిప్పిస్తాను“ అని ఆయ‌న ఇక్కడి అభ్య‌ర్థుల‌కు, నియోజ‌క‌వ‌ర్గ స్థాయి నేత‌ల‌కు ఫుల్‌ హామీ ఇచ్చారు.

ఒక్కరికీ అందలేదే…?

దీంతో నాయ‌కులు చేతికి ఎముక‌లేన‌ట్టుగా ఖ‌ర్చు పెట్టారు. అయితే, వైసీపీ జోరు ముందు టీడీపీ నేతలు చ‌తికిల‌ప‌డ్డారు. ఈ విష‌యం ప‌క్కన పెడితే..తాముఅప్పట్లో చేసిన ఖ‌ర్చుకు సంబంధించి పార్టీ అధిష్టానం ఇస్తాన‌న్న నిధులు ఒక్కరికీ అంద‌క‌పోవ‌డంతో ఇప్పుడు వారంతా స‌ద‌రు నాయ‌కుడి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. మీరు ఇప్పిస్తామ‌న్నారు.. మేం అప్పులు చేసి మ‌రీ తెచ్చి ఖ‌ర్చు పెట్టాం. ఇప్పటి వ‌ర‌కు ఇప్పించ‌లేదు.. అని నిల‌దీస్తున్నారు. దీనికి స‌ద‌రు నాయ‌కుడు చెబుతున్న స‌మాధానం.. నాకు సంబంధం లేదు. ఏదైనా ఉంటే అదిష్టానంతో మాట్లాడుకోవాల‌ని..! దీంతో నాయ‌కులు చిర్రెత్తిపోతున్నారు.

ఎప్పుడో ఇచ్చేశామంటున్న……

ఇదే విష‌యాన్ని ఒక‌రిద్దరు టీడీపీ అధిస్టానం వ‌ద్ద ప్రస్థావించ‌గా.. “ఇస్తామ‌న్న నిధులు ఎప్పుడో ఇచ్చేశాం“' అని స‌మాధానం వ‌స్తోంది. దీంతో స్థానిక నాయ‌కులు ల‌బోదిబోమంటున్నారు. అధిష్టానం ఇచ్చిన నిధులు ఏమ‌య్యాయ‌ని, ఎవ‌రి జేబుల్లోకి వెళ్లాయ‌ని వారు నిప్పులు చెరుగుతున్నారు. ప్రస్తుతానికి ఈ విష‌యం నివురుగ‌ప్పిన నిప్పులా మార‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News