బాబును నమ్మి రాజకీయాలు చేయలేమంటున్నారే?

టీడీపీకి కంచుకోట లాంటి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఆ పార్టీ ప‌ట్టుకోసం విల‌విల్లాడుతోంది. గ‌తంలో ఎన్నోసార్లు ఇక్కడ పార్టీ గెలిచినా.. ఓడినా నాయ‌కులు, కేడ‌ర్‌లో మాత్రం న‌మ్మకం [more]

Update: 2020-11-25 08:00 GMT

టీడీపీకి కంచుకోట లాంటి ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఆ పార్టీ ప‌ట్టుకోసం విల‌విల్లాడుతోంది. గ‌తంలో ఎన్నోసార్లు ఇక్కడ పార్టీ గెలిచినా.. ఓడినా నాయ‌కులు, కేడ‌ర్‌లో మాత్రం న‌మ్మకం ఎప్పుడూ చెక్కుచెద‌ర్లేదు. అలాంటి కంచుకోట‌లో గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోయాక దీన‌స్థితికి వెళ్లిపోయింది. పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ఉండి, పాల‌కొల్లును వ‌దిలేస్తే మిగిలిన 13 నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నీసం ఆరు చోట్ల పార్టీని న‌డిపించే నాథుడు లేడు. చింత‌ల‌పూడి, తాడేపల్లిగూడెం లాంటి చోట్ల చంద్రబాబు చేసిన ప్రయోగాలు తుస్సుమ‌న్నాయి. తాడేపల్లిగూడెం సీటు ఆశించిన మాజీ జ‌డ్పీచైర్మన్ ముళ్లపూడి బాపిరాజును కాద‌ని చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే ఈలి నానికి సీటు ఇవ్వగా.. ఆయ‌న ఓడిపోయిన‌ప్పటి నుంచి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కాడి కింద ప‌డేశారు. నాని వైసీపీలోకి వెళ్లేందుకు ఆ పార్టీ నేత‌ల‌తో అంట కాగుతున్నారు.

బలమైన నేతలకు…..

రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గం అయిన చింత‌ల‌పూడిలో మాజీ మంత్రి పీతల సుజాత‌ను కాద‌ని.. అవుట్ డేటెడ్ లీడ‌ర్ అయిన క‌ర్రా రాజారావుకు సీటు ఇచ్చారు. 2009లో ఓడిన క‌ర్రా మ‌ళ్లీ ప‌దేళ్ల త‌ర్వాత 2019లో పోటీ చేసి మ‌రోసారి ఓడిపోయారు. వ‌య‌స్సు పైబ‌డ‌డంతో నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీని ప‌ట్టించుకున్న ప‌రిస్థితే లేదు. గ‌తంలో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన ఘంటా ముర‌ళీ టీడీపీలో ఉన్నా పార్టీకి ఒరిగిందేమి లేదు. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌మైన నేత‌ల‌కు పార్టీ ప‌గ్గాలు అప్పగిస్తే పార్టీ పుంజుకుంటుంద‌ని.. లేక‌పోతే పార్టీ ఘోరంగా న‌ష్టపోక త‌ప్పద‌ని పార్టీ శ్రేణులే గ‌గ్గోలు పెడుతున్నాయి.

పార్టీని పూర్తిగా వదిలేసి….

ఇక కొవ్వూరులో గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన దిగుమ‌తి నేత అనిత తిరిగి పాయ‌క‌రావుపేట‌కు వెళ్లిపోగా ఇప్పుడు అక్కడ ఇన్‌చార్జ్ కోసం మాజీ మంత్రి జ‌వ‌హ‌ర్ క‌న్నేసి ఉన్నారు. జ‌వ‌హ‌ర్ వ్యతిరేక వ‌ర్గం ఆయ‌న వ‌ద్దని మ‌ళ్లీ పోరాటానికి దిగుతుండ‌డంతో చంద్రబాబు ఏం తేల్చలేని ప‌రిస్థితి. కొవ్వూరులో క‌మ్మ వ‌ర్గానికి చెందిన కీల‌క నేత‌లు ఉన్నా వారు కూడా ఒకే తాటిమీద‌కు రాక‌పోవ‌డం.. నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్‌చార్జ్ లేక‌పోవ‌డంతో పార్టీ అనాథ‌లా మారింది. భీమ‌వ‌రంలో మాజీ మంత్రి గంటా వియ్యంకుడు పుల‌ప‌ర్తి అంజిబాబు అస‌లు త‌న‌కేం సంబంధం లేద‌న్నట్టుగా వ్యవ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న గ‌త ఎన్నిక‌ల్లోనే మార్చాల‌నుకున్న బాబు మొహ‌మాటానికి పోయి సీటు ఇవ్వడంతో మూడో స్థానంతో స‌రిపెట్టుకున్నారు. ఇప్పుడు గంటా రూట్లో వెళ్లేందుకు టీడీపీని వ‌దిలేశారు. భీమ‌వ‌రంలో వీలైనంత త్వర‌గా కొత్త నేత‌కు పార్టీ ప‌గ్గాలు ఇవ్వక‌పోతే పార్టీ బ‌తికే ప‌రిస్థితే లేదని కేడ‌ర్ గ‌గ్గోలు పెడుతోంది.

సమర్థత లేని నేతలకు…..

న‌ర‌సాపురంలో మాజీ ఎమ్మెల్యేకు పార్టీని న‌డిపే స‌మ‌ర్థత లేద‌ని టీడీపీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన నేత‌, మాజీ మంత్రి కొత్తప‌ల్లి సుబ్బారాయుడును బాబు వ‌దులుకోవ‌డంతో ఆయ‌న వైసీపీకి వెళ్లిపోయారు. బండారు మూడో స్థానంతో స‌రిపెట్టుకోవ‌డంతో న‌ర‌సాపురం అసెంబ్లీ సీటుతో పాటు ఎంపీ సీటు కూడా కోల్పోవాల్సి వ‌చ్చింది. నిడ‌ద‌వోలులో రెండు సార్లు గెలిచిన సీనియ‌ర్ నేత బూరుగుప‌ల్లి శేషారావు రాజ‌కీయాల‌పై అనాస‌క్తితో ఉన్నట్టు ఆయ‌న అనుచ‌రులు చెవులు కొరుక్కుంటున్నారు. ఫ్యామిలీలో వ‌చ్చిన విబేధాల‌తో పాటు చంద్రబాబును న‌మ్మి రాజ‌కీయాలు చేయ‌లేం అని శేషారావు అస‌హ‌నంతో ఉన్నట్టు పార్డీ కేడ‌రే చెవులు కొరుక్కుంటోంది. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ దుస్థితిపై చంద్రబాబు మేల్కోని స‌మ‌ర్థులు అయిన నేత‌ల‌కు పగ్గాలు ఇవ్వక‌పోతే ద్వితీయ శ్రేణి కేడ‌ర్‌, కీల‌క నాయ‌కులు పార్టీకి దూర‌మైపోయే ప్రమాదం ఉంది.

Tags:    

Similar News