అలాంటి వారికి టిక్కెట్లు ఇస్తే అంతేగా మరి

అందుకే ఊరికే అనలేదు… పార్టీలు మారే వారికి టిక్కెట్లు ఇచ్చుకుంటూ పోతే ఆ పార్టీ భవిష్యత్ ఎప్పటికీ బాగుపడదు. చూడ్డానికి కొన్ని రోజులు పైకి బాగుంటేదేమో కాని [more]

Update: 2020-09-17 15:30 GMT

అందుకే ఊరికే అనలేదు… పార్టీలు మారే వారికి టిక్కెట్లు ఇచ్చుకుంటూ పోతే ఆ పార్టీ భవిష్యత్ ఎప్పటికీ బాగుపడదు. చూడ్డానికి కొన్ని రోజులు పైకి బాగుంటేదేమో కాని దీర్ఘకాలంలో మాత్రం పార్టీ మనుగడకే ఇబ్బందిగా మారుతుంది. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి వర్తిస్తుంది. పార్టీ కోసం కష్టపడిన వారిని కాకుండా అప్పటికప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేవారిని, ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకోవడంతోనే తెలుగుదేశం పార్టీ విశాఖలో దారుణంగా దెబ్బతినింది.

మూడు పార్లమెంటు స్థానాల్లో….

విశాఖ జిల్లాలో మూడు పార్లమెంటు నియోజకవర్గాలున్నాయి. గత 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. వారు ఇప్పుడు పార్టీ వైపు కన్నెత్తి చూడటం లేదు. సహజంగా డబ్బు, వ్యాపారాలున్న వారికే తెలుగుదేశం పార్టీ టిక్కెట్లు ఇవ్వడాన్ని చంద్రబాబు హయాంలో శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా విశాఖ ఎంపీగా గీతం సంస్థల అధినేత శ్రీభరత్ ను, అనకాపల్లి నుంచి ఆడారి ఆనంద్, అరకు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన కిశోర్ చంద్రదేవ్ కు టిక్కెట్ లు ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో ముగ్గురూ ఓటమి పాలయ్యారు.

ఖర్చు పెట్టేందుకు కూడా…..

విశాఖ ఎంపీగా పోటీచేసిన శ్రీభరత్ తన ఓటమికి టీడీపీ నేతలే కారణమని భావిస్తూ ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాను అధిష్టానానికి ఈ విషయాన్ని నివేదికలతో సహా ఇచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని శ్రీ భరత్ అసహనంతో ఉన్నారని సమాచారం. అందుకే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఖర్చు కూడా పార్టీ కోసం పెట్టడం లేదు. ఇటీవల కొందరు పార్టీ కార్యాలయం, కార్యక్రమాల నిర్వహణ కోసం కొంత మొత్తాన్ని ఇవ్వాలని శ్రీభరత్ వద్దకు వెళ్లగా ఆయన తిరస్కరించినట్లు తెలుస్తోంది.

పార్టీకి దూరంగా…..

ఇక అనకాపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆడారి ఆనంద్ వైసీపీలో చేరిపోయారు. ఇప్పుడు అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పార్టీని పట్టించుకునే వారు లేరు. ఎవరిని నియమించాలనుకున్నా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో వారు అంగీకరించడం లేదు. ఇక అరకు పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కిశోర్ చంద్రదేవ్ అసలు పార్టీలోనే లేడనుకోవాలి. ఆయన ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీకే పరిమితమయ్యారు. ఇలా విశాఖలోనూ మూడు పార్లమెంటు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి నాయకత్వం అనేది లేకుండా పోయిందంటున్నారు.

Tags:    

Similar News