ఎందుకు అలా బదనాం అవుతోంది…?

తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రా జిల్లాలు కంచు కోటలు అన్న సంగతి తెలిసిందే. ఇక ఉత్తరాంధ్ర ముఖ ద్వారమైన విశాఖ నుంచి తెలుగుదేశం ఎన్నో రాజకీయాలు చేసింది, చూసింది. [more]

Update: 2020-12-27 03:30 GMT

తెలుగుదేశం పార్టీకి ఉత్తరాంధ్రా జిల్లాలు కంచు కోటలు అన్న సంగతి తెలిసిందే. ఇక ఉత్తరాంధ్ర ముఖ ద్వారమైన విశాఖ నుంచి తెలుగుదేశం ఎన్నో రాజకీయాలు చేసింది, చూసింది. 2019 ఎన్నికలు వచ్చేంతవరకూ టీడీపీ విశాఖ ఇంత షాక్ ఇస్తుందని అసలు తెలియదు. ఎక్కడ ఓటింగ్ తారుమారు అయినా తమను కాపాడేసి గౌరవప్రదమైన సీట్లు కట్టబెట్టించే బాధ్యతను ఉత్తరాంధ్ర జిల్లాలు తీసుకుంటాయని అధినేత చంద్రబాబు సహా టీడీపీ నాయకులు తెగ నమ్ముతారు. కానీ వారి నమ్మకాన్ని తొలిసారి వమ్ము చేసింది ఈ ప్రాంతం. ఇపుడు అదే చోట రాజధాని నగరంగా విశాఖను జగన్ ఎంచుకున్నారు. అదే కాదు ఆపరేషన్ ఆక్రమణల పేరిట తెగ దంచుతున్నారు.

వీకెండ్ ఉతుకుడు…..

వారాంతం వస్తే విశాఖలో సందడే వేరుగా ఉంటుంది. సీజన్ ఏదైనా జనాలు టూరిజం స్పాట్ల దగ్గర హడావుడి చేస్తూ కనిపిస్తారు. ఓ విధంగా హాలీడే మూడ్ అంతా ఉంటుంది. ఆనందమంతా అన్ని రంగాలకు చెందిన జనాల్లోనూ కనిపిస్తుంది. అదేంటో కానీ గత కొన్ని వారాలుగా చూసుకుంటే విశాఖలో వీకెండ్ వస్తే తెలుగుదేశం నాయకులు వణుకుతున్నారు. తమకు ఆనందం లేకపోగా నిండా విషాదం నింపేస్తూ వీకెండ్స్ విలన్లను చేస్తున్నాయని కూడా వాపోతున్నారు. విశాఖను గుత్తకు తీసుకున్నట్లుగా చాలా మంది వలస నేతలు వచ్చి మంత్రులు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిపోయారు. మరి వారు చేసిన ఉద్ధరణ ఏంటన్నది వీకెండ్స్ ఉతుకుడు ద్వారా వైసీపీ పాతిక లక్షల‌ మంది సిటీ జనానికి కళ్ళకు కట్టినట్లుగా చూపించేస్తోంది.

నలుగురిలో ఇద్దరు …..

ఇప్పటికి విశాఖ సిటీలో ఎంతో మంది బడా నాయకుల గోత్రాలను బట్ట బయలు చేసిన వైసీపీ సర్కార్ ఆపరేషన్ భూ కబ్జాల పేరిట ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా బుక్ చేసేసింది. మాజీ మంత్రి తాజా ఎమ్మెల్యే అయిన గంటా శ్రీనివాసరావుకు చెందిన భూములు అంటూ కొన్ని వారాల కిందట ఆనందపురంలో స్వాధీనపరచుకున సంగతి విదితేమే. అవి ఆక్రమణలకు గురి అయ్యాయని చెప్పి మరీ రెవిన్యూ సిబ్బంది తాళాలు వేశారు. దాని మీద స్టే తెచ్చుకున్న గంటాకు ఇపుడు అసలైన తంటా ముందు ఉంది అంటున్నారు. ఇపుడు మరో తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుకు చెందిన అక్రమాల గుట్టుని వైసీపీ సర్కార్ బయట పెట్టేసి ఇద్దరు ఎమ్మెల్యేలు అవుట్ అని డిక్లేర్ చేసేసింది.

బాబుకు విధేయుడుగా….

వెలగపూడి తెలుగుదేశంలో చంద్రబాబుకు వీర విధేయుడు. కమ్మ సామాజికవ‌ర్గానికి చెందిన ఆయన అసలు ప్లేస్ విజయవాడ. ఆయన విశాఖకు లిక్కర్ వ్యాపారం నిమిత్తం వచ్చి లక్ కలసిరావడంతో ఎదురులేని నేతగా మూడు సార్ల్లు ఎమ్మెల్యే అయిపోయారు. ఆయన తూర్పు నియోజకవర్గంలో ప్రభుత్వ భూములను కబ్జా చేశారని ఇప్పటిదాకా ప్రచారం చేస్తూ వచ్చిన వైసీపీ ఇపుడు నగరంలో అత్యంత ఖరీదు చేసే రుషికొండ ప్రాంతంలో కబ్జా భూములను స్వాధీనం చేసుకుని సర్కార్ జెండా పాతేసింది. దాంతో ఇపుడు వెలగపూడి సహా టీడీపీ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది అంటున్నారు. ఇది ఆరంభం మాత్రమేనని ఇంకా తెలుగుదేశం నేతలు, ఎమ్మెల్యేలు చేసిన కబ్జాల గుట్టు బయటపెడుతూనే ఉంటామని వైసీపీ నేతలు గట్టిగానే చెబుతున్నారు. మొత్తానికి టీవీ సీరియల్ మాదిరిగా సాగుతున్న ఆపరేషన్ ఎపిసోడ్ పుణ్యమాని తెలుగుదేశం నేతలను జనంలో బదనాం చేయడంలో వైసీపీ సక్సెస్ అయింది అంటున్నారు.

Tags:    

Similar News