అపరిచితుడి టైపులో అర్థకాకుండా మాట్లాడితే ఎలా?

చంద్రబాబు రెండు కళ్ల సిధ్ధాంతం చాలా పాపులర్. దాని వల్ల ఆయన ఏం బావుకున్నారో అందరికీ తెలిసిందే. కానీ తక్షణ ప్రమాదాన్ని, ఇబ్బందులను తప్పించుకున్నారన్నది నిజం. ఇపుడు [more]

Update: 2020-08-18 13:30 GMT

చంద్రబాబు రెండు కళ్ల సిధ్ధాంతం చాలా పాపులర్. దాని వల్ల ఆయన ఏం బావుకున్నారో అందరికీ తెలిసిందే. కానీ తక్షణ ప్రమాదాన్ని, ఇబ్బందులను తప్పించుకున్నారన్నది నిజం. ఇపుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తెలంగాణాలో టీడీపీ చిత్తుగా పోయింది. ఏపీలో మిణుకుమిణుకుమంటోంది. అంటే ఓ విధంగా ఫెయిల్యూర్ అయిన ఈ సిధ్ధాంతాన్ని మళ్ళీ తమ్ముళ్ళు నెత్తికెక్కించు కుంటున్నారు అంటే చంద్రబాబు స్పూర్తిగానే అనుకోవాలి. విశాఖ రాజధాని ఒక వైపు ఉంది. మరో వైపు టీడీపీ డిమాండ్ గా ఏకైక రాజధాని అమరావతి ఉంది. మరి విశాఖ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎటు ఉంటారు, ఏ మాట మీద నిలబడతారు. ఇదంతా ఒక డైలామా. ఇంతకాలం అందులోనే పడికొట్టుకున్న నలుగురు ఎమ్మెల్యేలకు టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ హోదాలో వాసుపల్లి గణేష్ కుమార్ దిశానిర్దేశం చేశారు. విశాఖ రాజధాని వద్దు అనం కానీ అమరావతి కూడా ముద్దే అంటూ వింత వాదనను జనం ముందు పెట్టారు.

అలాగేనన్నమాట‌….

తాను తొలుత విశాఖ వాసిని, నగరం పౌరుడిని, అందువల్ల విశాఖను రాజధానిగా చేస్తే తాను తప్పకుండా ఆనందపడతాను అని వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పుకున్నారు. అదే సమయంలో తాను కేవలం పౌరుడిని మాత్రమే కాదని, విశాఖ అర్బన్ జిల్లా టీడీపీ ప్రెసిడెంట్ ని కూడా, అందువల్ల టీడీపీ డిమాండ్ ప్రకారం అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని కోరుతానంటూ ట్విస్ట్ ఇచ్చారు. అంటే తన మనసు విశాఖ అంటున్నా బాస్ చంద్రబాబు మాట ప్రకారం అమరావతి అనక తప్పడంలేదు అని వాసుపల్లి వివరణ ఇస్తున్నారు.

డైలామాతోనే…..

రాజకీయాలు ఇపుడు కచ్చితంగా ఉంటున్నాయి. ఇది చేస్తాను అని చెప్పడం కాదు, చేసి చూపించిన వారినే జనం మెచ్చుతున్నారు. జగన్ కూడా అందుకే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి చూస్తున్నారు. మరి సోషల్ మీడియా యుగం, టెక్నాలజీ శకంలో కూడా మాటలతో మభ్యపెట్టడం కుదిరే పనేనా. అపుడెపుడో పదేళ్ల క్రితమే టీయారెస్ నేత హరీష్ రావు రెండు కళ్ళూ వేరు అయినా చూసే చూపు ఒక్కటే కదా బాబు అంటూ ఎద్దేవా చేశారు. ఇపుడు వాసుపల్లి మనిషి, మనసు ప్రెసిడెంట్ ఇలా తనను తాను వేరువేరుగా విభజించుకుంటూ చెబుతున్న మాటల్ల్లో అర్ధాలు, పరమార్ధాలు జనాలకు తెలియవా అన్న ప్రశ్న కూడా వస్తోంది. విశాఖ పౌరుడే ఎమ్మెల్యే అయ్యింది. ఆయనే టీడీపీ ప్రెసిడెంట్ కూడా అయింది. మరి వాసుపల్లికి కూడా ఒక్క ఓటే ఉంటుంది కానీ రెండు ఉండవుగా అని వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఈ రకమైన డైలామాతోనే పార్టీకి తనకు కూడా పొలిటికల్ డేంజర్ తెచ్చుకుంటున్నారా అన్న చర్చ కూడా ఉంది.

తమ్ముళ్ళూ ఇదేనా….

ఇక వాసుపల్లి రూటే బెటర్ అని తమ్ముళ్ళు అనుకుంటున్నారా. చంద్రబాబు తలంటు పెడుతూ అమరావతికి మద్దతుగా మీడియా ముందుకు రమ్మంటున్నారు. మరి కర్ర విరగకుండా పాము చావకుండా వాసుపల్లి చెప్పినట్లుగానే టీడీపీ ఎమ్మెల్యే తమ్ముళ్ళు ఇదే ముక్కను చెబుతారా అన్నది చూడాలి. సరే తమ్ముళ్ళకు పార్టీ కావాలి, ప్రజలూ కావాలి. మరి వారికి ఇది ఇరకాటమైన విషయమే. కానీ ఇలా అతి తెలివి చూపించి అపరిచితుడి టైపులో అయోమయంగా మాట్లాడి అందులో రాజకీయ లబ్ది పొందలనుకుంటే మాత్రం జనాలు అన్నీ తెలుసు అన్నది గుర్తు పెట్టుకోవాలని విశాఖ మేధావులు సూచిస్తున్నారు. తమకు విశాఖ రాజధాని కావాలంటే అధినేతకు కూడా నచ్చచెప్పి ఇదే రూట్లోకి తీసుకురావాలని కూడా వైసీపీ నేతలు అంటున్నారు. ఏది ఏమైనా వాసుపల్లి సహా టీడీపీ తమ్ముళ్ళు ఈ రెండు కళ్ల సిధ్ధాంతంతో ఎక్కువ రోజులు లాగలేరని కూడా అంతటా వినిపిస్తున్న మాట.

Tags:    

Similar News