నోళ్ళు లేస్తున్నాయి…దేనికో?

ఆరు నెలల పాటు స్తబ్దుగా ఉన్న విశాఖ జిల్లా టీడీపీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళ నోళ్ళు మళ్లీ లేస్తున్నాయి. పార్టీలో తాము కూడా ఉన్నామని చెప్పుకుంటున్నారు. మీడియా ముందుకు [more]

Update: 2019-11-12 13:30 GMT

ఆరు నెలల పాటు స్తబ్దుగా ఉన్న విశాఖ జిల్లా టీడీపీ తమ్ముళ్ళు, చెల్లెళ్ళ నోళ్ళు మళ్లీ లేస్తున్నాయి. పార్టీలో తాము కూడా ఉన్నామని చెప్పుకుంటున్నారు. మీడియా ముందుకు వస్తున్నారు. వైసీపీ సర్కార్ మీద విమర్శలు చేస్తున్నారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి జగన్ సర్కార్ మీద తాజాగా గట్టిగానే తగులుకున్నారు. ఏపీ అసలు పాలన ఉందా అంటూ పెద్ద మాటలే ఆయన వాడేశారు. రాష్ట్ర ఎటు పోతోందో అర్ధం కావడం లేదని ఈ పెద్దాయన ఆవేదన చెందారు. ఏపీలో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది, జగన్ కి పాలన మీద పట్టు లేదని కూడా బండారు తేల్చేశారు. చంద్రబాబు హయాంలో అన్ని విధాలుగా ముందుకెళ్ళిన రాష్ట్రం ఇపుడు ఎక్కడ ఉందో అర్ధం కావడంలెదని అంటున్నారు.

అన్నింటా ఫెయిల్…

ఇక పాయకరావుపేటకు చెందిన మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఫెయిర్ బ్రాండ్ అనిత సైతం జగన్ సర్కార్ మీద ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఏపీలో శాంతి భద్రతలు లేవని అచ్చం చంద్రబాబు గొంతుతోనే మాట్లాడుతున్నారు. ప్రభుత్వానికి ఏ విషయం మీదా కూడా అవగాహ‌న లేదని, ఆరు నెలల్లోనే జన విశ్వాసం జగన్ కోల్పోయాడని కూడా ఆమె విశ్లేషించేశారు. టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృధ్ధి కార్యక్రమాలు నిలిపివేయడమే తప్ప కొత్తగా చేసిందేమిటని కూడా అనిత ప్రశ్నిస్తున్నారు. మంత్రులు సైతం జిల్లా సమస్యలను ఎక్కడా పట్టించుకోవడంలేదని, అన్ని వర్గాల ప్రజలు వైసీపీ పాలనలో నష్టపోయామన్న బాధతో ఉన్నారని అనిత చెబుతున్నారు.

పార్టీలో ఉన్నట్లేనా…?

ఇలా ఈ ఇద్దరు నాయకులు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం చూస్తూంటే వారు పార్టీలో ఉన్నట్లేనా అన్న సంశయం తమ్ముళ్లకే కలుగుతోందట. ఎందుకంటే ఈ ఇద్దరూ గంటా వర్గంగా పేరు పడ్డారు. అయిదేళ్ళ పాటు పార్టీ అధికారంలో ఉన్నపుడు మంత్రి గారి బ్యాచ్ లో తిరిగారు. ఇపుడు వీరు భారీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే గంటాతో ఉన్నట్లా లేక పార్టీలో కొనసాగుతారా అన్నది అర్ధం కావడం లేదని పసుపు శిబిరంలోనే వినిపిస్తున్న మాట.

గంటా శిబిరంలోనే…..

నిజానికి గంటా పార్టీ మారితే తనతో పాటు పెద్ద బ్యాచ్ ని తీసుకువెళ్తారు, అప్పట్లో అనితకు టికెట్ ఇప్పించింది గంటాయేనని కూడా అంటారు. మరి ఆమె గంటాతో వెళ్తారా లేక తాము ఎక్కడికీ వెళ్ళడంలేదని చెప్పడానికి పెద్ద గొంతు చేసుకున్నారా అన్న డౌట్లు వస్తున్నాయి. మరో వైపు టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రున్ని వ్యతిరేకించే మాజీ మంత్రి బండారు గంటా శిబిరంలోనే ఉన్నారు. అయితే ఆయన కూడా టీడీపీలో ఉంటారా లేక కుమారుడి రాజకీయం కోసం కొత్త ప్లాన్ ఏదైనా వేస్తున్నారా అన్నది తెలియడంలేదని అంటున్నారు. మొత్తం మీద టీడీపీ తమ్ముళ్ళు మాట్లాడినా చర్చగానే ఉంది. మౌనంగా ఉన్నా పెద్ద చర్చ అవుతోంది.

Tags:    

Similar News