ఇక ఇక్కడ కోలుకోవడం కష్టమేనేమో… ?

విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీని చూస్తే తమ్ముళ్ళకే కాదు ఎన్నో సార్లు ఓటేసిన అభిమానులకే బాధ కలుగుతుంది. కంచుకోట నేడు మంచుకోటగా మారిపోయింది అని కలత చెందని [more]

Update: 2021-08-01 05:00 GMT

విశాఖ జిల్లాలో తెలుగుదేశం పార్టీని చూస్తే తమ్ముళ్ళకే కాదు ఎన్నో సార్లు ఓటేసిన అభిమానులకే బాధ కలుగుతుంది. కంచుకోట నేడు మంచుకోటగా మారిపోయింది అని కలత చెందని పసుపు పార్టీ కార్యకర్త లేడంటే అతి శయోక్తి కాదు. విశాఖ జిల్లాలో పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు, మూడు లోక్ సభ సీట్లు ఉన్నాయి. ఈ రోజుకు చూస్తే వీటిలో ఒక్క చోట అయినా గెలుస్తామన్న ధీమా అయితే ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ పార్టీకి లేదు అంటే గుండె బాదుకోవాల్సిందే కదా. ఏ వైపు చూసినా నిరాశా నిట్టూర్పులే తప్ప వేరేమీ కానరావడంలేదు అని తెలుగుదేశం పార్టీ నేతలు కలవరపడుతున్నారు.

ఆ దాఖలాలేవీ…?

సార్వత్రిక ఎన్నికలు జరిగి రెండేళ్లు దాటిపోయాయి. ఈ మధ్యలో లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి. గతం కంటే పార్టీ పుంజుకుందా. ఒక్క ఓటు అయినా అదనంగా దక్కిందా అంటే లేదు అనే జవాబు వస్తోంది. విశాఖలో తెలుగుదేశం పార్టీకి మేటి అయిన నాయకులు ఎక్కువగానే ఉన్నారు. కానీ వారెవరూ ఇపుడు నోరు విప్పలేని స్థితిలో ఉన్నారు. మరో వైపు వైసీపీ జిల్లా మీద పూర్తిగా రాజకీయ ఆధిపత్యం చాటుకుంది. తెలుగుదేశం పార్టీ నుంచి లాగేసిన బలమైన నాయకులు కూడా ఇపుడు ఆ పార్టీలో ఉన్నారు. దాంతో ఫ్యాన్ గాలి ఎటు చూసినా తుఫాన్ లాగే వీస్తోంది. ఇక ఓడిన సీట్లతో పాటు గెలిచిన చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఒక్కలాగానే ఉంది.

నిలబడే నాధుడేడీ….?

విశాఖ సిటీలో చూసుకుంటే సౌత్ లో వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలో చేరిపోయారు. అక్కడ తెలుగుదేశం పార్టీకి ఈ రోజుకు ఇంచార్జి లేడు. విశాఖ ఉత్తరానికి గంటా శ్రీనివాసరావు రాజీనామా చేస్తే అక్కడ మరో నాధుడు లేడు. పశ్చిమాన ఎమ్మెల్యే గణబాబు సౌండ్ లేదు, తూర్పులో కూడా తెలుగుదేశం పార్టీ కోటలు బీటలు వారి భారీ మార్పు వచ్చేసింది. ఇక మిగిలినవి అన్నీ కూడా వైసీపీ సీట్లే. భీమిలీలో ఈ రోజుకు టీడీపీకి లీడర్ లేడు. గాజువాకలో ఆ పార్టీలో వర్గ పోరు ఉంటే పెందుర్తిలో ఓడిన బండారు సత్యనారాయణమూర్తి తప్ప వేరే దిక్కు లేదు. అలాగే అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరం, మాడుగులలో ధీటైన లీడర్ షిప్ లేదనే మాట ఉంది. ఇక పాయకరావుపేటలో వైసీపీ స్ట్రాంగ్ గా ఉంటే నానాటికీ తెలుగుదేశం పార్టీ వీక్ అవుతోంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి నర్శీపట్నంలో సైతం ఇదే సీన్ కనిపిస్తోంది. మరో వైపు ఏజెన్సీ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదేమో.

వారిదే పై చేయి…?

ఇప్పటికిపుడు ఎన్నికలు జరిగితే వైసీపీయే మరో మారు విశాఖలో జెండా ఎగరేస్తుంది అన్నది తాజా సర్వే చెబుతున్న మాట. అటు రూరల్, ఇటు అర్బన్, మరో వైపు ఏజెన్సీ అన్న తేడా లేకుండా ఫ్యాన్ పార్టీ గట్టిగానే బలపడింది అంటున్నారు. ఇక అధికార పార్టీ నేతలు చెబుతున్నట్లుగానే రాజధాని కనుక విశాఖ వస్తే వైసీపీకి ఇంకా పట్టు పెరుగుతుంది. అపుడు ఈ మాత్రం నేతలు కూడా తెలుగుదేశం పార్టీకి మిగలరు అన్న చర్చ కూడా సాగుతోంది. ఉత్తరాంధ్రా ముఖ ద్వారంగా ఉన్న విశాఖ నుంచే వైసీపీ తన రాజకీయానికి పదును పెడుతోంది. దాంతో ఉత్తరాంధ్రా జిల్లాలను తన వైపునకు తిప్పుకోకుండా తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అంటే కష్టసాధ్యమే అన్నది తెలిసిందే. కరోనా తగ్గాక ఈ ప్రాంతాల మీద దృష్టి పెట్టాలని టీడీపీ అధినాయకత్వం ఆలోచిస్తోందిట. మరి తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం తీసుకునే చర్యల మీదనే ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని తమ్ముళ్ళు అంటున్నారు.

Tags:    

Similar News