నాలుగు దిక్కులూ చెల్లా చెదురూ ?

ఉత్తరాంధ్ర అంతటా ఓడిపోతేనేమి. మెగా సిటీ విశాఖలోని నాలుగు దిక్కులా పసుపుదనం నిండుగా పరచుకుంది అన్న సంబరం తమ్ముళ్ళకు అట్టే కాలం నిలవలేదు. పేరుకే నలుగురు టీడీపీ [more]

Update: 2021-04-30 14:30 GMT

ఉత్తరాంధ్ర అంతటా ఓడిపోతేనేమి. మెగా సిటీ విశాఖలోని నాలుగు దిక్కులా పసుపుదనం నిండుగా పరచుకుంది అన్న సంబరం తమ్ముళ్ళకు అట్టే కాలం నిలవలేదు. పేరుకే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు విశాఖ మేయర్ సీటు వైసీపీకి దక్కడంతో పోయిందిగా పరువు అన్న మాట తమ్ముళ్ళ నోట వినిపిస్తోంది. ఇక విశాఖ సిటీలో కూడా గట్టిగా కాలు పెట్టేసిన వైసీపీ అంతటితో ఊరుకుంటుందా టీడీపీ ఎమ్మెల్యేల ఆధిపత్యానికి గండి కొడుతూ జోరుగా దూసుకుపోతోంది.

పశ్చిమాన పరేషాన్….

విశాఖ పశ్చిమ నియోజ‌కవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా పెతకంశెట్టి గణబాబు ఉన్నారు. ఆయన తండ్రి పెతకంశెట్టి అప్పలనరసింహం ద్రోణంరాజు సత్యనారాయణ స్థాయి నాయకుడు. కాంగ్రెస్ లో ఉంటూ టీడీపీ పెట్టడంతో అందులోకి వచ్చిన తొట్ట తొలి నేత. ఎన్టీయార్ ఆయన్ని గౌరవించి ఎమ్మెల్యేగా, ఎంపీగా చేశారు. ఇక ఆయన వారసుడిగా వచ్చిన గణబాబు ఇప్పటికి మూడు విడతలుగా ఎమ్మెల్యేగా నెగ్గుతూ వచ్చారు. మధ్యలో ప్రజరాజ్యం పార్టీలోకి వెళ్ళినా కూడా మళ్లీ సైకిలెక్కేశారు. ఇలా టీడీపీ నుంచే ఆయన విజయాలు అందుకున్నారు. ఇపుడు ఆ పశ్చిమ టీడీపీ కోటకే బీటలు వారిపోతున్నాయని తమ్ముళ్ళు తెగ పరేషాన్ అవుతున్నారు.

గోడ దూకుళ్ళేగా …?

పశ్చిమ నుంచి గణబాబుని వైసీపీలోకి చేర్చుకోవాలని అప్పట్లో కొంత ప్రయత్నం జరిగింది. మొదట్లో ఆయన ఏమనుకున్నారో కానీ కొంత సైలెంట్ అయ్యారు. దాంతో పార్టీ వారికి కూడా అనుమానం వచ్చింది. మళ్ళీ ఆయన టీడీపీలో యాక్టివ్ అయినా మునుపటి జోరు కనిపించడంలేదు. ఇదే అదనుగా వైసీపీ అక్కడ దూకుడు పెంచేసింది. మహా విశాఖ కార్పొరేషన్ ఎన్నికల్లో మెజారిటీ వార్డులను ఇక్కడ గెలుచుకుని సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేకు గట్టి దెబ్బ కొట్టేసింది. ఇపుడు వరసగా టీడీపీలోని బలమైన నాయకులను వైసీపీలోకి చేర్పించే పనిలో మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ బిజీగా ఉన్నారు. మొత్తానికి విశాఖ పశ్చిమంలో టీడీపీ పునాదులు బాగానే కదులుతున్నాయని చెప్పాల్సిందే.

ఆ మూడూ అంతేగా…?

విశాఖ సౌత్ లో ఏకంగా టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వైసీపీలోకి చేరిపోయారు. దాంతో అది ఫ్యాన్ పార్టీ ఖాతాలోనే ఉంది. తూర్పు నియోజకవర్గంలో వెలగపూడి రామక్రిష్ణబాబుకు తొలిసారి ఓటమిని కార్పొరేషన్ ఎన్నికల్లో చవి చూపించేశారు. మెజారిటీ కార్పోరేటర్లు వైసీపీ పరం అయ్యారు. దాంతో వెలగపూడి డీలా పడిపోయారు. ఇక్కడ కూడా టీడీపీని తగ్గించే పని మొదలైంది. మరో వైపు ఉత్తర నియోజకవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఏనాడో గాలికి వదిలేశారు. దాంట్లో రెండు తప్ప అన్ని వార్డులూ వైసీపీ సొంతం అయ్యాయి. ఈ విధంగా చూసుకుంటే మంచానికి నాలుగు కోళ్ళు అన్న మాదిరిగా పేరుకు నాలుగు సీట్లు టీడీపీ గెలుచుకున్నా రెండేళ్ళు తిరగకముందే ఇక్కడ టీడీపీ పునాదులు కదిలిపోతున్నాయి. వైసీపీ పక్కా వ్యూహంతో ఈ నాలుగు చోట్లా వచ్చే ఎన్నికల్లో జెండా ఎగరేయడానికి రంగం సిద్ధం చేసింది. మొత్తానికి వెనక్కి తిరిగి చూసుకుంటే టీడీపీకి విశాఖ సిటీలో ఏముంది ఇక్కడ అన్నదే ఆవేదనగా కనిపిస్తుంది.

Tags:    

Similar News