సౌండ్ అంతా వారిదేనట

విశాఖ జిల్లా టీడీపీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. రూరల్ జిల్లాలో మొత్తానికి మొత్తం సీట్లు వైసీపీ పరమైన సంగతి తెలిసిందే. ఇక విశాఖ అర్బన్ జిల్లాలో నాలుగు [more]

Update: 2019-12-05 15:30 GMT

విశాఖ జిల్లా టీడీపీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. రూరల్ జిల్లాలో మొత్తానికి మొత్తం సీట్లు వైసీపీ పరమైన సంగతి తెలిసిందే. ఇక విశాఖ అర్బన్ జిల్లాలో నాలుగు దిక్కులూ టీడీపీ ఆక్రమించేసింది. ఆ పార్టీకి ఏపీలో నాలుగు సీట్లు గెలిచిన జిల్లాగా విశాఖ మొదటి స్థానంలో ఉంది. అయితే గెలిచిన వారు కూడా ఎవరి తోవ వారిది అన్నట్లుగా ఉన్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీలో ఉన్నట్లా లేనట్లా అన్నది ఆయన అనుచరులకే తెలియదు. పోనీ ఏదైనా పార్టీలో చేరుతారా అనింది కూడా ఎక్కడా స్పష్టత ఇవ్వడం లేదు. దాంతో గంటా బ్యాచ్ పూర్తిగా సైలెంట్ అయిపోయింది. తూర్పు ఎమ్మెల్యే రామక్రిష్ణబాబు తన మటుకు తాను నియోజకవరంలోనే హడావుడి చేస్తూంటే సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ది కూడా అదే వ్యవహారం. ఆయన సైతం తన నియోజకవర్గం, తన పార్టీ అన్నట్లుగా ఉన్నారు. వెస్ట్ ఎమ్మెల్యే గణబాబు కూడా ఎందుకొచ్చిన ప్రతిపక్ష పాత్ర అనుకుంటూ తన ప్రాంతానికే పరిమితం అయ్యారు.

ఎమ్మెల్సీల దూకుడు…?

సరిగ్గా ఈ సమయంలో జిల్లాలో టీడీపీ తరఫున ఎంపిక చేసిన ఎమ్మెల్సీలు ఆ పార్టీకి బాగా ఉపయోగపడుతున్నారు. ఎన్నికలకు ముందు ఇద్దరు సీనియర్ నేతలను టీడీపీ పిలిచి మరీ పెద్దల సభకు పంపించింది. ఇపుడు వారే పార్టీ బండి లాగుతున్నారు. దువ్వారపు రామారావు, బుద్దా నాగజగదీశ్వరరావు ఏపీలో చంద్రబాబుకు అండగా ఉంటూ జిల్లా స్థాయిలో గళం గట్టిగానే వినిపిస్తున్నారు. చిత్రంగా వీరు రాష్ట్ర సమస్యలను ఒక్కటి కూడా వదలకుండా ఎప్పటికపుడు ప్రస్తావిస్తూ వైసీపీ విధానాలు ఎండగడుతున్నారు. అదే సమయంలో అధినేత చంద్రబాబు ఏ పిలుపు ఇచ్చినా కూడా తప్పకుండా అమలు చేస్తూ పార్టీ వాణిని జనంలోకి బలంగా తీసుకెళ్తున్నారు. ఓ విధంగా ఎమ్మెల్యేలు జనం నుంచి నెగ్గారు కాబట్టి వారు ఎక్కువగా ఫోకస్ అవుతారు, కానీ విశాఖ జిల్లా వరకూ చూసుకుంటే ఎమ్మెల్సీలే సైకిల్ పార్టీ జోరుని పెంచుతున్నారు.

సీనియర్లు సైడేనా…?

టీడీపీ ఏలుబడిలో సీనియర్ నాయకులుగా చలామణి అయిన మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ అయిన పప్పల చలపతిరావు ఇపుడు పూర్తిగా పార్టీ కార్యక్రమాల నుంచి సైడ్ అయిపోయారు. ఆయన కనీసంగా కూడా పార్టీ గొంతు వినిపించడంలేదు. అదే విధంగా ఆ మధ్యన వైసీపీలో చేరుతారని భావించిన రూరల్ జిల్లా ప్రెసిడెంట్ పంచకర్ల రమేష్ బాబు సైతం ఎక్కడా చడీ చప్పుడూ చేయడం లేదు. ఆయన పార్టీకి రాజీనామా చేశానని చెప్పినా కూడా జిల్లా సమీక్షలో బాబు ఆయన్నే టీడీపీ ప్రెసిడెంట్ గా గుర్తించి మైక్ ఇచ్చారు. అయినా ఆయన మౌనమే నా భాష అంటున్నారు. ఇక రెండు మార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చోడవరం నేత రాజు కానీ, టీడీపీ అధికారంలో ఉన్నపుడు తెగ సందడి చేసిన అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కానీ ఇపుడు ఎక్కడా సౌండ్ చేయడంలేదు. మొత్తానికి పార్టీలో పెద్దలు ఎంతమంది ఉన్నా పెద్దల సభకు కొత్తగా నెగ్గిన ఆ ఇద్దరు మాత్రమే దిక్కుగా మిగలడం చూసి తమ్ముళ్ళకు ఆనందించాలో, బాధపడాలో తెలియడంలేదంటున్నారు.

Tags:    

Similar News