వారిద్దరూ సైకిల్ దిగేస్తున్నారటగా?

రాజ‌కీయాల్లో నేత‌లు సైలెంట్ అయ్యారంటే వెనుక ఏదో వ్యూహం ఉంద‌నే అంటారు ప‌రిశీల‌కులు. అప్పటి వ‌ర‌కు దూకుడు ప్రద‌ర్శించిన నాయ‌కులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయినా.. నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా [more]

Update: 2020-11-27 13:30 GMT

రాజ‌కీయాల్లో నేత‌లు సైలెంట్ అయ్యారంటే వెనుక ఏదో వ్యూహం ఉంద‌నే అంటారు ప‌రిశీల‌కులు. అప్పటి వ‌ర‌కు దూకుడు ప్రద‌ర్శించిన నాయ‌కులు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయినా.. నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉన్నా.. పార్టీ కార్యక్రమాల‌కు హాజ‌రు కాకపోయినా.. కూడా ఏదో జ‌రుగుతోంద‌నే భావ‌న స‌ర్వత్రా వినిపిస్తుంది. ఇలాంటి వ్యాఖ్యలే ఇప్పుడు విజ‌య‌న‌గ‌రం జిల్లాలో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అది కూడా ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీలోనే వినిపిస్తుండ‌డంతో ఆ పార్టీ నేత‌ల్లో మ‌రింత ఆందోళ‌న‌గా ఉంది. ఆది నుంచి కూడా టీడీపీకి ఈ జిల్లా కంచుకోట‌గా ఉంది.

ఆయన ఒంటరిగా….

ఇక్కడ నుంచి అనేక మంది నాయ‌కులు టీడీపీలో స‌త్తా చాటారు. ఇలా దూకుడు ప్రద‌ర్శించిన నాయ‌కుల్లో ఒక‌రు గ‌జ‌ప‌తిన‌గ‌రం మాజీ ఎమ్మెల్యే సీనియ‌ర్ నాయ‌కుడు కేఏ.నాయుడు. దివంగ‌త మాజీ ఎంపీ కొండ‌ప‌ల్లి పైడిత‌ల్లి నాయుడు త‌న‌యుడే కేఏ. నాయుడు. ఈయ‌న‌కు రాజ‌కీయంగా దూకుడు ఎక్కువ‌నే పేరుంది. ఈ దూకుడుతోనే ఏకంగా జిల్లా టీడీపీ ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని భావించారు. వాస్తవానికి రాజ‌కీయంగా ఉన్న దూకుడు.. ప్రత్య‌ర్థుల క‌ట్టడికి ప‌నిచేయాలి. కానీ, ఇక్కడ మాత్రం దీనికి భిన్నంగా సాగింది. ఫ‌లితంగా ఎన్ని వ్యూహాలు ఉన్నప్పటికీ.. పార్టీలో ఒంట‌రి అయ్యారు. ఇది ఏకంగా పార్టీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి అశోక్ కూడా ఆయ‌న్ను ప‌క్కన పెట్టే ప‌రిస్థితికి దారి తీసింది.

పదవి దక్కకపోవడంతో…..

నిజానికి ఇటీవ‌ల జ‌రిగిన టీడీపీ పార్లమెంట‌రీ ఇంచార్జ్‌ల నియామకంలో త‌న పేరు ఖ‌చ్చితంగా ఉంటుంద‌ని నాయుడు ఆశించారు. నిజానికి ఆయ‌న దీనికి అర్హుడే. కానీ, దూకుడు రాజ‌కీయాలు ఆయ‌న‌కు అడ్డుక‌ట్ట వేశాయి. చంద్రబాబు ఆయ‌న పేరును కూడా ప‌రిశీల‌న‌కు తీసుకోలేదు. అదే స‌మ‌యంలో రాజకీయంగా జూనియ‌ర్ అయిన కిమిడి నాగార్జున‌కు ప‌గ్గాలు ఇచ్చారు. దీంతో అలిగిన నాయుడు.. ఏకంగా తానే పార్టీ పార్లమెంట‌రీ అధ్యక్షుడిన‌ని బోర్డు పెట్టించుకుని నిర‌స‌న వ్యక్తం చేశారు. ఇక‌, అప్పటి నుంచి మౌనంగా ఉన్న ఆయ‌న అటు జిల్లా నేత‌ల‌పై ఇటు పార్టీ రాష్ట్ర నాయ‌క‌త్వంపై ర‌గిలిపోతున్నారు. స‌రైన టైం కోసం ఆయ‌న కాచుకుని ఉన్నార‌ని స్థానికంగా చ‌ర్చ జ‌రుగుతోంది. పార్టీకి ఆయ‌న వీర విధేయుడే అయినా ఏ నిర్ణయం అయినా తీసుకో వ‌చ్చంటున్నారు.

టిక్కెట్ ను త్యాగం చేసినా…..

మ‌రో సీనియ‌ర్ నాయ‌కుడు.. టీడీపీ కీల‌క నేత‌.. క్షత్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన చీపురుప‌ల్లి మాజీ ఇంచార్జ్ కొచ్చర్ల ‌పాటి త్రిమూర్తి రాజు (కేటీఆర్‌) ప‌రిస్థితి కూడా ఇలానే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఆర్థికంగా బ‌లంగా ఉన్న ఈయ‌న‌.. 2014, 2019 ఎన్నిక‌ల్లో పార్టీ టికెట్ ఆశించారు. అయితే.. అధిష్టానం ఆయ‌న‌కు అవ‌కాశం ఇవ్వలేదు. 2014లో త‌న సీటు త్యాగం చేసి మ‌రీ మృణాళిని గెలిపించారు. అయితే ఆమె మంత్రి అయిన వెంట‌నే కేటీఆర్ వ‌ర్గం అనేదే లేకుండా చేశారు. ఈ క్రమంలోనే గ‌త ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్‌గా పోటీకి దిగారు.

పార్టీని వీడితే…..

అయితే.. చంద్రబాబు సంప్రదింపులతో వెన‌క్కి త‌గ్గారు. కానీ, ఇప్పటి వ‌రకు ఆయ‌న‌కు ఆశించిన ప‌ద‌వి.. గుర్తింపు ల‌భించ‌లేదు. దీంతో కేటీఆర్‌ కూడా మౌనంగా ఉన్నారు. ఆయ‌న బీజేపీవైపు చూస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. ఇటీవ‌ల బీజేపీ పెద్దలు కూడా రెండుసార్లు ఆయ‌న ఇంటికి వెళ్లి చ‌ర్చలు జ‌రిపినట్టు స‌మాచారం. కీల‌క‌మైన ఈ ఇద్దరు నాయ‌కులు సైకిల్ దిగితే.. జిల్లాలో పార్టీకి ఇబ్బందేన‌న్నది కేడ‌ర్ భావ‌న. మ‌రి టీడీపీ అధిష్టానం ఈ అసంతృప్తుల‌ను చ‌ల్లారుస్తుందా ? లేదా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News