ఇలా చేస్తే ప‌రువు పోదా .. అనుభ‌వమంతా ఏమైంది?

“టీడీపీ నేత‌ల‌కు పెద్ద చిక్కే వ‌చ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కావ‌డం లేదు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం.. ఇబ్బంది పెట్టేలా [more]

Update: 2020-12-28 00:30 GMT

“టీడీపీ నేత‌ల‌కు పెద్ద చిక్కే వ‌చ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్ధం కావ‌డం లేదు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు తీసుకున్న నిర్ణయం.. ఇబ్బంది పెట్టేలా ఉంది!“- ఇదీ తాజాగా టీడీపీ సీనియ‌ర్ నేత ఒక‌రు గుస‌గుస‌గా చెప్పిన విష‌యం. టీడీపీ హార్డ్ కోర్ సీనియ‌ర్ నాయ‌కుడు ఇలా ఎందుకు మాట్లాడారు? ఏం జ‌రిగింది? అని ఆరాతీస్తే.. ఒకింత చిత్రమైన విష‌య‌మే వెలుగు చూసింది. త్వర‌లోనే తిరుప‌తి పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. దీనికి సంబంధించి అన్ని పార్టీల క‌న్నా కూడా టీడీపీ ముందుగానే అభ్యర్థిని ప్ర‌క‌టించింది. ప్రచారం కోసం.. ఓ పెద్ద క‌మిటీని కూడా వేసింది మ‌రీ ముఖ్యంగా ఎస్సీ నియోజ‌క వ‌ర్గం కావడంతో ఆ వ‌ర్గానికే చెందిన వారిని కూడా ప్రచారానికి వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున స్కెచ్ గీసింది.

అంచనాలు పెరగడంతో….

దీంతో టీడీపీ విష‌యంలో అంచ‌నాలు బాగానే పెరిగాయి. ఇక‌, ఎంపీలు, సీనియ‌ర్ నేత‌ల‌తోనూ ప్రచారం చేయించేందుకు చంద్రబాబు అడుగులు వేస్తున్నార‌ని.. ప‌క్కా వ్యూహంతో తిరుప‌తి బైపోల్‌లో విజ‌య‌మే ల‌క్ష్యంగా దూసుకుపోతున్నార‌ని కూడా వార్తలు వ‌చ్చాయి. అయితే.. అనూహ్యంగా తిరుప‌తి ఉప పోరు విష‌యంలో టీడీపీ అధినేత తీసుకున్న నిర్ణయం.. షాకిస్తోంది. ఇక్కడ పార్టీని గెలుపు గుర్రం ఎక్కించుకునేందుకు స‌ల‌హాదారును నియ‌మించుకున్నార‌ట చంద్రబాబు. రాబిన్ శ‌ర్మ అనే రాజ‌కీయ వ్యూహక‌ర్తను చంద్రబాబు ఇప్పటికే తిరుప‌తిలో దింపేశార‌ని, ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాల వారీగా హిస్టరీని తిర‌గేస్తున్నార‌ని.. టీడీపీ సీనియ‌ర్ నేత ఒక‌రు వెల్లడించారు.

ఆయన చెప్పినట్లే అంతా….

అయితే.. స‌ల‌హాదారును నియ‌మించుకోవ‌డం.. ఆయ‌న చెప్పిన‌ట్టు న‌డుచుకోవ‌డం ఏంట‌నేది ఈయ‌న మాట‌. మేమే.. రాజ‌కీయ నేత‌ల‌ను త‌యారు చేస్తాం.. ఇప్పుడు మాకు స‌ల‌హాలు ఇచ్చేవారు ఎందుకో.. అర్ధం కావ‌డం లేదు! అనేది ఆయ‌న మాట‌. పైగా రాబిన్ శ‌ర్మ.. పైనుంచి ఊడిప‌డ్డ స‌ల‌హాదారు, వ్యూహ‌క‌ర్త కాద‌ని ఈ సీనియ‌ర్ నాయ‌కుడు చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నియ‌మించిన వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిశోర్ టీం స‌భ్యుడు రాబిన్ శ‌ర్మని, ఆయ‌న గ‌తంలో విభేదించి బ‌య‌ట‌కు రావ‌డంతో చంద్రబాబు ఇప్ప‌డు తీసుకువ‌చ్చి తిరుప‌తిలో ల్యాండ్ చేశార‌ని అంటున్నారు.

అవమానం కాదా?

కానీ, ఇది పార్టీకి అవ‌మానం క‌దా? అనేది ప్రధాన ప్రశ్న. “ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ, 14 ఏళ్లపాటు సీఎం.. అయిన మా నాయ‌కుడి క‌న్నా వ్యూహాలు వేసేవారు ఎవ‌రుంటారు? ఇప్పుడు కేవ‌లం ఓ ఉప ఎన్నిక కోసం.. ఇలాంటి ఎత్తులు వేయ‌డం మంచి సందేశాన్ని ఇవ్వబోద‌‌ని చాలా మంది అంటున్నారు“ అని స‌ద‌రు నాయ‌కుడు వివ‌రించారు. మ‌రి చంద్రబాబు ఇలా చేస్తున్నారు. ఏం చేస్తాం అని పెదవి విరిచారు.

Tags:    

Similar News