మళ్లీ అప్పగించారుగా… ఇక అయినట్లే?

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు కనుమరుగైందనే చెప్పాలి. పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టారో అప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అంతరించి [more]

Update: 2020-10-26 11:00 GMT

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాదాపు కనుమరుగైందనే చెప్పాలి. పార్టీ అధినేత చంద్రబాబు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి పెట్టారో అప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అంతరించి పోవడం ప్రారంభించింది. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలందరూ పార్టీని విడిచి వెళ్లిపోయారు. అప్పటి వరకూ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ పదవులను అనుభవించిన వారు సయితం జెండాను పక్కన పడేసి తమ దారి తాము చూసుకున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత….

2014 లో రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో కొంత సత్తా చూపిన తెలుగుదేశం పార్టీ 2018 ఎన్నికల్లో అసలు సత్తా చాటలేకపోయింది. ఏపీ సరిహద్దుల్లో ఉన్న ఖమ్మం జిల్లా నుంచి రెండు సీట్లలో తెలుగుదేశం పార్టీ గెలవగలిగింది. మిగిలిన జిల్లాల్లో పార్టీ క్యాడర్ తో పాటు నాయకులు కూడా బయటకు వెళ్లిపోయారు. ఇక 2019 లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంది.

అసంతృప్తి వ్యక్తం చేసినా…..

తెలంగాణ తెలుగుదేశం పార్టీ కి అధ్యక్షుడిగా ఎల్ రమణ కొన్నేళ్లుగా కొనసాగుతున్నారు. అయితే ఎల్ రమణకు పార్టీ పగ్గాలు అప్పగించినప్పటి నుంచే నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి వెళుతున్నారన్న టాక్ బలంగా ఉంది. ప్రతిరోజూ పార్టీ కార్యాలయానికి వచ్చే అలవాటు రమణకు లేదన్నది ప్రధాన ఆరోపణ. తనకు తీరిక ఉన్నప్పుడు మాత్రమే పార్టీ కార్యాలయానికి వచ్చి పోతుంటారు. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పార్టీ నాయకుడు అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

బీసీ నేత కావడంతో…..

అందుకే ఇటీవల ఎల్ రమణను పార్టీ అధ్యక్షుడిగా తప్పించాలంటూ చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ నాయకులు కోరారు. మరొకరి కి అవకాశం ఇస్తే పార్టీ భవిష్యత్ బాగుంటుందని సూచించారు. కానీ చంద్రబాబు మరోసారి ఎల్ రమణ వైపే మొగ్గు చూపారు. ఆయననే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ప్రకటించారు. దీనిపై అసలే అంతంత మాత్రంగా ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారని టాక్. ఎల్ రమణ బీసీ నేత కావడం వల్లనే ఆయన వైపు మొగ్గు చూపారంటున్నారు. మొత్తం మీద ఎల్ రమణ సారథ్యంలో పార్టీ ఎలా ముందుకు వెళుతుందన్నది చూడాల్సి ఉంది.

Tags:    

Similar News