మాస్క్ లు తీస్తున్నారు? వైల్డ్ కార్డీ ఎంట్రీ తప్పదా?

తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. అయితే వీరంతా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తుందని వెళుతున్నారా? లేక ఐదేళ్ల పాటు కమలం [more]

Update: 2019-08-19 12:30 GMT

తెలుగుదేశం పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. అయితే వీరంతా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వస్తుందని వెళుతున్నారా? లేక ఐదేళ్ల పాటు కమలం పార్టీ నీడలో కాస్త టెన్షన్ లేకుండా గడుపుదామని వెళుతున్నారా? దీనికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ ఉందా? అంటే అవుననే చెప్పాలి. చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితులు, అధికారంలో ఉన్నప్పుడు ప్రాధాన్యత ఇచ్చిన వారు వరసగా పార్టీని వెళుతున్నారు.

డీల్ ప్రకారమేనా?

ప్రధానంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం పార్టీని వీడటం చంద్రబాబు అంగీకారంతోనేనని చెబుతున్నారు. తెలంగాణలో ఇక బలపడలేమని గ్రహించిన పార్టీ అధినేత బలం పుంజుకుంటున్న బీజేపీలోకి వెళ్లడమే మేలని సూచిస్తున్నట్లు ప్రచారం పార్టీలోనే ఇంటర్నల్ గా జరుగుతుంది. ఇది హస్తిన లెవెల్లో కుదిరిన డీల్ అని కూడా చెబుతున్నారు. తెలంగాణ టీడీపీ నేతలను పంపించితే ఏపీలో సఖ్యతగా మెలుగుతామని బీజేపీ పెద్దలు చంద్రబాబుకు సంకేతాలు పంపండంతోనే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఖాళీ అవుతుందంటున్నారు.

పార్టీని వీడినా….

ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి నేతలు తెలుగుదేశం పార్టీని వీడారు. టీజీ వెంకటేష్ పార్టీని వీడినా ఆయన కుమారుడు టీజీ భరత్ చురుగ్గా తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సుజనా, సీఎం రమేష్ లు సయితం చంద్రబాబుకు అనుకూలంగానే కేంద్రంలో పావులు కదుపుతున్నారు. తాజాగా మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి కూడా బీజేపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు. ఇందుకు కారణాలు ఏమేం ఉన్నప్పటికీ వారంతా ఐదేళ్ల పాటు మాత్రమే బీజేపీలో ఉంటారు.

ఎన్నికల సమయానికి….

ఎన్నికలు వచ్చే సమయానికి తిరిగి భారతీయ జనతా పార్టీని వదిలి తెలుగుదేశం పార్టీలోకి రానున్నారు. ఇప్పుడు వెళ్లిన నేతలందరి పరిస్థితి అదేనని తెలుగుదేశం పార్టీలో విన్పిస్తున్న టాక్. వారంతా ఐదేళ్ల పాటు జగన్ సర్కార్ నుంచి తమకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా, కేంద్రం నుంచి సీబీఐ, ఈడీ వంటి దాడులు జరగకుండా ఉండేందుకే బీజేపీలో చేరనున్నారు. ఎన్నికల సమయానికి వీరంతా టీడీపీలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తారన్నది వాస్తవం.

Tags:    

Similar News