కళ్లముందే కనుమరుగైపోతుందా?

తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణాలో. అది కూడా ఓ అరుదైన అనుకోని ఘటనతో. అప్పటివరకూ చలనచిత్ర రంగంలో తిరుగులేని కధానాయకునిగా ఉన్న అన్న ఎన్టీయార్ టీడీపీని స్థాపిస్తున్నట్లుగా [more]

Update: 2019-08-19 05:00 GMT

తెలుగుదేశం పార్టీ పుట్టింది తెలంగాణాలో. అది కూడా ఓ అరుదైన అనుకోని ఘటనతో. అప్పటివరకూ చలనచిత్ర రంగంలో తిరుగులేని కధానాయకునిగా ఉన్న అన్న ఎన్టీయార్ టీడీపీని స్థాపిస్తున్నట్లుగా 1982 మార్చి 29న హైదరాబాద్ లో ప్రకటించారు. ఆనాడు సుమారు ఓ యాభై మంది మధ్యన రామారావు చేసిన ప్రకటన తరువాత కాలంలో ఉవ్వెత్తిన పసుపు జెండాగా మారింది. దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా తెలుగు నేల మీద అజేయంగా జెండా ఎగరడానికి అవసరమైన ఊపిరి నాటి ప్రకటన ఇచ్చిందనుకోవాలి. టీడీపీ ఏర్పాటుకు పదేళ్ళకు ముందు ప్రత్యేక తెలంగాణా నినాదం కూడా గట్టిగా ఎగిసిపడి ఉమ్మడి ఏపీలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. సమైక్యవాది అయిన నందమూరి తన సినిమాల ద్వారా తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది అని గొప్ప సందేశం ఇచ్చి తన భావాన్ని గట్టిగా నాడు తెలియచేశారు. ఆ గొడవ అంతా సద్దుమణిగిన సమాయంలో ఎన్టీయార్ 1982లో పెట్టిన తెలుగుదేశం పార్టీని తెలంగాణాలో అయితే భుజానికి ఎత్తుకుని మోశారు. అంటే సమైక్యవాదిగా ఉన్న రామారావుని తెలంగాణా జనం నాడు ఎంతగానే విశ్వసించాలి.

అదే తెలంగాణాలో…..

చిత్రమేంటంటే తమ పార్టీ, బడుగులను అందలం ఎక్కించిన పార్టీ అంటూ నెత్తిన పెట్టుకున్న టీడీపీని అదే తెలంగాణా నినాదం ఒక్కసారిగా దించేసింది. దీనివెనక అనేక పరిణామాలు కూడా ఉన్నాయి. పార్టీ పెద్దగా అన్న గారు లేకపోవడంతో పాటు, చంద్రబాబు అవకాశవాద రాజకీయ విధానాల ఫలితంగానే తెలంగాణాలో తెలుగుదేశానికి ఈ గతి పట్టిందని అంతా అంటారు. రాజకీయ పబ్బం కోసం చంద్రబాబు ఇచ్చిన లేఖ చివరికి బాకుగా మరి టీడీపీని అక్కడ నరికేసింది. ఇక ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక, తెలంగాణాలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక టీడీపీని మెల్లగా లేకుండా చేసే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ అక్కడ దారుణంగా ఓడిపోయింది. అన్నింటికంటే ఎక్కువగా తాను సిధ్ధాంతపరంగా ద్వేషించిన కాంగ్రెస్ తో జత కట్టి పునాదిలే లేకుండా చేసుకుంది.

బీజేపీ పూర్తి చేసింది….

ఇక అరకొరగా మిగిలిన టీడీపీని తనవైపు లాగేసుకుని తాజాగాబీజేపీ పని కానిచ్చెసింది. అంటే మొత్తంగా చూసుకుంటే చంద్రబాబు కళ్ల ముందే తెలంగాణాలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందని చెప్పాలి. చంద్రబాబు హైదరాబాద్ లో ఉండగానే బీజేపీ నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇది బాబు స్వయంక్రుతాపరాధంగానే చూడాలి. ఉజ్వలంగా ఎగిసిన టీడీపీ పుట్టిన చోటనే గిట్టడం అంటే నిజంగా చారిత్రాత్మక విషాదంగా చెప్పుకోవాలి. ఇప్పటికీ తెలంగాణాలో అన్న నందమూరికి అభిమానులు ఉన్నారు, కానీ పార్టీ లేదు, ఇది విచిత్రమైన అనుభవమే. ఇపుడు ఏపీలో కూడా టీడీపీ పతనావస్థలో ఉండడం సైతం తెలంగాణా టీడీపీపై ప్రభావం చూపిందనుకోవాలి. ఏది ఏమైనా ఎన్నో రికార్డులు స్రుష్టించి తెలంగాణా రూపు రేఖలను మార్చిన టీడీపీ తెలంగాణా రాష్ట్రంలో ఇపుడు ఓ గతం. టీడీపీ అభిమానులకు బాధకలిగించినా కూడా ఇది కఠిన వాస్తవం.

Tags:    

Similar News