సిక్కోలు టీడీపీకి లైట్ హౌస్ వాళ్ళేనట…?

శ్రీకాకుళం జిల్లాల్లో చూసుకుంటే వర్గ రాజకీయాలకు అతీతంగా పార్టీలో దశాబ్దాల కాలంగా ఉంటూ ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్న పొలిటికల్ ఫ్యామిలీ ఒకటి ఉంది. మాజీ మంత్రి [more]

Update: 2021-06-15 11:00 GMT

శ్రీకాకుళం జిల్లాల్లో చూసుకుంటే వర్గ రాజకీయాలకు అతీతంగా పార్టీలో దశాబ్దాల కాలంగా ఉంటూ ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్న పొలిటికల్ ఫ్యామిలీ ఒకటి ఉంది. మాజీ మంత్రి గుండా అప్పలసూర్యనారాయణ ఎన్టీయార్ టైం లో మంత్రిగా పనిచేశారు. ఏరి కోరి అన్న గారు ఆయనకు అమాత్య కిరీటం కట్టబెట్టారు. ఆయన తన పదవీకాలంలో ఎలాంటి మచ్చ లేకుండా వ్యవహరించారు. ఆ తరువాత మాత్రం ఆయనకు మంత్రి పదవి అన్నది అందని పండే అయింది. ఆయన సతీమణి గుండా లక్ష్మీ దేవి కూడా 2014 నుంచి 2019 వరకూ శ్రీకాకుళం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఈ దంపతులు ఇద్దరికీ క్లీన్ ఇమేజ్ ఉంది. ఇదే ఇపుడు సిక్కోలులో పార్టీకి శ్రీరామ రక్షగా ఉందిట.

ఆమె మేయర్ గా….?

శ్రీకాకుళం కార్పోరేషన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కోర్టు కేసుల కారణంగా వీటికి ఎన్నికలు పెట్టలేదు. ఇపుడు అన్ని అడ్డంకులూ తొలగాయి. కరోనా తగ్గాక రాజమండ్రీతో పాటు ఇక్కడ కూడా ఎన్నికలు జరగనున్నాయి. మునిసిపాలిటీ స్థాయి నుంచి కార్పోరేషన్ గా ఎదిగిన శ్రీకాకుళం తొలి మేయర్ ఎవరు అవుతారు అన్నది కూడా ఆసక్తికరమైన చర్చగా ఉంది. బీసీ మహిళకు ఈ సీటు రిజర్వ్ అయింది. దాంతో రెండేళ్ల క్రితం వరకూ ఎమ్మెల్యేగా పని చేసి మంచి పేరు తెచ్చుకున్న గుండా లక్ష్మీదేవినే నిలబెట్టాలని భావిస్తున్నారుట. ఆమెకు శ్రీకాకుళంలో ఉన్న పట్టు, మాజీ మంత్రి అప్పలసూర్యనారాయణకు పట్టణంలో ఉన్న పలుకుబడి కలసి సైకిల్ పార్టీని గెలిపిస్తాయని భావిస్తున్నారుట.

కొత్త ప్రయోగం …?

ఇదిలా ఉంటే శ్రీకాకుళం కార్పోరేషన్ ఎన్నికల్లో కొత్త ప్రయోగం కూడా చేయడానికి టీడీపీ రెడీ అవుతోందిట. ఈసారి టికెట్లను పేదలు, జనంలో ఉన్న వారికే ఇవ్వాలనుకుంటోందిట. అంటే వైసీపీ ఇంతకు ముందు చేసిన లాంటిదేనట. కడప జిల్లాలో కూరగాయాలు అమ్ముకునేవారికి టికెట్ ఇచ్చి మునిసిపల్ చైర్మన్ గా వైసీపీ చేసింది. ఆ విధంగా టీడీపీ కూడా వృత్తి పనులు చేసుకునే వారు, కార్మికులు, మధ్య తరగతి వర్గాలకు టికెట్లు ఇచ్చి వారికి జనాలతో ఉన్న అనుబంధంతో పెద్ద విజయాలను నమోదు చేయాలని అనుకుంటోందిట. మరో వైపు వైసీపీలో బడా బాబులు, రియల్టర్లు కార్పోరేటర్లుగా నిలిచేందుకు పోటీ పడుతున్నారు. దీంతో తమది అచ్చమైన పేదల పార్టీ అని చెప్పుకునేందుకు ఇలా చేయాలని పసుపు శిబిరం డిసైడ్ అయిందంట.

ఢీ అంటే ఢీ…?

శ్రీకాకుళం పట్టణంలో వైసీపీ టీడీపీకి సరిసమానమైన బలం ఉంది. 2014 ఎన్నికల్లో గెలిచిన గుండా లక్ష్మీదేవి 2019 ఎన్నికలో ఓటమి చెందడానికి సొంత పార్టీలో వెన్నుపోట్లు కూడా కారణమని అంటారు. అయితే చంద్రబాబు సూచనలతో ఇపుడు గుండా ఫ్యామిలీకి అంతా సహకరించాలని నిర్ణయించారు. ఈ గెలుపుతో శ్రీకాకుళంలో టీడీపీ జెండా బలంగా ఎగరవేయాలని కూడా ఆశపడుతున్నారు. ఇక వైసీపీకి అధికార బలం ఉంది. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు నాయకత్వం ఉంది. ఆయన కనుక గట్టిగా పనిచేస్తే వైసీపీ విజయం సాధిస్తుంది అంటున్నారు. మరి తెర వెనక ఏమైనా రాజీలు చీకటి ఒప్పందాలు జరిగితే మాత్రం అనూహ్య ఫలితాలు వచ్చినా ఆశ్చర్యమే లేదు అంటున్నారు. మొత్తానికి గుండా ఫ్యామిలీకి జాక్ పాట్ దక్కుతుందా లేదా అన్నది మరి కొద్ది నెలల్లో తేలిపోనుంది.

Tags:    

Similar News