రిపేరు చేయడమంటే ఇదేనా?

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ..గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలో ముక్కలు చెక్కలైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేక ప‌వ‌నాల‌తో కొట్టుమిట్టాడుతున్న పార్టీ.. ఇప్పుడు ఏకంగా పార్టీలో అంత‌ర్గత [more]

Update: 2019-08-31 13:30 GMT

ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ..గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలో ముక్కలు చెక్కలైంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వ్యతిరేక ప‌వ‌నాల‌తో కొట్టుమిట్టాడుతున్న పార్టీ.. ఇప్పుడు ఏకంగా పార్టీలో అంత‌ర్గత క‌ల‌హాల‌తో నానాటికి దిగ‌నాసిగా మారి రోడ్డెక్కింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జ‌గ‌న్ ప్రభుత్వంపై తీవ్ర ఆందోళ‌న కు తెర‌దీసింది. ప‌దిరోజుల కింద‌ట అన్న క్యాంటీన్లపై ఆందోళ‌న చేసిన టీడీపీ నాయ‌కులు.. వాటిని తెరిపించాల‌ని డిమాండ్ చేశారు. జ‌గ‌న్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అయితే, తాజాగా రాష్ట్రంలోఇసుక కొర‌త‌తో కార్మికులు వీధిన‌ప‌డ్డార‌ని ఆరోపిస్తూ.. ఇప్పుడు ఇసుక కొర‌త‌పై ఆందోళ‌న‌కు తెర‌దీశారు.

ఆందోళనల్లో ట్విస్టులు…

గ‌త ఆందోళ‌న మాదిరిగా నే ఎక్కడిక‌క్కడ వ‌చ్చిన వారు వ‌చ్చారు.. రానివారు రాలేదు. ముఖ్యంగా ఎన్నిక‌ల కు ముందు త‌మ‌కు ప్రాధాన్యం ద‌క్కిన వారు ఇప్పుడు కూడా పార్టీని , అధినేత ఆదేశాల‌ను కూడా ప‌క్కన పెట్టారు. ఇక‌, కొన్ని చోట్ల త‌మ‌పై పోలీసులు ఎక్కడ కేసులు పెడ‌తారోన‌ని భావించిన టీడీపీ నాయ‌కులు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. కీల‌క‌మైన జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపించింది. చంద్రబాబు అనుకూల మీడియా ప‌ట్టి ప‌ట్టి చూపించాల‌ని చూసినా.. ప‌ట్టుమ‌ని ప‌దినిమిషాల్లోనే విజ‌య‌వాడ‌లో జ‌ర‌గిన ఆందోళ‌న ముగిసి పోయింది. ఇలా సాగిన ఈ నిర‌స‌న‌లో కొన్ని ట్విస్టులు కూడా చోటు చేసుకున్నాయి.

రాయపాటికి అప్పగించినా….

టీడీపీలో నాయ‌కుల ఆధిప‌త్యానికి ఈ నిర‌స‌న అద్దం ప‌ట్టింది. స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం కొన్ని రోజులుగా వార్త‌ల్లో ఉన్న విష‌యం తెలిసిందే. ఇక్కడ నుంచి టీడీపీకి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కోడెల శివప్రసాద‌రావు.. కొన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. ఏకంగా ఆయ‌న కుమారుడు, కుమార్తెల‌పైనే ప‌లు సెక్షన్ల కింద కేసులు న‌మోద‌య్యాయి.దీంతో చంద్రబాబుకు ఈయ‌న భారంగా ప‌రిణ‌మించారు. ఈ క్రమంలో స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం బాధ్యత‌ల‌ను రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుమారుడు రాయ‌పాటి రంగారావుకు ఉర‌ఫ్ రంగ బాబుకు అప్పగించారు చంద్ర‌బాబు.

రెండు వర్గాలుగా…..

అయితే, ఇదంతా కూడా తెర‌చాటునే జ‌రిగినా.. అంద‌రికీ తెలిసిన విష‌యంమే. టీడీపీ ప‌రువును తీశారంటూ.. ఏకంగా పార్టీ అధికార ప్రతినిధి వ‌ర్ల రామ‌య్య.. మీడియా ముందే.. కోడెల ప‌రువు తీశారు. అలాంటి నాయ‌కుడికి ఇక స‌త్తెన‌ప‌ల్లిని ఇచ్చినా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలిచే ప‌రిస్థితి లేదు. మ‌రోప‌క్క, త‌మ‌కు ప్రాధాన్యం లేని పార్టీలో ఎందుకు ఉండాల‌ని రాయ‌పాటి వ‌ర్గం అంటోంది. ఈ నేప‌థ్యంలో స‌త్తెన‌ప‌ల్లి ప‌గ్గాల‌పై రాయ‌పాటికి అధికారం ఇస్తూ.. బాబు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో తాజాగా చేప‌ట్టిన ఇసుక నిర‌స‌న‌లో ఇరువ‌ర్గాలు అటు కోడెల‌, ఇటు రంగ బాబు వ‌ర్గాలు పోటాపోటీగా చేప‌ట్టాయి.

అయోమయంలో కార్యకర్తలు…..

సత్తెనపల్లిలో టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఇసుక కొరత నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నిరసనలు, ధర్నాలకు పిలుపునిచ్చింది. అయితే సత్తెనపల్లిలో మాత్రం నేతలు రెండు గ్రూపులుగా విడిపోయి ఆందోళన చేపట్టారు. కోడెల వర్గం-రంగబాబు వర్గాలుగా ఆందోళనలు నిర్వహించారు. అన్న క్యాంటీన్ వద్ద రంగబాబు ధర్నా చేయగా.. తహశీల్దార్ కార్యాలయం ఎదుట కోడెల వర్గం నిరసన చేపట్టింది. దీంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారు.మ‌రి వ‌చ్చే రోజుల్లో ఇది దేనికి దారి తీస్తుందో చూడాలి.

Tags:    

Similar News