బాబు స్ట్రాటజీ అక్కడ అట్టర్ ఫెయిలయింది

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయో చెప్పడం చాలా క‌ష్టం. నిన్న మ‌న‌వాడే.. రేపు ప‌గ‌వాడు కావొచ్చు. ఏ నిముషానికి ఏమి జ‌రుగునో.. అనే మాట ఖ‌చ్చితంగా [more]

Update: 2020-09-16 03:30 GMT

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు ఎదుర‌వుతాయో చెప్పడం చాలా క‌ష్టం. నిన్న మ‌న‌వాడే.. రేపు ప‌గ‌వాడు కావొచ్చు. ఏ నిముషానికి ఏమి జ‌రుగునో.. అనే మాట ఖ‌చ్చితంగా రాజ‌కీయాల్లో ఎంత‌టి వారికైనా వ‌ర్తించ‌కుండా ఉండ‌దు. ఇప్పుడు ఏపీలో ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీకి కూడా ఇలాంటి అనుభ‌వ‌మే ఎదుర‌వుతోంది. నాయ‌కుల‌ను అతిగా న‌మ్మిన చంద్రబాబు ఆ న‌మ్మకం అనే సున్నిత‌మైన వ్యవ‌హారాన్ని చెడ‌గొట్టుకున్నారో.. లేక చెడిపోయిందో తెలియ‌దు కానీ.. న‌మ్మిన తమ్ముళ్లు చేసిన నిర్వాకం ఫ‌లితంగా ఇప్పుడు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ఉనికిని మాత్రం ప్రశ్నార్థకం చేసుకున్నారు.

30కి పైగానే….

ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాలు రాష్ట్ర వ్యాప్తంగా 30కిపైగా ఉన్నాయ‌నేది ప‌రిశీల‌కుల అంచ‌నా. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో వ్యక్తుల‌పై ఆధార‌ప‌డి టీడీపీ న‌డిచింది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ క‌న్నా వ్యక్తులు, వారి దూకుడుకు ప్రజ‌లు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు చంద్రబాబు కూడా ఇలాంటి వారిని ప్రోత్సహించారు. ఫ‌లితంగా స‌ద‌రు నాయ‌కులు పార్టీని వీడినా.. బాబుకు వ్యతిరేకంగా మారినా.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో సైకిల్ తుప్పుప‌ట్టే ప‌రిస్థితి ఏర్పడింది. ఈ త‌ర‌హా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌టి తూర్పుగోదావ‌రి జిల్లా రామ‌చంద్రాపురం. టీడీపీ ఆవిర్భావం త‌ర్వాత ఇక్కడ వ‌రుస‌గా రెండుసార్లు పార్టీ విజ‌యం సాధించింది. ఇద్దరు వేర్వేరు నాయ‌కులు 1983(రామ‌చంద్రరాజు), 1985 (మేడిశెట్టి వ‌ర‌వెంక‌ట రామారావు)లు పార్టీని గెలుపు గుర్రం ఎక్కించారు.

తోట శాసించడంతో….

ఇక‌, 1999 నుంచి రామ‌చంద్రాపురం టీడీపీ ప‌రిస్థితి వ్యక్తి రాజ‌కీయాల‌కు ప్రాధాన్యం ఇస్తూ వ‌చ్చింది. దీంతో తోట త్రిమూర్తులు.. పార్టీకి తురుపుముక్కగా మారారు. ఆయ‌న హ‌వా టీడీపీని సైతం నియోజ‌క‌వ‌ర్గంలో శాసించే ప‌రిస్థితికి తీసుకువ‌చ్చింది. కాపు సామాజిక వ‌ర్గానికి బ‌ల‌మైన నాయ‌కుడు కావ‌డం, తూర్పులో కాపుల‌కు ప్రాధాన్యం ఉండ‌డం, రాజ‌కీయంగా చంద్రబాబు కాపు ఓటు బ్యాంకుకు ప్రాధాన్యం ఇవ్వాల‌నే ఉద్దేశంతో అన్ని కోణాల్లోనూ తోట‌కు స‌హ‌క‌రించారు. ఫ‌లితంగా టీడీపీ క‌న్నా వ్యక్తిగా తోట ఎదిగారు. ఇది అంతిమంగా పార్టీకి మేలు చేయ‌క‌పోగా.. ఇప్పుడు తోట త్రిమూర్తులు పార్టీ మారి దాదాపు ఎనిమిది మాసాలు అవుతున్నా.. పార్టీని ఎవ‌రూ ప‌ట్టించుకునే ప‌రిస్థితిని లేకుండా చేసేసింది.

షాకులు ఇస్తున్నా…..

విచిత్రం ఏంటంటే రామ‌చంద్రాపురంలో చంద్రబాబుకు గ‌తంలోనే తోట హ్యాండ్ ఇచ్చినా కూడా మ‌ళ్లీ ఆయ‌న్ను న‌మ్ముకుని నిండా మునిగారు. 2009లో తోట త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన నేత చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలోకి జంప్ చేయ‌డంతో ఇక్కడ టీడీపీకి స‌రైన క్యాండెట్ లేని ప‌రిస్థితి. ఆ ఐదేళ్లు ఎవ‌రు అయితే పార్టీని ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొని న‌డిపించారో వారిని కాద‌ని మ‌ళ్లీ 2014లో తోట పార్టీలోకి వ‌చ్చిన వెంట‌నే టీడీపీ సీటు ఇచ్చేశారు. ఇప్పుడు మ‌రోసారి తోట త‌నదైన స్టైల్లో బాబుకు షాక్ ఇచ్చారు. రాజ‌కీయాల్లో జంపింగులు స‌హ‌జ‌మే. అయితే, ఒక నాయ‌కుడు పార్టీని వీడితే..వెంట‌నే స‌ద‌రు పార్టీని న‌డిపించేందుకు ద్వితీయ శ్రేణి నాయ‌కులు సిద్ధంగా ఉండ‌డం తెలిసిందే.

ఎవరూ ముందుకు రాక…..

అదేం చిత్రమోకానీ, రామ‌చంద్రాపురం టీడీపీలో మాత్రం ఇప్పటి వ‌ర‌కు 'నేనున్నాను.. పార్టీని న‌డిపిస్తాను' అని కానీ, పార్టీ కార్యక్రమాలు భుజాన వేసుకున్న నాయ‌కులు కానీ ఏ ఒక్కరూ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఉన్న వారంతా తోట‌కు జై కొడుతున్నవారే. పార్టీలోనే ఉన్నప్పటికీ.. తోట త్రిమూర్తులుకు అనుకూలంగా వ్యవ‌హ‌రిస్తున్నారే. ఈ ప‌రిణామాల‌తో చంద్రబాబు గ‌డిచిన కొన్నాళ్లుగా ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల‌కు పిలుపు ఇస్తున్నా.. ఇక్కడ ఏ ఒక్కరూ స‌ద‌రు కార్యక్రమాల‌ను చేప‌ట్టేందుకు ముందుకు రావ‌డం లేదు.

బాబుకు సవాలే…..

దీంతో సైకిల్ దిగేవారే త‌ప్ప.. ఎక్కేవారేరీ.. అని నియోజ‌క‌వ‌ర్గంలో చ‌ర్చ న‌డుస్తోంది. పైగా ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ముగ్గురు బ‌ల‌మైన నేత‌లు మంత్రి చెల్లుబోయిన వేణు, రాజ్యస‌భ స‌భ్యుడు పిల్లి బోస్, అమ‌లాపురం పార్లమెంట‌రీ జిల్లా అధ్యక్షుడు తోట త్రిమూర్తులు ముగ్గురూ వైసీపీలో ఉండ‌డంతో ఈ ముగ్గురిని త‌ట్టుకునే బ‌ల‌మైన నేత‌ను ఇక్కడ నిల‌బెట్టడం చంద్రబాబుకు పెను స‌వాల్ లాంటిదే.

Tags:    

Similar News