టీడీపీలో ఈ స్టార్లు ఏమైపోయారు..?

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ పార్టీ ప్రభంజ‌నం వీచినా ప్రకాశం జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలిచి స‌త్తా చాటింది. ఇందులో మూడు బాప‌ట్ల [more]

Update: 2021-01-13 00:30 GMT

గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ పార్టీ ప్రభంజ‌నం వీచినా ప్రకాశం జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలిచి స‌త్తా చాటింది. ఇందులో మూడు బాప‌ట్ల పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోవే కాగా.. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు క‌మ్మ వ‌ర్గానికి చెందిన వారే. ఇక ఒంగోలు పార్లమెంటు ప‌రిధిలోని కొండ‌పి సీటును సైతం టీడీపీ స్వల్ప మెజార్టీతో త‌న ఖాతాలో వేసుకుంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన టీడీపీ నేత‌లు, ఇప్పుడు ఏమైపోయారో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. 2014లో వైసీపీ నుంచి గెలిచిన వారిలో గిద్దలూరులో ముత్తముల అశోక్ రెడ్డి, య‌ర్రగొండ పాలెంలో పాల‌ప‌ర్తి డేవిడ్ రాజు, కందుకూరులో పోతుల రామారావు, అద్దంకిలో గొట్టిపాటి ర‌వికుమార్ న‌లుగురు సైకిల్ ఎక్కేశారు.

జనార్థన్ ను కీలక బాధ్యతలు….

వీరిలో డేవిడ్‌రాజును చంద్రబాబు గ‌త ఎన్నిక‌ల్లో ప‌క్కన పెట్టారు. మిగిలిన ముగ్గురిలో ఒక్క గొట్టిపాటి ర‌వికుమార్ ఒక్కరే అద్దంకిలో విజ‌యం సాధించారు. టీడీపీ ప్రభుత్వంలో జిల్లాలో రాజ్యమేలిన నేత‌ల్లో నాటి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్థన్ ఇప్పుడు ఒంగోలును వ‌దిలేసి హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మ‌వుతున్నార‌న్న విమ‌ర్శలు వ‌స్తున్నాయి. జిల్లాలో ఆయ‌న వ‌ల్ల పార్టీకి ఒరిగింది లేద‌ని డిసైడ్ అయిన చంద్రబాబు ఇటీవ‌ల ప‌ద‌వుల్లో ఆయ‌నకు రాష్ట్ర స్థాయి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. దీంతో జనార్థన్ ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో వేలు పెట్టే ప‌రిస్థితి లేదు.

వైసీపీలో చేరేందుకు….

గిద్దలూరులో పార్టీ మారి చంద్రబాబు ద‌య‌తో భారీగా నిధులు ద‌క్కించుకుని హ‌డావిడి చేసిన మాజీ ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి గ‌త ఎన్నిక‌ల్లో ఏకంగా 81 వేల ఓట్ల భారీ తేడాతో ఓడిపోయారు. దీంతో మైండ్ బ్లాక్ అయిన అశోక్‌రెడ్డి పేరుకు మాత్రమే టీడీపీలో ఉన్న ప‌రిస్థితి. అశోక్‌రెడ్డి ఇప్పటికే వైసీపీలో చేరేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నా.. అక్క‌ ప‌ట్టించుకునే వారు లేక సైలెంట్‌గా ఉంటున్నారు. ఇక కొండ‌పి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావు కందుకూరులో వైసీపీ నుంచి గెలిచి సైకిల్ ఎక్కేశారు.

నియోజకవర్గానికి దూరంగా…..

ఆయ‌న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నియోజ‌క‌వ‌ర్గానికి చుట్టపు చూపుగా వ‌స్తుండేవారు. ఇప్పుడు ఎన్నిక‌ల్లో ఓడాక అస‌లు నియోజ‌క‌వ‌ర్గం వైపు చూడ‌డ‌మే మానేశారు. మ‌ళ్లీ దివి శివ‌రాం అక్కడ యాక్టివ్ అవుతోన్న ప‌రిస్థితి. ఇక య‌ర్రగొండ‌పాలెంలో వైసీపీ నుంచి గెలిచి ప‌సుపు కండువా క‌ప్పుకున్న డేవిడ్‌రాజు తీవ్ర వ్యతిరేక‌త మూట‌క‌ట్టుకున్నారు. దీంతో చంద్రబాబు అప్పుడే డేవిడ్‌రాజును ప‌క్కన పెట్టారు. దీంతో వైసీపీలోకి వెళ్లిన డేవిడ్‌రాజును ఎవ్వరూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఇప్పుడు ఆయ‌న తిరిగి టీడీపీలోకి వ‌చ్చేందుకు వేయిటింగ్ లో ఉన్నారు. చంద్రబాబు య‌ర్రగొండ‌పాలెం సీటు ఇస్తానంటే డేవిడ్‌రాజు మ‌ళ్లీ కండువా మార్చేందుకు రెడీగా ఉన్నారు.

అధికారంలో ఉన్నప్పుడు…..

ఇక సంత‌నూత‌ల‌పాడులో వ‌రుస‌గా రెండుసార్లు ఓడిన మాజీ ఎమ్మెల్యే బీఎన్‌. విజ‌య్‌కుమార్ ఇక మూడోసారి తాను బండి న‌డ‌ప‌లేనని కాడికింద ప‌డేసేశారు. మార్కాపురంలో వ‌రుస‌గా ఓడుతూ వ‌స్తోన్న కందుల నారాయ‌ణ‌రెడ్డికి మ‌ళ్లీ పోటీ చేయాల‌న్న ఆశ ఉన్నా పార్టీని న‌డిపే ప‌రిస్థితి లేదు. చీరాల‌లో ఎన్నిక‌ల‌కు ముందు వ‌ర‌కు వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న యెడం బాలాజీ ఇప్పుడు టీడీపీ ఇన్‌చార్జ్‌గా ఉండడం మిన‌హా చేసేదేం లేదు. ఇక క‌నిగిరిలో మాజీ ఎమ్మెల్యే ఉగ్ర న‌ర‌సింహారెడ్డి ఎన్నిక‌ల‌కు ముందే పార్టీలోకి వ‌చ్చి ఓడారు. ఇక అద్దంకిలో గొట్టిపాటి ర‌వికుమార్‌, ప‌రుచూరులో బాప‌ట్ల పార్లమెంట‌రీ అధ్యక్షుడిగా ఉన్న ఏలూరి సాంబ‌శివ‌రావు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నారు. ఏదేమైనా ప్రకాశం టీడీపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగిన వాళ్లంతా ఇప్పుడు బ‌య‌ట‌కు రాని ప‌రిస్థితిలో పార్టీ కొట్టుమిట్టాడుతోంది.

Tags:    

Similar News