ఎవరిది పంచాయతీ.. ?

పంచాయతీ ఎన్నికలు అంటేనే పెద్ద పంచాయతీ. నిజానికి పల్లెకు అతి పెద్ద గ్రామ సభ. ఉన్న చోటనే న్యాయం తమకు జరుగుతుందని, సమస్యలు తీరుతాయని జనం నమ్మి [more]

Update: 2021-02-14 14:30 GMT

పంచాయతీ ఎన్నికలు అంటేనే పెద్ద పంచాయతీ. నిజానికి పల్లెకు అతి పెద్ద గ్రామ సభ. ఉన్న చోటనే న్యాయం తమకు జరుగుతుందని, సమస్యలు తీరుతాయని జనం నమ్మి ఓట్లేసి గెలిపించుకునే గ్రామ స్థాయి పార్లమెంట్ పంచాయతీ. అటువంటి పంచాయతీలకు రాజకీయాల రంగు అంటించేశారు. ఏకంగా చంద్రబాబు ఎన్నికల మ్యానిఫేస్టోని రిలీజ్ చేసి పందెం నువ్వా నేనా అంటూ ముఖ్యమంత్రి జగన్ కి ధీటు అయిన సవాల్ విసిరారు. ఇదిలా ఉంటే పంచాయతీ ఎన్నికల నుంచి లోకల్ ఫైట్ కి కధ మొదలుపెట్టారు. అంటే గ్రామం నుంచి సమరం సాగి ఆఖరుకు పట్టణాలకు చేరుతుంది అన్న మాట. ఎన్నికల సంఘం మొదట పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని అనుకోవడం వల్ల ఎవరికి లాభం అన్నది కూడా చర్చ సాగుతోంది.

ముందస్తు కసరత్తు ….

ఇక ఏపీలో చూస్తే క్షేత్ర స్థాయిలో టీడీపీకి బలం ఉంది. టీడీపీకి ఓట్లు పడని పోలింగు బూత్ లేదు, టీడీపీ గుర్తు తెలియని పల్లె జనం లేరు. నాలుగు దశాబ్దాలుగా పాతుకుపోయిన పార్టీ అది. ఇక టీడీపీ కింద నుంచి పైకి రావాలనుకుంటోంది. రాష్ట్రంలో పోగొట్టుకున్న అధికారాన్ని చేజిక్కుంచుకోవాలంటే పల్లెలను ముందు తన వైపునకు తిప్పుకోవాలని చూస్తోంది. దాంతో పాటే ముందస్తుగా కసరత్తు చేసింది. అభ్యర్ధులను రెడీ చేసి పెట్టుకుంది. వ్యూహాలను కూడా రూపొందించుకుంది. దాంతో పల్లె పోరులో టీడీపీ తరఫున గట్టిగానే హుషార్ ఉందని చెప్పాలి.

వైసీపీతోనే పోటీ …..

ఇక వైసీపీ విషయం తీసుకుంటే ఆ పార్టీకి శత్రువులు సొంత పార్టీలోనే ఉన్నారు. వైసీపీ అధినేత జగన్ ఏకగ్రీవాలు ఎక్కువగా జరగాలని కోరుతూంటే దాని మాట దేముడెరుగు, కనీసం అందరికీ ఆమోదయోగ్యమైన అభ్యర్ధిని ప్రతీ పంచాయతీకి ఒకరిని అయినా నిలబెట్టలేకపోతున్నారు పార్టీ నేతలు. ప్రతీ పంచాయతీలో వర్గ పోరు తారస్థాయిలో ఉంది. దాంతో ఎవరికి వారే పోటీకి తయారు అయ్యారు. ఇక ఇప్పటికే ఎంపీటీసీలకు, జెడ్పీటీసీలకు అభ్యర్ధులుగా ఉన్న వారు ఎవరిని కాదంటే తమకు రేపటి రోజున ఇబ్బంది అవుతుందో అని సర్దిచెప్పకుండా పక్కకు తప్పుకుంటున్నారు. మరో వైపు ఎమ్మెల్యేలదీ ఇదే బాధ. ఒకరి పక్షం ఉంటే మిగిలిన వారి ఓట్లు వచ్చే ఎన్నికల్లో తమకు దక్కకుండా పోతాయన్న అతి తెలివితో ఎందుకొచ్చిన గొడవ అంటూ దూరంగా ఉంటున్నారు. దాంతో రెబెల్ అభ్యర్ధులు అన్ని చోట్లా వైసీపీకి పెరిగిపోయారు. అది చివరికి గెలుపు అవకాశాల మీద డేంజర్ బెల్స్ మోగించేస్తోంది.

టీడీపీకే మేలా …?

పంచాయతీ పోరులో వైసీపీ నేతలు వీధిన పడడం చాలా చోట్ల టీడీపీకి మేలు చేసేలా ఉందని కూడా అంటున్నారు. దీనికి జిల్లా, నియోజకవర్గ నాయకులదే తప్పు అని కూడా అంటున్నారు. పంచాయతీల్లో ఎక్కువ సంఖ్యలో టీడీపీ మద్దతుదారులు గెలిస్తే ఆ మీదట జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వీరే తమ వారిని గెలిపిస్తారు. అలా దిగువ స్థాయి నుంచి గెలుపుతో ఏపీలో గొప్ప రాజకీయ మలుపుని తీసుకురావాలని చంద్రబాబు బ్రహ్మండమైన వ్యూహరచన చేస్తూంటే అధికారం చేతిలో ఉన్నా కూడా వైసీపీ వ్యూహాలు కొరవడి చేష్టలుడిగి చూస్తోందని అంటున్నారు. మొత్తానికి పంచాయతీ నీదా నాదా అని అక్కడ బాబు జగన్ ప్రతిష్టగా తీసుకున్నారు. మరి ఇక్కడ పంచాయతీలో ఫ్యాన్ స్పీడ్ అందుకోకపోతే ఆ పార్టీకి యమ డేంజరే అంటున్నారు.

Tags:    

Similar News