కోలుకునేదెన్నడు…? కోరిక తీరేదెప్పుడు?

నెల్లూరు జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి ఏంటి ? ఏం జ‌రుగుతోంది ? ఇక్కడ అసలు పార్టీ ఉంటుందా ? ఉండ‌దా ? అనే సందేహాలు తెర‌మీదికి వ‌చ్చాయి. [more]

Update: 2020-06-28 13:30 GMT

నెల్లూరు జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి ఏంటి ? ఏం జ‌రుగుతోంది ? ఇక్కడ అసలు పార్టీ ఉంటుందా ? ఉండ‌దా ? అనే సందేహాలు తెర‌మీదికి వ‌చ్చాయి. ఎవ‌రు ప్రజ‌ల‌కు ద‌గ్గర‌గా ఉన్నారు ? ప‌్రజ‌ల నాడి ఏంటి? ప‌్రజ‌లు ఎవ‌రిని కోరుకుంటున్నారు ? అనే సూత్రాన్ని ప‌ట్టించుకోకుండా చంద్రబాబు వ్యవ‌హ‌రిస్తున్న తీరుతో పార్టీ పూర్తిగా న‌ష్టపోయే ప‌రిస్థితి ఏర్పడింది. జిల్లాలో మొత్తం 10 నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. ప్రతి నియోజ‌క వ‌ర్గంలోనూ పార్టీ ప‌రిస్థితి దారుణంగానే ఉంది. నెల్లూరు సిటీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి పి. నారాయ‌ణ అస్త్రస‌న్యాసం చేశారు. ఆయ‌న ఏకంగా రేపోమాపో.. వైసీపీ తీర్థం పుచ్చుకుంటార‌నే వార్తలు వ‌స్తున్నాయి. దీంతో పార్టీ న‌గ‌ర బాధ్యత కోటంరెడ్డి శ్రీనివాస‌రెడ్డికి ఇచ్చారు.

సమర్థనాయకుల కోసం…..

అయితే, ఆయ‌న దూకుడు ఎక్కడా చూపించలేక పోతున్నారు. నెల్లూరు రూర‌ల్‌లో మాజీ మేయ‌ర్‌.. అజీజ్ న‌డిపిస్తున్నా.. స‌మ‌ర్ధుడు కాడ‌నే అంటు న్నారు. అయినా కూడా చంద్రబాబు ఆయ‌న‌కే బాధ్యత‌లు అప్ప‌గించారు. అక్కడ బలంగా ఉన్న వైసీపీ సీనియ‌ర్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీథ‌ర్‌రెడ్డిని ఢీ కొట్టే సీన్ అజీజ్‌కు లేద‌ని టీడీపీ వాళ్లే చెపుతున్నారు. ఇక‌, స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో ఐదుసార్లు ( ఓసారి కోవూరులో) వ‌రుస‌గా ఓడిపోతున్నా కూడా.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డికే టికెట్ ఇస్తున్నారు. దీంతో ఇక్కడ కూడా నాయ‌కులు తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. ఇంకా అక్కడ కొత్త నాయ‌కత్వాన్ని ఎంక‌రేజ్ చేయ‌క‌పోతే పార్టీ స‌ర్వేప‌ల్లి సీటు మ‌ర్చిపోవ‌చ్చనే అంటున్నారు టీడీపీ నేత‌లు.

అనేక నియోజకవర్గాల్లో……

అదే స‌మ‌యంలో సూళ్లూరుపేట‌లో మాజీ మంత్రి ప‌ర‌సా ర‌త్నంకు టికెట్ వ‌ద్దన్నా విన‌కుండా ఇచ్చారు. ఆయ‌న ఏకంగా 40 వేల ఓట్లతో ఓడారు. అక్కడా నాయ‌క‌త్వం మార్చాల‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు సీటు ఇవ్వవ‌ద్దని టీడీపీ నేత‌లు ముక్తకంఠంతో చెప్పినా చంద్రబాబు మాత్రం విన‌లేదు. అదేవిధంగా కొవ్వూరులోనూ ప‌రిస్థితి ఘోరంగా ఉంది. పోలంరెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోయాక నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలేసి హైద‌రాబాద్‌లో వ్యాపారాల‌కు ప‌రిమితం అయ్యారు.కావ‌లిలో బీద ర‌విచంద్ర, విష్ణువ‌ర్దన్‌రెడ్డి వ‌ర్గాల మ‌ధ్య వార్ న‌డుస్తోంది. దీంతో పార్టీ ప‌రిస్థితి క‌న్నా కూడా ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. బీద మ‌స్తాన్‌రావు పార్టీ వీడాక కావ‌లిలో పార్టీకి పెద్ద మైన‌స్ అయ్యింది. ఇప్పట్లో ఇక్క‌డ పార్టీ కోలుకునే ప‌రిస్థితి లేదు.

కొత్త వారికి ఇవ్వాలని…..

ఆత్మకూరులో మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య పోటీ చేసి.. ఓడిపోయారు. దీంతో ఆయ‌న కూడా ఇక్కడ ప‌ట్టించుకోవ‌డం లేదు. వ‌యోం భారంతో ఆయ‌న ఓడిపోయాక నియోజ‌క‌వ‌ర్గాన్ని పూర్తిగా గాలికి వ‌దిలేశారు. అక్కడ మ‌రో నేత‌కు పార్టీ ప‌గ్గాలు ఇస్తే త‌ప్పా మంత్రి గౌతంరెడ్డిని ఎదుర్కొని పార్టీ బ‌తికే ప‌రిస్థితి లేదు. ఉద‌య‌గిరిలో బొల్లినేని రామారావు.. ఏడాది కాలంలో అప్పుడప్పుడు మాత్రమే వ‌చ్చి విజిట్ చేసి వెళ్లారు త‌ప్ప.. ఇక్క‌డ పార్టీని ప‌ట్టించుకోలేదు. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ కూడా క‌మ్మ వ‌ర్గం నేత‌లే కొత్త వ్యక్తికి పార్టీ ప‌గ్గాలు ఇవ్వాల‌ని కోరుతున్నారు.

ఈ రెండు నియోజకవర్గాల్లోనే….

ఇక‌, వెంక‌టగిరి, గూడూరులో మాత్రం కొంత వ‌ర‌కు ఫ‌ర్వాలేద‌నే టాక్ ఉంది. వెంక‌ట‌గిరిలో రెండుసార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ ఓడిపోయినా.. త‌న హ‌వా మాత్రం ప్రద‌ర్శిస్తూ.. ప్రజ‌ల‌కు చేరువ అవుతున్నారు. గూడూరులో పాశం సునీల్ కూడా వ్యక్తిగ‌త ఇమేజ్‌తో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజ‌ల్లో ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పటికైనా చంద్రబాబు స్థానిక ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించి జిల్లాలో కొత్త నాయ‌క‌త్వాన్ని ఎంక‌రేజ్ చేస్తే త‌ప్పా అస‌లు పార్టీ జెండా ప‌ట్టుకునే నాథుడు కూడా లేడు.

Tags:    

Similar News