ఈ జిల్లా కూడా క‌డ‌ప‌ను త‌ల‌పిస్తుందే?

రాష్ట్రంలో ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉంది ? రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో చేస్తున్న ఆందోళ‌న‌లు ఏమైనా పార్టీకి స‌హ‌క‌రించాయా ? పార్టీ పుంజుకుందా ? [more]

Update: 2020-01-28 15:30 GMT

రాష్ట్రంలో ప్రధాన ప్రతిప‌క్షం టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉంది ? రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో చేస్తున్న ఆందోళ‌న‌లు ఏమైనా పార్టీకి స‌హ‌క‌రించాయా ? పార్టీ పుంజుకుందా ? ఏయే జిల్లాల్లో ఎలా ఉంది ? అనే విష‌యాలు తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు శ్రమ ఉన్నా ఫ‌లితం సున్నా అనే మాటే వినిపిస్తోంది. నెల్లూరు జిల్లా ప‌రిస్థితిని ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగు చూస్తున్నాయి. ఈ జిల్లాలో టీడీపీ నాయ‌కులు ఒక‌ప్పుడు దూకుడు ప్రద‌ర్శించారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదేళ్ల పాటు అన్ని విధాలా మంత్రిగా చ‌క్రం తిప్పిన నారాయ‌ణ ఈ జిల్లావారే. ఇక‌ త‌నవాగ్దాటితో వైసీపీకి క‌ళ్లెం వేసేందుకు ప్రయ‌త్నించిన సోమిరెడ్డి చంద్రమోహ‌న్‌రెడ్డిదీ ఈ జిల్లానే.

ఫుల్లు సైలెంట్ అయి….

అయితే, ఇప్పుడు ఇలాంటి వారు ఏం చేస్తున్నారు. ఒక‌ప‌క్క,రాజ‌ధాని ర‌గ‌డ‌తో టీడీపీ టోట‌ల్ బిజీగా గ‌డుపు తుంటే నెల్లూరు జిల్లా నాయ‌కులు మాత్రం నీరో చ‌క్రవ‌ర్తిని త‌ల‌పిస్తున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎన్నిక‌ల‌కు ముందు పార్టీలో దూకుడు చూపించిన అనేక మంది నాయ‌కులు ఇప్పుడు ఫుల్లుగా సైలెంట్ అయిపోయారు. ఎవ‌రికి వారే అనే విధంగా వ్యవ‌హ‌రిస్తున్నారు. పార్టీ కార్య‌క్ర‌మాల‌ను కూడా ప‌ట్టించుకోవ డం లేదు. ఎన్నిక‌ల‌కు ముందు నిత్యం ప్రజ‌ల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యేలు బొల్లినేని రామారావు బొల్లినేని కృష్ణయ్య, కావ‌లిలో విష్ణువ‌ర్ధన్‌రెడ్డి, నెల్లూరు సిటీలో నారాయ‌ణతో పాటు రూర‌ల్‌లో మాజీ మేయ‌ర్ అబ్దుల్‌ అజీజ్ ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని, పార్టీ కేడ‌ర్‌ను ఎంత మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు.

ఎవరికి వారే…?

గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయాక వీళ్లు నియోజ‌క‌వ‌ర్గాల‌కు మొఖం చాటేయ‌డంతో ఎవ‌రికి వారే య‌మునా తీరే అనే విధంగా ఇక్క‌డి ప‌రిస్థితి మారిపోయింది. ఇక జిల్లాలో రెండు రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాలు అయిన సూళ్లూరుపేట‌, గూడూరులోనూ పార్టీ ప‌రిస్థితి మ‌రింత దిగజారింది. ఇక్కడ పార్టీ అభ్యర్థులు ఘోరంగా ఓడిపోవ‌డంతో పార్టీ కేడ‌ర్ కూడా వైసీపీలోకి వెళ్లిపోతోంది. ఇక నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిన సీనియ‌ర్ నేత బీద మ‌స్తాన్‌రావు ఇప్పటికే వైసీపీలోకి వెళ్లిపోవ‌డంతో జిల్లాలో బీసీల్లో బ‌లంగా ఉన్న ఓ సామాజిక‌వ‌ర్గంలో కూడా పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది.

ఒకటి రెండు నియోజకవర్గాల్లోనే…..

వెంక‌ట‌గిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామ‌కృష్ణ ఒక్కరే ఒకింత ఫ‌ర్వాలేద‌ని పిస్తున్నారు. ఆ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం ప్రభుత్వంపై పార్టీ చేప‌డుతోన్న కార్యక్రమాల విష‌యంలో కాస్త హ‌డావిడి చేస్తున్నారు. మిగిలిన వారిలో చాలా మంది త‌మ వ్యాపారాలు చేసుకోవ‌డం లేదా? అధికార పార్టీ నేత‌ల‌తో లోపాయికారీగా చేతులు క‌లిపి త‌మ ప‌నులు చేయించుకోవ‌డంపైనే దృష్టి పెడుతున్నారు. దీంతో కీల‌కమైన రాజ‌ధాని వివాదం స‌మ‌యంలో నెల్లూరు వంటి జిల్లాలో టీడీపీ జెండా ఎక్కడా క‌నిపించ‌ని ప‌రిస్థితి ఏర్పడ‌డంపై తీవ్రమైన చ‌ర్చే జ‌రుగుతోంది. నెల్లూరు జిల్లాకు వైజాగ్ చాలా దూరం ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయంపై కొంత‌మందిలో వ్యతిరేక‌త ఉంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నేత‌లు పోరాటాలు చేస్తున్నా నెల్లూరు టీడీపీ నేత‌లు మాత్రం లైట్ తీస్కొంటోన్న ప‌రిస్థితి. ఏదేమైనా సీఎం సొంత జిల్లా క‌డ‌ప కంటే ఘోరంగా ఇక్క‌డ టీడీపీ పరిస్థితి దిగ‌జార‌డంతో టీడీపీ వీరాభిమానులే త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

Tags:    

Similar News