సై‘‘కిల్’’ అయినట్లేనా..?

గుంటూరు జిల్లా న‌ర‌స‌రావు పేట రాజ‌కీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. వాస్త‌వానికి ఈ నియోజ‌క వ‌ర్గం రాజ‌కీయంగా ఎంతో ప్రాముఖ్య‌మైంది. ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా టీడీపీ నాయ‌కుడు, దివంగ‌త [more]

Update: 2019-09-28 15:30 GMT

గుంటూరు జిల్లా న‌ర‌స‌రావు పేట రాజ‌కీయాలు అనూహ్యంగా మారుతున్నాయి. వాస్త‌వానికి ఈ నియోజ‌క వ‌ర్గం రాజ‌కీయంగా ఎంతో ప్రాముఖ్య‌మైంది. ఇక్క‌డ నుంచి వ‌రుస‌గా టీడీపీ నాయ‌కుడు, దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద్ విజ‌యం సాధించారు. అంతేకాదు, ప్ర‌త్య‌ర్థుల‌కు సింహ‌స్వ‌ప్నంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రించి పేరు తెచ్చుకున్నార‌ని అంటారు. 1983 నుంచి 1999 వ‌ర‌కు వ‌రుస‌గా ఐదుసార్లు విజ‌యం సాధించారు. ఆ త‌ర్వాత 2004, 2009 ఎన్నిక‌ల్లో ఆయ‌న అక్క‌డ వ‌రుస‌గా రెండుసార్లు ఓడిపోయారు. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో తొలిసారి వైసీపీ ఇక్కడ 2014లో విజ‌యం సాధించిం ది. ఇక‌, ఇక్క‌డ రాజ‌కీయాల‌ను త‌న‌దైన శైలిలో ప్ర‌భావం చేయాల‌ని కోడెల భావించారు. ఈ నేప‌థ్యంలో గ‌డిచిన ఐదేళ్ల కాలంలో ఇక్క‌డ వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ మ‌ధ్య భారీ పోరు సాగింది.

పేటను వదలకుండా…..

వాస్త‌వానికి 2014 ఎన్నిక‌ల్లో త‌న‌కు స‌త్తెన‌ప‌ల్లి టికెట్ కేటాయించిన నేప‌థ్యంలో కోడెల శివప్రసాద్ అక్క‌డికి వెళ్లిపోయా రు. ఆ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి ఆయ‌న ఆరోసారి అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న మ‌న‌సు, వ్యూహం మాత్రం న‌ర‌సరావుపేట పైనే ఉండ‌డం గ‌మ‌నార్హం. రెండున్న‌ర ద‌శాబ్దాలుగా న‌ర‌సారావుపేట పాలిటిక్స్‌లో కాక‌లుతీరిన యోధుడిగా ఉన్న కోడెల శివప్రసాద్ కు అక్క‌డ బ‌ల‌మైన అనుచ‌ర‌గ‌ణం ఉంది. దీంతో ఇక్క‌డే ఎక్కువగా అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. తాను స్పీకర్‌గా ఉండ‌డం రాజ్యంగం ప్ర‌కారం సంక్ర‌మించిన హ‌క్కుల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుని ఇక్క‌డ ప‌నులు చేప‌ట్టారు. ప్ర‌తి విష‌యంలోనూ క‌లుగ‌జేసుకునేవారు. కోడెల శివప్రసాద్ వ్యూహం ప్ర‌కారం న‌ర‌స‌రావుపేట‌ను తానే అభివృద్ధి చేశాను కాబ‌ట్టి.. ఈ నియోజ‌క‌వ‌ర్గం త‌న‌కే సొంతం కావాల‌ని అనుకున్నారు.

కొడుకును తెద్దామనుకున్నా…

అటు స‌త్తెన‌ప‌ల్లిలోనూ, ఇటు న‌ర‌సారావుపేట‌లోనూ కోట్లాది రూపాయాల‌తో కోడెల శివప్రసాద్ అభివృద్ధి ప‌నులు చేప‌ట్టారు. అయితే న‌ర‌సారావుపేట నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న త‌న‌యుడు చేసిన ప‌నుల‌తోనే ఆయ‌న ప్ర‌తిష్ట‌కు ఎంతైనా మ‌చ్చ వ‌చ్చింద‌న్న‌ది మాత్రం వాస్త‌వం. ఈ క్ర‌మంలోనే త‌న కుమారుడు, డాక్ట‌ర్ కోడెల శివ‌రామ‌కృష్ణ‌ను రంగంలోకి దింపాల‌ని ప్ర‌య‌త్నించారు. అయితే, చంద్ర‌బాబు మాత్రం ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో కేవ‌లం కోడెల శివప్రసాద్ కు మాత్రమే టికెట్ కేటాయించారు. రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎక్క‌డో ఓ చోట నుంచి పోటీ చేయాల‌ని ఆప్ష‌న్ ఇవ్వ‌గా స‌త్తెన‌ప‌ల్లిలోనే కోడెల శివప్రసాద్ పోటీ చేసి ఓడిపోయారు.

గోపిరెడ్డి పట్లు సాధించడంతో…

స‌రే.. ఆయ‌న ఓట‌మి.. త‌ద‌నంత‌ర ప‌రిణామాలు.. ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం వంటివి తెలిసిందే. ఇక‌, ఇప్పుడు పేట రాజ‌కీయాల్లో ఎవ‌రు పైచేయి సాధిస్తారు? అనేది కీల‌కంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాల ప్ర‌కారం స్థానికులు ప్ర‌స్తుత ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డికే జై కొడుతున్నారు. ఆయ‌న సౌమ్యుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్ర‌తి ఒక్క‌రినీ క‌లుపుకొని పోతున్నారు. పైగా డాక్ట‌ర్‌గా అంద‌రికీ ఇప్ప‌టికీ సేవ‌లు అందిస్తున్నారు. ఇలా పేట రాజ‌కీయాల్లో వైసీపీ దూసుకుపోతోంద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. 2014లో పార్టీ ఓడిన‌ప్పుడు కూడా ఆయ‌న ఇక్క‌డ ఏకంగా 16 వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నిక‌ల్లోనూ మ‌రోసారి ఆయ‌నే భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు.

దీనావస్థలో టీడీపీ….

ఇక కోడెల శివప్రసాద్ లాంటి నేత మృతితో పేట‌లో టీడీపీ ప‌రిస్థితి ఏంట‌న్న ప్ర‌శ్న ఉత్ప‌న్న కాక‌మాన‌దు. గ‌త నాలుగు ఎన్నిక‌ల్లోనూ ఇక్క‌డ టీడీపీ జెండా ఎగ‌ర‌డం లేదు. ఇక్క‌డ కోడెల శివప్రసాద్ ఐదుసార్లు గెలిచినా చివ‌ర్లో రెండుసార్లు ఓడిపోయారు. ఆ త‌ర్వాత రెండుసార్లు కూడా పార్టీ ఓడిపోయింది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ చంద్ర‌బాబు బీసీ అస్త్రం ప్ర‌యోగించి డాక్ట‌ర్ చ‌ద‌ల‌వాడ అర‌వింద‌బాబుకు సీటు ఇచ్చారు. అయినా ఆయ‌న ఘోరంగా ఓడిపోయారు. దీంతో ఇక్క‌డ రెడ్డి డామినేష‌న్ ఉన్న నేప‌థ్యంలో బాబు విరుగుడిగా బీసీ అభ్య‌ర్థిగా ఉన్న అర‌వింద‌బాబునే కంటిన్యూ చేస్తారా ? లేదా ? స‌మీక‌ర‌ణ ప‌రంగా మార్పులు, చేర్పులు చేస్తారా ? అన్న‌ది చూడాలి. ప్ర‌స్తుతం పేట‌లో టీడీపీ అత్యంత దీనావ‌స్థ‌లో ఉంద‌న్న‌ది మాత్రం నిజం.

Tags:    

Similar News