ఎలిమినేట్ అయ్యేది నూరుశాతం టీడీపీనేనట

ఏపీలో స్థానిక ఎన్నికలు జరగకుండానే సమరం మాత్రం జరిగిపోతోంది. ఎక్కడైనా ఎన్నికలు జరిగితేనే వేడి వాడి ఉంటుంది.కానీ ఏపీలో మాత్రం అసలు ఎన్నిక అన్నదే లేదు. కానీ [more]

Update: 2021-01-20 14:30 GMT

ఏపీలో స్థానిక ఎన్నికలు జరగకుండానే సమరం మాత్రం జరిగిపోతోంది. ఎక్కడైనా ఎన్నికలు జరిగితేనే వేడి వాడి ఉంటుంది.కానీ ఏపీలో మాత్రం అసలు ఎన్నిక అన్నదే లేదు. కానీ ఏడాదిగా పంచాయతీ మాత్రం అలాగే సాగుతోంది. దీనికంతటికీ కారణం రెండు బలమైన ప్రాంతీయ పార్టీల మధ్య సాగుతున్నరాజకీయ సంఘర్షణ. ఒకరిని ఒకరి ఎలిమినేట్ చేసుకునేందుకు ఆడుతున్న భయంకరమైన రాక్షస క్రీడ. దాని వల్లనే స్థానిక ఎన్నికలు కూడా అందులో భాగమైపోతున్నాయి.

బంపర్ విక్టరీ ఫీవర్ ….

ఏపీలో జగన్ సర్కార్ బంపర్ మెజారిటీతో అధికారలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 151 సీట్లు యాభై శాతం మేర ఓట్లు అంటే అది అద్భుతమైన విజయంగానే చూడాలి. నిజానికి జగన్ కూడా ఇటువంటి విజయాన్ని కలలో కూడా ఊహించలేదు అంటారు. జగన్ లెక్కలు 125 సీట్ల దగ్గరే ఆగిపోయాయని చెబుతారు. మరి మొత్తానికి మొత్తం అసెంబ్లీని చుట్టేస్తూ జగన్ ముఖ్యమంత్రి కావడం అంతే ఆషామాషీ గెలుపు గా చూడకూడదు. ఆ విజయం అందించిన ఫీవర్ నుంచి ఇప్పటికీ జగన్ కానీ ఆయన పార్టీ కానీ బయటపడలేకపోతున్నారు. దాన్ని రిపీట్ చేయాలని కూడా కసిగా ఎదురుచూస్తున్నారు.

అందుకే లడాయి…..

గత ఏడాది మార్చిలో ఏ మాత్రం వ్యవధి ఇవ్వని విధంగా లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ ని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఒకేసారి పంచాయతీ నుంచి మునిసిపల్ కార్పోరేషన్ దాకా కేవలం ఇరవై రోజుల్లో ఎన్నికలు అంటూ షెడ్యూల్ విడుదల అయింది. నాడు ఉన్నది కూడా ఎన్నికల అధికారిగా ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇక వైసీపీకి ఏకగ్రీవాలు చూస్తే నాడు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికం జరిగాయి. బహుశా ఆ షెడ్యూల్ వైసీపీ దూకుడు చూస్తే టీడీపీకి వెన్నులో వణుకు పుట్టి ఉంటుంది. ఇలా అయితే కనీస మాత్రంగా కూడా సీట్లూ ఓట్లూ రాలవని టీడీపీ వ్యూహకర్తలకు అర్ధమైపోయింది. దానికి తోడు కరోనా రావడంతో దాన్ని సాకు చూపి నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేశారు. అక్కడితో అసలు కధ మొదలైపోయింది.

కొత్తవారు వస్తే …?

ఇక నిమ్మగడ్డ ఉండగానే ఎన్నికల క్రతువు జరిగితే చాలా వరకూ గెలుపు అవకాశాలు ఉంటాయని చంద్రబాబు ఆయన పార్టీ ఆలోచన చేస్తోంది. నిజానికి టీడీపీకి క్షేత్ర స్థాయిలో బలం ఉంది కానీ నూటికి తొంబై శాతం పైగా సీట్లు గెలవడానికి వైసీపీ వేస్తున్న ఎత్తులే పసుపు పార్టీని కలవరపెడుతున్నాయి. ఎటూ నిమ్మగడ్డతో ప్రభుత్వానికి చెడింది కాబట్టి ఆయన్ని అడ్డం పెట్టుకుని ఎన్నికలకు వెళ్తే బాగా గెలుచుకొవచ్చు అన్నది టీడీపీ థియరీ. కొత్తగా మరో అధికారి కనుక వస్తే ఇక టీడీపీకి ఎన్నికల్లో భంగపాటు తప్పదు అన్నది నిజం. ఎందుకంటే ప్రభుత్వంతో సంప్రదించి ఆ అధికారి ఎన్నికలను పెడతారు, ఇక ఎటూ చేతిలో పవర్ తో పాటు వైసీపీ దూకుడు, జగన్ జోరు తెలిసిందే. దాంతో కసిగా వైసీపీకి నూరు శాతం విజయం తేవడానికి మంత్రులు ఎమ్మెల్యేలు రెడీగా ఉంటారు. అదే కనుక జరిగితే టీడీపీని క్షేత్ర స్థాయిలో పూర్తిగా తొక్కేసినట్లే. అందుకే నిమ్మగడ్డను పావుగా మార్చి అయినా స్థానిక ఎన్నికలు ఇపుడే అంటూ టీడీపీ తెగ హడావుడి చేస్తోంది. కానీ సీన్ చూస్తూంటే నిమ్మగడ్డ రిటైర్ అవుతారేమో కానీ ఎన్నికలు జరిగేలా లేవు. మరి ఆ మీదట ఏపీలో ఎపుడు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినా ఎలిమినేట్ అయ్యేది నూరు శాతం టీడీపీయే.

Tags:    

Similar News