యాక్టివ్ అవుతున్న నేతలు.. శుభ సూచికమే?

రాజ‌ధాని జిల్లాల్లో ఒక‌టైన కృష్ణా జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉంది ? టీడీపీ వ్యవ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ జ‌న్మించి… అసెంబ్లీకి ప్రాథినిత్యం వ‌హించిన జిల్లాలో టీడీపీ [more]

Update: 2020-06-28 15:30 GMT

రాజ‌ధాని జిల్లాల్లో ఒక‌టైన కృష్ణా జిల్లాలో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉంది ? టీడీపీ వ్యవ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ జ‌న్మించి… అసెంబ్లీకి ప్రాథినిత్యం వ‌హించిన జిల్లాలో టీడీపీ ఎలా ప‌రుగులు పెడుతోంది ? ఏడాది కింద‌ట ఎన్నిక‌లు పూర్తయ్యాయి. కేవ‌లం రెండు స్థానాల్లో మాత్రమే టీడీపీ విజ‌యం సాధించింది. గ‌న్నవ‌రం స‌హా విజ‌య‌వాడ తూర్పులో సైకిల్ గెలుపు గుర్రం ఎక్కింది. మిగిలిన కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో సైతం .. పార్టీ ఓట‌మిపాల‌య్యారు. మ‌రీ ముఖ్యంగా విజ‌య‌వాడ సెంట్రల్‌లో కేవ‌లం 25 ఓట్ల తేడాతోనే పార్టీ ఓడిపోవ‌డం గ‌మ‌నార్హం. ఈ నేప‌థ్యంలో మ‌రి ఏడాది కాలంలో పార్టీ ఈ జిల్లాలో ఎలాంటి ప్రతిభ‌ను చూపించింది. ఎలా ముందుకు సాగుతోంది ? ఇప్పుడు ఈ విష‌యాలే ఆస‌క్తిక‌ర చ‌ర్చగా ఉన్నాయి.

కొంత పుంజుకున్నట్లే….

జిల్లాలో గ‌త ఏడాది కింద‌టి ఇప్పటికి .. కొంత పుంజు కుంద‌నే ధోర‌ణి క‌నిపిస్తోంది. దీనికి ప్రధాన కార‌ణం.. రాజ‌ధాని ప్రాంతంగా ఉండ‌డంతో విజ‌య‌వాడ అభివృద్ది ప‌థంలో ముందుకు సాగేది. విజ‌య‌వాడ మెట్రో రైల్ కూడా వ‌చ్చేది. కానీ, ఇప్పుడు జ‌గ‌న్ తీసుకున్న మూడు రాజ‌ధానుల‌ నిర్ణయంతో విజ‌య‌వాడ ప్రజ‌లు ఊసూరుమంటున్నారు. గ‌త ఐదేళ్ల టీడీపీ పాల‌న‌లో విజ‌య‌వాడ న‌గ‌ర అభివృద్ది ఉరుకులు ప‌రుగులు పెట్టింది. అన్ని వ్యాపారాలు మూడు పువ్వులు, ఆరుకాయలుగా వెలిగాయి. ఎప్పుడు అయితే వైసీపీ అధికారంలోకి వ‌చ్చిందో అప్పటి నుంచి విజ‌య‌వాడ అభివృద్ధి, అక్క‌డ వ్యాపారాలు డౌన్ అవుతూ వ‌చ్చాయి.

మూడు రాజధానుల ప్రభావం….

ఇక మూడు రాజ‌ధానుల ప్రభావం త‌ర్వాత విజ‌య‌వాడ అభివృద్ధి పూర్తిగా స్టాప్ అయ్యింది. ఇక్కడ ప్రజ‌లు కూడా టీడీపీనే అధికారంలో ఉండి ఉంటే.. అనే ఆలోచ‌న చేస్తున్నారు. నాయ‌కుల మ‌ధ్య విభేదాలు ఉన్నప్పటికీ.. పార్టీప‌ట్ల సానుభూతి క‌నిపిస్తోంది. జిల్లాలో ఒక్క గుడివాడ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం మంత్రి కొడాలి నాని వైపే ప్రజ‌లు మొగ్గు చూపుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇక్కడ పూర్తిగా వైసీపీ హ‌వా ఉంది. టీడీపీకి స‌రైన నాయ‌క‌త్వం లేక‌పోవ‌డం కూడా ఇందుకు ప్రధాన కార‌ణం. ఇక‌, గ‌న్నవ‌రం నుంచి గెలిచిన వ‌ల్లభ‌నేని వంశీ పార్టీకి దూర‌మైనా.. ఇక్కడ ప్ర‌జ‌లు టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నార‌ని అంటున్నారు. విజ‌య‌వాడ సెంట్రల్‌లో బొండా ఉమా.. కేవ‌లం పాతిక ఓట్ల తేడాతోనే ఓడిపోయారు. ఆయ‌న‌పైనా సానుభూతి ఉంది.

యాక్టివ్ గా నేతలు….

ఇక‌, పెన‌మ‌లూరులో బోడే ప్రసాద్ యాక్టివ్ఃగానే ఉన్నారు. జ‌గ్గయ్యపేట‌లోనూ పార్టీ దూకుడుగానే ఉంది. అవ‌నిగ‌డ్డలో మాజీ డిప్యూటీ స్పీక‌ర్ మండ‌లి బుద్ధ ప్రసాద్ టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపోయినా.. పార్టీ ప‌వ‌నాలు మాత్రం వీస్తున్నాయి. తిరువూరులో మాజీ మంత్రి కేఎస్‌. జ‌వ‌హ‌ర్‌ ఓడిపోయారు. అయితే, ఆయ‌న ఓట‌మి ప‌రాభ‌వం నుంచి వెంట‌నే తేరుకున్నారు. నిత్యం ప్రజ‌ల్లోనే ఉంటున్నారు. స్థానిక స‌మ‌స్యల‌పై దృష్టి పెట్టారు. ప్రభుత్వంపైనా విమ‌ర్శలు సంధిస్తున్నారు. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే యాక్టివ్‌గా లేక‌పోవ‌డం కూడా టీడీపీకి, జ‌వ‌హ‌ర్‌కు ప్లస్ అయ్యింది. ఇక మైల‌వ‌రంలో దేవినేని ఉమా ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉంటున్నారు.

గట్టిగా నిలబడుతున్న నేతలు…

విజ‌య‌వాడ తూర్పు నుంచి విజ‌యం సాధించిన రామ్మోహ‌న్ రావు కూడా ప‌ట్టిష్టంగానే ఉన్నారు. మ‌చిలీప‌ట్నంలో మాజీ మంత్రి కొల్లు ర‌వీంద్ర కూడా దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. అయితే, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం పార్టీ ప‌రిస్థితి అధ్వానంగా ఉంది. ఇక్కడ జ‌లీల్‌ఖాన్ చేతులు ఎత్తేశారు. గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఆయ‌న కుమార్తె ఖాతూన్ అమెరికా వెళ్లిపోయారు. ఇక సిటీలో ఎంపీ కేశినేని నానితో పాటు ఆయన కుమార్తె శ్వేత చేస్తోన్న కార్యక్రమాలు కూడా టీడీపీకి ప్లస్ అవుతున్నాయి. ఏదేమైనా.. ఇప్పుడు కొంత వ‌ర‌కు టీడీపీలో వినిపిస్తున్న గ‌ళాల్లో ఎక్కువ‌గా కృష్ణాజిల్లా నుంచే కావ‌డం గ‌మ‌నార్హం. అటు జ‌గ‌న్ నిర్ణయాల‌కు తోడు ఇటు పార్టీ నేత‌ల స‌మ‌ష్టిత‌నంతో ఈ జిల్లాలో టీడీపీ ఎంతో కొంత పుంజుకున్నట్టే ఉంది.

Tags:    

Similar News