Tdp : ఇప్పట్లో పట్టు దొరికే అవకాశం లేదట

అసలే కడప అంతంత మాత్రం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పెద్దగా హోల్డ్ లేదు. కడప వైఎస్ సొంత జిల్లా కావడంతో చంద్రబాబు పార్టీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత [more]

Update: 2021-10-11 08:00 GMT

అసలే కడప అంతంత మాత్రం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పెద్దగా హోల్డ్ లేదు. కడప వైఎస్ సొంత జిల్లా కావడంతో చంద్రబాబు పార్టీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత టీడీపీ ఇక్కడ గెలుపు సాధించింది చాలా తక్కువనే చెప్పాలి. అలాంటి కడప జిల్లాలో కాలు మోపేందుకు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అన్ని ప్రయత్నాలు చేశారు. పులివెందులకు నీళ్లు ఇచ్చామన్నారు. వైసీపీ నుంచి వచ్చిన ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి ఇచ్చారు. అయినా కడప జిల్లాలో టీడీపీ బలోపేతం కావడం లేదు.

క్లీన్ స్వీప్ చేస్తున్న…

2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో ఒకే ఒక్క సీటు గెలిచింది. అది కూడా రాజంపేట నుంచి గెలిచిన మల్లికార్జున రెడ్డి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిపోయారు. 2019 ఎన్నికలలో కడప జిల్లా నుంచి ఒక్క సీటు కూడా టీడీపీ దక్కించుకోలేక పోయింది. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉండగా వైెఎస్ వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించడమే టీడీపీ దక్కించుకున్న అతి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు.

బలోపేతం చేసేందుకు….

అయితే ఇప్పుడు కడప జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా టీడీపీ నుంచి ఎలాంటి ప్రయత్నాలు జరగడం లేదు. ఉన్న పార్టీ అధ్యక్షుడు కూడా యాక్టివ్ గా లేరు. మంత్రి పదవి ఇచ్చిన ఆదినారాయణరెడ్డి, రాజ్యసభ పదవిని దక్కించుకున్న సీఎం రమేష్ లు పార్టీని విడిచి వెళ్లారు. ఇప్పుడు కడప జిల్లాలో టీడీపీకి బలమైన నేత ఎవరంటే బీటెక్ రవి ఒక్క పేరు మాత్రమే విన్పిస్తుంది. ఆయనకు ఏ నియోజకవర్గంలోనూ ప్రజా బలం లేదు.

భవిష్యత్ కూడా…

ఇక జమ్మలమడుగు లాంటి నియోజకవర్గంలో దశాబ్దకాలంగా ఉన్న రామసుబ్బారెడ్డి పార్టీని విడిచివెళ్లిపోయారు. ఇక్కడ ఆ పార్టీకి దిక్కులేకుండా పోయింది. గత ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలోనూ సరైన పోటీ ఇచ్చిన పరిస్థితిలేదు. ఒక్క ప్రొద్దుటూరు మినహా ఆ పార్టీకి బలమైన నేతలే కన్పించడం లేదు. దీనికి తోడు ఇటీవల బద్వేలు ఉప ఎన్నిక నుంచి టీడీపీ తప్పుకోవడం కూడా ఆ పార్టీకి ఇబ్బందికరంగానే మారనుంది. మొత్తం మీద కడప జిల్లాపై చంద్రబాబుకు ఇప్పట్లో పట్టు దొరికే అవకాశం లేదు.

Tags:    

Similar News