అక్కడ టీడీపీ జెండా పీకేయ‌డ‌మే బెట‌ర్‌… ఏం జ‌రుగుతోందంటే?

2018, ఫిబ్రవ‌రి : “ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్ త‌న‌కేదో సొంత జిల్లా క‌డ‌ప‌లో బ‌లం ఉంద‌ని, బ‌లగం ఉంద‌ని విర్రవీగుతున్నాడు. ఆయ‌న ఆట‌లు అక్కడ సాగ‌నివ్వను. క‌డ‌ప‌ను [more]

Update: 2020-03-08 15:30 GMT

2018, ఫిబ్రవ‌రి :

“ప్రతిప‌క్ష నేత జ‌గ‌న్ త‌న‌కేదో సొంత జిల్లా క‌డ‌ప‌లో బ‌లం ఉంద‌ని, బ‌లగం ఉంద‌ని విర్రవీగుతున్నాడు. ఆయ‌న ఆట‌లు అక్కడ సాగ‌నివ్వను. క‌డ‌ప‌ను వైఎస్ ఫ్యామిలీ ఫ్యాక్షన్ జోన్‌గా వాడుకుంటే.. నేను అభివృద్ధికి చిరునామాగా మారుస్తాను. ఇక్కడ నుంచి వైసీపీని త‌రిమి కొడ‌తాను. పులివెందుల రైతులకు నీరిచ్చేందుకు ప‌ట్టిసీమ‌ను ఏర్పాటు చేస్తున్నాను. ఇక‌, వైసీపీ క‌థ కంచికే.. క‌డ‌ప‌లో సైకిల్ పరుగు ఖాయ‌మే“-అప్పటి సీఎంగా చంద్రబాబు ప్రక‌ట‌న‌

2019, ఫిబ్రవ‌రి :

“వైఎస్ కుటుంబానికి మీరు కొన్ని ద‌శాబ్దాలుగా ఓట్లేస్తున్నారు. కానీ, వారు ఈ జిల్లాకు చేసింది ఏమైనా ఉందా ? నేను రాగానే మీకు నీళ్లిచ్చే ప్రయ‌త్నం చేశాను. ఇప్పుడు మీ నాయ‌కుడు, ఈ జిల్లా నాయ‌కుడు సీఎం ర‌మేష్ మీ కోసం, మీ జిల్లాలో క‌డ‌ప స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేశారు. ఆయ‌న స్ఫూర్తిగా కేంద్రం స‌హ‌క‌రించినా.. స‌హ‌క‌రించ‌క‌పోయినా.. నేను క‌ట్టి తీరుతాను. మీరంతా క‌ల‌సిక‌ట్టుగా టీడీపీని ఆశీర్వదించి, వైసీపీని త‌రిమికొట్టండి. పులివెందుల‌లో జ‌గ‌న్‌ కు డిపాజిట్లు రాకుండా ఓడించండి“ – ఎన్నిక‌ల ప‌ర్యట‌న‌లో క‌డ‌ప‌లో చంద్రబాబు ప్రసంగం

2020, ఫిబ్రవ‌రి :

గిర్రున రెండేళ్లు తిరిగాయి. చంద్రబాబు అప్పట్లో చేసిన వ్యాఖ్యలు, చెప్పిన మాట‌లు ప్రజ‌ల చెవుల్లో గింగిరులు తిరుగుతూనే ఉన్నాయి కానీ, ప‌రిస్థితి మాత్రం యూట‌ర్న్ తీసుకుంది. క‌డ‌ప‌లో ఎటు చూసిన వైసీపీ జెండాలే క‌నిపిస్తున్నాయి. ఎక్కడ విన్నా వైసీపీ నాయ‌కుల వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. మ‌చ్చుకు చూద్దామ‌న్నా టీడీపీ జెండా క‌నిపించ‌డంలేదు. ఆ పార్టీ నాయ‌కుల ఊసులు ఎక్కడా వినిపించ‌డమూ లేదు. ఇంతలోనే ఎంత మార్పు. అని సొంత పార్టీ వాళ్లే నోళ్లు వెళ్లబెడుతున్నారు. మొత్తం ప‌ది నియోజ‌క‌వర్గాల్లో వైసీపీ గుండుగుత్తుగా త‌న ఖాతాలో వేసుకుంది. కీల‌క‌మైన క‌డ‌ప‌, రాజంపేట ఎంపీ స్థానాల్లో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది.

కీలక నేతలందరూ…..

కీల‌క‌మైన టీడీపీ నాయ‌కులు ఆదినారాయ‌ణ‌రెడ్డి, సీఎం ర‌మేష్ వంటివారు ఇప్పటికే పార్టీ మారిపోయారు. ఇక‌, రామ‌సుబ్బారెడ్డి, స‌తీష్‌రెడ్డి వంటివారు త‌మ దారి తాము చూసుకుంటున్నారు. సీఎం ర‌మేష్‌, మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ల అవ‌స‌రాలు తీర్చుకుని ఇప్పుడు బీజేపీలోకి వెళ్లిపోయారు. ఇక స‌తీష్‌రెడ్డి, రామ‌సుబ్బారెడ్డి ఫ్యాన్ కింద సేద తీరే ప్రయ‌త్నాల్లో ఉన్నారు.

బ్రోచేవారెవరురా….

మైదుకూరు, రైల్వేకోడూరు, రాజంపేట‌, క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని ప‌ట్టించుకునే వారు కూడా క‌నిపించ‌డం లేదు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ చైర్మన్ ప‌ద‌వితో పాటు ఓ వెలుగు వెలిగిన సుధాక‌ర్ యాద‌వ్ ఇప్పుడు నాకెందుకులే అన్న ధోర‌ణితో ఉంటున్నారు. క‌మ‌లాపురంలో గ్రూపు త‌గాదాలు తీవ్రంగా ఉన్నాయి. ఇక జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి సైతం పార్టీలో ఉండాలా ? ఐటీ దాడులు త‌ట్టుకోలేక పార్టీ మారాలా ? అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఇక పోయిన నేత‌లు పోగా పార్టీలో ఉన్న వారిపై తీవ్ర వ్యతిరేక‌త ఉంది. ఈ నేప‌థ్యంలో చంద్రబాబు వైరిప‌క్షం జ‌గ‌న్ సొంత జిల్లాలో బ్రోచేవారెవ‌రురా! అంటూ త‌మ్ముళ్లు విల‌విల్లాడుతోన్న ప‌రిస్థితి క‌న‌పిస్తోంది. నిజ‌మే క‌దా.. ఇప్పుడు ఈ పార్టీని బ్రోచేవారు ఎవ‌రు?!!

Tags:    

Similar News