అక్కడ టీడీపీ క్లోజ్?

నిజానికి కడపలోనే టీడీపీకి ఏమంత గొప్పగా పరిస్థితి లేదు. పదికి పది సీట్లను ఊడ్చేసిన వైసీపీ ఇపుడు మంచి దూకుడు మీద ఉంది. జగన్ ముఖ్యమంత్రి కావడంతో [more]

Update: 2020-01-15 05:00 GMT

నిజానికి కడపలోనే టీడీపీకి ఏమంత గొప్పగా పరిస్థితి లేదు. పదికి పది సీట్లను ఊడ్చేసిన వైసీపీ ఇపుడు మంచి దూకుడు మీద ఉంది. జగన్ ముఖ్యమంత్రి కావడంతో ఆయన్ని ఎదుర్కోలేక చెట్టుకొకరు పుట్టకొకరుగా టీడీపీ నేతలు జారిపోయారు. జగన్ మీద పెద్ద సవాళ్ళే చేసిన చంద్రబాబు కుడిభుజం సీఎం రమేష్ పార్టీ ఓడగానే బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇపుడు ఆయన జగన్ కి జేజేలు పలికేదాకా వచ్చారు. మరో వైపు జగన్ ఫ్యామిలీని అడ్డుకునే పెద్ద తోపు తానేన‌ని మంత్రిగా గట్టి మాటలు మాట్లాడిన ఆదినారాయణరెడ్డి కూడా కమలం నీడలో సేదతీరుతున్నారు. ఆయన తమ్ముళ్ళు వైసీపీ వైపు చూస్తున్నారు. ఇంకో వైపు జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి ఫ్యామిలీ కూడా సైకిల్ దిగిపోతుందని అంటున్నారు. వీటన్నిటినీ మించి ఒక పెద్ద షాక్ టీడీపీకి తగల‌బోతోందిట.

సతీష్ సైలెంట్…

పులివెందులలో వైఎస్ కుటుంబంపై నేరుగా పాతికేళ్ళ నుంచి పోరాటం చేస్తున్న చరిత్ర సతీష్ రెడ్డిది. ఆయన వైఎస్సార్ మీద రెండు సార్లు, జగన్ మీద మరో రెండు సార్లు పోటీ చేసి భారీ స్థాయిలో ఓటమిపాలు అయ్యారు. చిత్రమేంటంటే సతీష్ నాలుగు సార్లు పోటీ చేస్తే ప్రత్యర్దులైన తండ్రీ తనయులు రెండు సార్లూ గెలిచి మరీ ఏకంగా ముఖ్యమంత్రులే అయ్యారు. మరో వైపు చూసుకుంటే పులివెందులలో అన్నిటికీ తెగించి పోరాడిన సతీష్ రెడ్డిని టీడీపీ వాడుకుందే తప్ప పెద్ద పీట వేసినది లేదు. ఎన్నికలకు రెండేళ్ళ ముందు మాత్రం ఎమ్మెల్సీని చేసి మండలిలో డిప్యూటీ చైర్మన్ ని చేసింది. ఆ పదవితో ఏమంత సుఖం, ఆనందం సతీష్ లో లేవన్నది నిజం. నిజమైన ఫైటర్ గా ఉన్న సతీష్ ని పార్టీ ఆదరించి కనీసం మంత్రిని చేయకపోవడమే విడ్డూరం. అరువు వచ్చిన ఆదినారాయణరెడ్డి కంటే మొదటి నుంచి ఉన్న సతీష్ బాబుకు అంత చేదు అయ్యారెందుకో మరి. దాంతోతాజాగా ఓడిన తరువాత నుంచి సతీష్ ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయాడట.

డుమ్మా కొట్టారుగా….

గత నెలలో చంద్రబాబు కడపకు వచ్చి సమీక్షలు పెడితే సతీష్ రెడ్డి హాజరు కాకుండా డుమ్మా కొట్టడం పెద్ద విశేషం. బాబు సైతం ఆయన్ని పట్టించుకోకుండానే కధ అయిందనిపించారు. ప్రాణాలకు తెగించి మరీ వైఎస్ కుటుంబంపైన పోరాడుతుంటే తనకు కనీసం అండగా పార్టీ లేదని సతీష్ తెగ ఫీల్ అవుతున్నారుట. అది పక్కన పెడితే మొన్న ఎన్నికల్లో జగన్ మీద ఓడిపోతానని తెలిసి కూడా బాగా ఖర్చు పార్టీ పరువు నిలిపిన సతీష్ కి బాబు ఆర్ధికంగా కూడా పెద్దగా అండగా నిలవలేదన్న బాధ ఆయనలో గూడు కట్టుకుందిట.

వైసీపీలోకేనా…

సతీష్ రెడ్డిలోని ఈ వైరాగ్యాన్ని చూసి తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ చూస్తోందట. సతీష్ రెడ్డికి కూడా టీడీపీ ప్రస్తుత పరిస్థితి అర్ధమైదంటున్నారు. దాని కంటే ముందు తాను ఎప్పటికీ వైఎస్ కుటుంబం మీద పొరాడుతూనే ఉండాలి తప్ప పదవీ..ఎదుగుదలా అసలు ఉండవన్నది కూడా అర్ధమైందట. ఈ మాత్రం సౌభాగ్యానికి పార్టీ పంచె పట్టుకుని వేలాడడం ఎందుకని సతీష్ కూడా ఆలోచన గట్టిగానే చేస్తున్నారుట. ఈ నేపధ్యంలో వైసీపీ రాయబేరాలు జరుపుతోందని, అవి కనుక ఫలిస్తే టీడీపీకి వీరవిధేయుడుగా ఉన్న సతీష్ చేజారడం ఖాయమని అంటున్నారు. ఇక సతీష్ రాకతో టీడీపీకి పట్టున్న చక్రాయపేట, వేముల మండలాల్లో కూడా వైసీపీ పతాకం ధీమాగా ఎగురుతుందని, జగన్ బే ఫికర్ గా మరిన్ని ఎన్నికలు ఇంట్లో పడుకుని గెలవ‌వచ్చునని ఆ పార్టీ నేతలు అంటున్నారు. చూడాలి మరి

Tags:    

Similar News