జమ్మలమడుగు జారిపోయినట్లేనా?

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరించిన వ్యూహాలు ఏమాత్రం ఫలించలేదు. పైగా పూర్తిిగా బెడిసి కొట్టాయి. ఇందులో ప్రధాన మైనది జమ్మలమడుగు పంచాయతి. [more]

Update: 2019-09-04 08:00 GMT

ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుసరించిన వ్యూహాలు ఏమాత్రం ఫలించలేదు. పైగా పూర్తిిగా బెడిసి కొట్టాయి. ఇందులో ప్రధాన మైనది జమ్మలమడుగు పంచాయతి. జమ్మలమడుగులో దశాబ్దాలుగా ఉన్న వైరి వర్గాలను ఒకతాటిపైకి తెచ్చి ఆ నియోజకవర్గాన్ని సులువుగా సొంతం చేసుకోవచ్చనుకున్నారు చంద్రబాబు. మాజీ మంత్రులు ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు ఒక్కటయ్యారని అందరూ భావిస్తున్న వేళ జమ్మల మడుగు ప్రజలు గత ఎన్నికలలో షాకిచ్చిన సంగతి తెలిసిందే.

దిక్కులేకుండా…..

అయితే ఇప్పుడు జమ్మల మడుగు టీడీపీకి దిక్కు లేకుండా పోయింది. జమ్మలమడుగుల వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత ఇలాకా కావడంతో తొలి నుంచి జగన్ తన వ్యూహాన్ని అమలుపరుస్తూ వస్తున్నారు. డాక్టర్ సుధీర్ రెడ్డిని బరిలోకి దించి ఎన్నికలకు మూడేళ్ల ముందునుంచే గెలుపు కోసం శ్రమించారు. జగన్ ప్లాన్ సక్సెస్ అయింది. అయితే తాజాగా ఇప్పుడు పరిస్థితులను చూస్తుంటే జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీ నిలదొక్కుకోవడమే కష్టంగా మారిందంటున్నారు.

బీజేపీలోకి ఆది…..

మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. అతి త్వరలోనే ఆయన బీజేపీలో చేరే అవకాశాలుండటంతో ఆది వర్గం కూడా అయోమయంలో పడింది. బీజేపీ నియోజకవర్గంలో బలంగా లేకపోయినా ఆదినారాయణరెడ్డి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఆదినారాయణరెడ్డి సోదరుడు ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు.

వైసీపీ వైపు చూస్తున్న…..

ఇక మరోనేత రామసుబ్బారెడ్డి సయితం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన ఓటమి బాధను నేటికి జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ సమావేశాలకు కూడా ఆయన హాజరు కావడం లేదు. రామసుబ్బారెడ్డి ఇటీవల అమెరికాలో పర్యటించిన జగన్ వద్దకు రాయబారం పంపారన్న వార్తలు వస్తున్నాయి. నంద్యాలకు చెందిన తన బంధువు, వైసీపీ నేతతో తాను వైసీపీలోకి రావాలనుకుంటున్నానని రామసుబ్బారెడ్డి సంకేతాలు పంపారట. అయితే దీనిపై జగన్ ఇప్పటి వరకూ స్పందించకపోయినప్పటికీ, రామసుబ్బారెడ్డి మాత్రం టీడీపీ లో ఉండేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. మొత్తం మీద ఎన్నికలకు ముందు జమ్మల మడుగులో బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఫలితాల తర్వాత కనుమరుగై పోయే పరిస్థితి ఏర్పడింది.

Tags:    

Similar News