Tdp : గెలిచి ఇరవై ఏళ్లయినా అదే ప్రయోగమా? దిక్కులేకనేనా?

ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచి ఇరవై ఏళ్లు కావస్తుంది. అయినా ఇప్పటికీ అక్కడ టీడీపీ బలోపేతం కావడం లేదు. అక్కడ వైఎస్ కుటుంబం ప్రభావం ఎక్కువగా [more]

Update: 2021-10-26 08:00 GMT

ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచి ఇరవై ఏళ్లు కావస్తుంది. అయినా ఇప్పటికీ అక్కడ టీడీపీ బలోపేతం కావడం లేదు. అక్కడ వైఎస్ కుటుంబం ప్రభావం ఎక్కువగా ఉండటంతో తెలుగుదేశం పార్టీకి కాలు మోపడానికి కూడా వీలు లేదు. అనేక ప్రయోగాలు చేసినా ఫలితం లేదు. 2024 ఎన్నికలకు చంద్రబాబు ఇక్కడ విధిలేని పరిస్థితుల్లో మరో కొత్త ప్రయోగానికి సిద్ధపడినా ఈసారి కూడా గెలుపు అంత సులువు కాదన్నది వాస్తవం. అదే జమ్మలమడుగు నియోజకవర్గం.

దశాబ్దాలుగా…..

జమ్మలమడుగు నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి పొన్నపురెడ్డి, దేవగుడి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. రెండు కుటుంబాలు వేర్వేరు పార్టీల్లో ఉండి బరిలోకి దిగుతున్నాయి. పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి వర్గం సుదీర్ఘకాలంగా టీడీపీలోనే కొనసాగింది. అయితే తెలుగుదేశం పార్టీకి జమ్మలమడుగులో చివరి గెలుపు 1999లోనే. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో పొన్నపురెడ్డి కుటుంబం వరసగా ఇక్కడ టీడీపీ నుంచి విజయం సాధించింది. 1983లోనూ పొన్నపురెడ్డి శివారెడ్డి జమ్మలమడుగు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అంటే ఐదు సార్లు వరసగా విజయం సాధించిన ఈ కుటుంబానికి 1999 నుంచి గెలుపు అనేది లేదు.

కుటుంబంలో రాజకీయంగా….

గత ఎన్నికల్లోనూ పొన్నపురెడ్డి, దేవగుడి కుటుంబాలు ఏకమైనా తొలిసారి ఆ రెండు కుటుంబాలను కాదని సుధీర్ రెడ్డి వైసీపీ నుంచి విజయం సాధించారు. 2004 నుంచి 2019 వరకూ ఇక్కడ కాంగ్రెస్, వైసీపీలే జెండాను ఎగురవేస్తూ వస్తున్నాయి. ఇప్పుడు పొన్నపురెడ్డి కుటుంబం వైసీపీలో చేరింది. దేవగుడి కుటుంబంలో రాజకీయంగా చీలికలు వచ్చాయి. మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరారు. ఆయన సోదరుడు మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి టీడీపీలో చేరిపోయారు.

ఆయనే అభ్యర్థి….

వచ్చే ఎన్నికల్లో నారాయణరెడ్డి కుమారుడు భూపేశ్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దింపుతుంది. ఆదినారాయణరెడ్డి బీజేపీలోనే ఉండి పోటీ చేస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. అదే జరిగితే వైసీపీ గెలుపు మరింత సునాయాసమవుతుంది. రాజకీయంగా దేవగుడి వర్గంలో విభేదాలు రావడంతో ఇక్కడ చంద్రబాబు చేస్తున్న మరో ప్రయోగం కూడా విఫలమవుతుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News