ఇక్కడ పార్టీని పూర్తిగా పడుకోబెట్టేశారుగా?

రాజ‌ధాని జిల్లా గుంటూరులో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఫుల్ స్వింగ్‌లో ఉండేది. టీడీపీ సీనియ‌ర్లు ఎక్కడిక‌క్కడ హ‌డావిడి చేసేవారు. జిల్లా పార్టీ ఆఫీస్ ఎప్పుడూ పార్టీ [more]

Update: 2021-02-13 12:30 GMT

రాజ‌ధాని జిల్లా గుంటూరులో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ఫుల్ స్వింగ్‌లో ఉండేది. టీడీపీ సీనియ‌ర్లు ఎక్కడిక‌క్కడ హ‌డావిడి చేసేవారు. జిల్లా పార్టీ ఆఫీస్ ఎప్పుడూ పార్టీ నేత‌లు, ఎమ్మెల్యేల‌తో క‌ళ‌క‌ళ‌లాడుతూ ఉండేది. అలాంటి పార్టీ ఆఫీస్ ఇప్పుడు వెల‌వెల‌బోతోంది. పార్టీ ప్రతిప‌క్షంలోకి వ‌చ్చి ఇర‌వై నెల‌లు అవుతోంది. ప్రతిప‌క్షంలో ఉండ‌డం ఎలా ? ఉన్నా ఓ వైపు స్థానిక సంస్థల ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు ఏపీలో మిగిలిన చోట్ల వైసీపీ జోరు ఉన్నా రాజ‌ధాని జిల్లాలు అయిన గుంటూరు, కృష్ణాల‌పైనే అంద‌రికి ఆస‌క్తి ఉంది. గుంటూరు జిల్లాలో వైసీపీపై టీడీపీ ఖ‌చ్చితంగా పై చేయి సాధిస్తుంద‌నే చాలా మంది అంచ‌నా వేస్తున్నారు. ఇన్ని అంచ‌నాలు ఉన్నా.. పార్టీకి మంచి ఛాన్స్ ఉన్నా కూడా పార్టీ నేత‌లు మాత్రం దానిని యూజ్ చేసుకోలేక‌పోతున్నారు. అసలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంజాయ్ చేసిన నేత‌లు ఇప్పుడు జిల్లా పార్టీ ఆఫీస్‌కే రాని స్థితిలో ఉన్నారంటే వీరికి ప్రస్తుత ప‌రిస్థితుల్లో రాజ‌కీయం చేయ‌డం ఆస‌క్తిగా లేద‌నే అర్థమ‌వుతోంది.

నాడు అధికారంలో ఉండగా…

ఇక టీడీపీ అధికారంలో ఉండ‌గా.. నాడు ఎమ్మెల్యేగాను, ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జివి. ఆంజ‌నేయులు ప్రెస్‌మీట్లతో నాడు ప్రతిప‌క్షంలో ఉన్న జిల్లా వైసీపీ నేత‌ల‌కు కంటిమీద కునుకు లేకుండా చేసేవారు. ఎప్పటిక‌ప్పుడు మీడియాలో హైలెట్ అయ్యేవారు. అయితే ఇప్పుడు ఆయ‌న‌కు గుంటూరుతో లింకులు తెగిపోయాయి. ఆయ‌న న‌రసారావుపేట పార్లమెంట‌రీ జిల్లా అధ్యక్షుడిగా ఉండ‌డంతో గ‌తంలో ఉన్నంత స్పీడ్‌గా లేరు. వినుకొండ‌లో బ్రహ్మానాయుడును టార్గెట్ చేసేందుకే ప‌రిమిత‌మ‌వుతున్నారు.

యరపతినేని సయితం….

ఇక య‌ర‌ప‌తినేని అధికారంలో ఉంటే మినిస్టర్ కాక‌పోయినా మినిస్టర్ రేంజ్ హంగామా ఉండేది. మొన్న జ‌డ్పీ, మండ‌ల ఎన్నిక‌ల్లో పూర్తిగా చేతులు ఎత్తేసిన ఆయ‌న ఇప్పుడు పంచాయ‌తీ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రావ‌డంతో మాత్రం పిడుగురాళ్లలో మకాం వేసి ప‌ట్టు కోసం పాకులాడుతున్నారు. ఆయ‌న టార్గెట్ ఇప్పుడు గుర‌జాల‌.. మ‌హా అయితే ప‌క్కనే ఉన్న మాచ‌ర్ల మీద మాత్రమే ఉంది. గ‌త ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ప్రత్తిపాటి పుల్లారావు నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలేసి హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. తాజా షాక్ ఏంటంటే చిల‌క‌లూరిపేట జ‌డ్పీటీసీ టీడీపీ అభ్యర్థి వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. పార్టీ స్ట్రాంగ్ అయ్యింద‌నిపిస్తే మ‌నం యాక్టివ్ అవుదాం అన్న ధోర‌ణిలో ఆయ‌న ఉన్నారు.

క్యాడర్ లోనే విముఖత…

స‌త్తెన‌ప‌ల్లిలో పార్టీకి కెప్టెన్ లేక కేడ‌ర్ డీలా ప‌డింది. మాజీ ఎంపీ రాయ‌పాటి ఫ్యామిలీ వ‌రుస కేసుల‌తో రాజ‌కీయాల‌కు దూరంగా ఉంది. కోడెల వార‌సుడు తిరుగుతున్నా ఆయ‌న‌పై టీడీపీ కేడ‌ర్‌లో న‌మ్మకం లేదు. ఆయ‌న జిల్లాలో మిగిలిన నాయ‌కుల‌ను వ‌దిలేసి అక్కడ‌క్క‌డే తిరుగుతున్న ప‌రిస్థితి. పొన్నూరులో రెండున్నర ద‌శాబ్దాల న‌రేంద్ర రాజ‌కీయం ఉందా ? అన్న సందేహాలు ఉన్నాయి. ఆయ‌న మ‌రీ భ‌య‌స్తుడిగా మారి అధికార పార్టీకి స‌రెండ‌ర్ అయ్యాడంటున్నారు.

ఉన్నంతలో వీరు మాత్రమే….

ఉన్నంత‌లో పాత నేత‌ల్లో మాజీ మంత్రులు ఆల‌పాటి రాజా, న‌క్కా ఆనంద్ బాబు మాత్రమే గ‌ట్టి వాయిస్ వినిపిస్తున్నారు. ఇక కొత్త నేత‌ల్లో న‌ర‌సారావుపేట ఇన్‌చార్జ్ చ‌ద‌ల‌వాడ అర‌వింద‌బాబు, బాప‌ట్ల ఇన్‌చార్జ్ వేగేశ‌న న‌రేంద్ర వ‌ర్మ ఇద్దరు రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేస్తున్నారు. ప్రత్తిపాడులో అవుట్ డేటెడ్ అయిన మాజీ మంత్రి మాకినేని ర‌త్తయ్య మాట ఎవ్వరూ వినే ప‌రిస్థితి లేదు. మాచ‌ర్లలో చ‌ల‌మారెడ్డిది అదే ప‌రిస్థితి. తాడికొండ‌లో ఇప్పుడున్న ప‌రిస్థితిలో టీడీపీ అన్ని సీట్లు స్వీప్ చేయాలి. కానీ గుంటూరు పర్ల‌మెంట‌రీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రవ‌ణ్ కుమార్ వ‌స్తే అవే వ‌స్తాయిలే అని వెయిట్ చేయ‌డం మిన‌హా ఇక్కడ పార్టీకి ఊపు తేవ‌డం లేదు. రేప‌ల్లెలో అన‌గాని పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే కావ‌డంతో ప‌ర్వాలేదు. ఇక న‌గ‌రంలో తూర్పు, ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి ఉన్న ఇద్ద‌రు ఇన్‌చార్జ్‌ల‌తో ఒరిగింది ఏమీ లేదు. ఈ నేప‌థ్యంలో ఇక్కడ టీడీపీ నేత‌లు ఎప్పుడు ట్రాక్ లోకి వ‌చ్చి పార్టీని ప‌టిష్టం చేస్తారో ? ఇంత బెట‌ర్ ఛాన్స్ కూడా వీరు ఎందుకు కాల‌ద‌న్నుకుంటున్నారో ? తెలియ‌డం లేదు.

Tags:    

Similar News