గుంటూరు పొలిటిక‌ల్ గేమ్ ఛేంజ్ అవుతోందా..?

రాజ‌ధాని జిల్లా గుంటూరులో టీడీపీ పొలిటిక‌ల్ గేమ్ ఛేంజ్ అవుతుందా? ఇక్కడ వ్యూహాత్మకంగా పావులు క‌ద‌పాల‌ని మాజీ సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు [more]

Update: 2021-01-10 08:00 GMT

రాజ‌ధాని జిల్లా గుంటూరులో టీడీపీ పొలిటిక‌ల్ గేమ్ ఛేంజ్ అవుతుందా? ఇక్కడ వ్యూహాత్మకంగా పావులు క‌ద‌పాల‌ని మాజీ సీఎం చంద్రబాబు నిర్ణయించుకున్నారా ? అంటే.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఇక్కడ కీల‌క‌మైన నాయ‌కుల‌కు అవ‌కాశం ఇచ్చారు. వారంతా.. ఓడిపోయారు. ఒక‌వైపు రాజ‌ధాని నిర్మాణం చేప‌ట్టిన‌ప్పటికీ పెద్ద పెద్ద క‌ట్టడాలు తీసుకువ‌చ్చిన‌ప్పటికీ.. టీడీపీ నేత‌లు నేల క‌రుచుకున్నారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ప‌రిస్థితిని మెరుగు ప‌ర‌చాల‌ని చంద్రబాబు నిర్ణయించు కున్నట్టు తెలుస్తోంది.

సెంటిమెంట్ బాగా….

ప్రస్తుతం రాజ‌ధాని ఉద్యమం నేప‌థ్యంలో ఆ ఉద్యమాన్ని అన్ని విధాలా న‌డిపిస్తున్నది టీడీపీనే అనే ప్రచారం ఉంది. ఉద్యమానికి ఊపిరులూదేందుకు.. చంద్రబాబు స‌తీమ‌ణి.. భువ‌నేశ్వరి.. స్వయంగా గాజులు ఇచ్చేయ‌డం.. చంద్రబాబు జోలెప‌ట్టడం వంటివి ఇక్కడి ప్రజ‌ల గుండెల్లో ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా.. టీడీపీకి సానుకూల ఫ‌లితాలు వ‌స్తాయ‌న్న ప్రచారం జ‌రుగుతోంది. దీనిని టీడీపీ బాగా క్యాష్ చేసుకుంటోంది. టీడీపీ త‌ర‌ఫున ఎవరిని నిల‌బెట్టినా.. ఏక‌ప‌క్షంగా గెలిచి తీరుతార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. దీంతో ఈ ద‌ఫా ఆచి తూచి అడుగులు వేయాల‌ని చంద్రబాబు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

డమ్మీలందరినీ…..

ఎవ‌రెవ‌రు డ‌మ్మీలుగా ఉన్నారో.. తెలుసుకుని.. వారిని ప‌క్కన పెట్టేయ‌డంతోపాటు త‌న మాట విన‌ని వారిని కూడా ఏరేయాల‌ని నిర్ణయించుకున్నారు. అదేస‌మ‌యంలో ప్రత్తిపాడు, మాచ‌ర్ల, గుంటూరు తూర్పు, స‌త్తెన‌ప‌ల్లి, న‌ర‌సా‌రావుపేట ‌(అసెంబ్లీ), వంటి ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ వీక్‌గా ఉండ‌డంతో అక్కడ కూడా పుంజుకునేలా చేయ‌డంతోపాటు.. బ‌ల‌మైన నేత‌ల‌ను కాకుండా.. ఇప్పుడు ప్రజ‌ల్లో ఉన్న సెంటిమెంటును ఆధారంగా చేసుకుని రంగంలోకి దిగాల‌ని చంద్రబాబు నిర్ణ‌యించుకున్నట్టు ప్రచారం జ‌రుగుతోంది.

గెలుపు గుర్రాలకే…..

అంటే.. ఇప్పటికే ఉన్న గెలుపు గుర్రాల‌కు తోడు.. కొన్నేళ్లుగా పుంజుకోని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ ప‌రుగులు పెట్టేలా.. పొలిటిక‌ల్ గేమ్ చేంజ‌ర్‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని చంద్రబాబు భావిస్తున్నారు. పైగా.. నిద్రాణ వ్యవ‌స్థలో ఉన్న నేత‌ల‌కు చురుకు పుట్టించేలా ఈ నిర్ణయం ఉంటుంద‌ని పార్టీ సీనియ‌ర్లు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి బాబు వ్యూహం ఏమేర‌కు అమ‌ల‌వుతుందో.. చూడాలి. అయితే.. రాజ‌ధాని గ్రామాల ఓట్లు మాత్రమే కాకుండా జిల్లా మొత్తంగా కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

Tags:    

Similar News