టైం బ్యాడ్ అట…అందుకే రావడం లేదట

ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఖ‌చ్చితంగా ఏడాదిన్నర కింద‌టి వ‌ర‌కు గుంటూరు టీడీపీ కార్యాల‌యం.. ఇస‌కేస్తే.. రాలేది కాదు. అంత‌గా నాయ‌కులు తండోప‌తండాలుగా కార్యాల‌యానికి వ‌చ్చేవారు. పార్టీ అధినేత చంద్రబాబును [more]

Update: 2020-06-29 03:30 GMT

ఏమాటకామాటే చెప్పుకోవాలి. ఖ‌చ్చితంగా ఏడాదిన్నర కింద‌టి వ‌ర‌కు గుంటూరు టీడీపీ కార్యాల‌యం.. ఇస‌కేస్తే.. రాలేది కాదు. అంత‌గా నాయ‌కులు తండోప‌తండాలుగా కార్యాల‌యానికి వ‌చ్చేవారు. పార్టీ అధినేత చంద్రబాబును వేనోళ్ల కొనియాడేవారు. అంతేకాదు, దాదాపు అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీ కార్యాల‌యాలు సంద‌డి సంద‌డిగా ఉండేవి. నాయ‌కులు కూడా నిత్యం మీడియాకు బైట్లు ఇచ్చేవారు. మీడియా వాళ్లకైతే.. మ‌రింత పండ‌గ‌. అక్కడే భోజ‌నాలు, కాఫీలు, టిఫెన్లు! అబ్బో.. ఇలా ఉండేది.. టీడీపీ ప‌రిస్థితి! ఇప్పుడు అధికారం పోయింది. ఏడాది గ‌డిచింది. ఆ నాడున్న నాయ‌కులు ఇప్పుడూ ఉన్నారు. ఆ నాడున్న కార్యాల‌యాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. అప్పట్లో ఉన్న మీడియానే ఇప్పుడు కూడా ఉంది. కానీ, లేనిదల్లా ఒక్క జోషే!!

మొక్కుబడి కార్యక్రమాలు……

అవును! గుంటూరులో టీడీపీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారింది. అప్పట్లో రాజ‌ధాని ఏర్పాటు కార‌ణంగా.. జిల్లా వ్యాప్తంగా టీడీపీలో సంద‌డి ఉండేది. నాయ‌కుల ప‌ర్యట‌న‌లు ప్రెస్ మీట్‌ల‌తో జోరెత్తేది. రాజ‌ధాని గ్రామాల్లోనూ నిత్యం నాయ‌కులు ప‌ర్యటిం చేవారు. నాడు జిల్లా నుంచి మ‌హామ‌హులు అయిన నాయ‌కులు అంద‌రూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉండ‌డంతో జిల్లా అంత‌టా టీడీపీ హంగామానే క‌నిపించేది. కానీ, ఇప్పుడు మెజారిటీ నాయ‌కులు ఓడిపోయారు. ఫ‌లితంగా ఎక్కడిక‌క్కడ నాయ‌కులు సైలెంట్ అయిపోయారు. పోనీ, వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల్లో అయినా కార్యక్రమాలు నిర్వ‌హిస్తున్నారా ? అంటే అది కూడా లేదు. ఏదో మొక్కుబ‌డిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కీలకమైన నియోజకవర్గాల్లో…..

కీల‌క‌మైన చిల‌క‌లూరిపేట‌, తాడికొండ‌, తెనాలి, పొన్నూరు, గుర‌జాల‌, వినుకొండ‌, రేప‌ల్లె (ఇక్క‌డ టీడీపీనే గెలిచింది) వంటి చోట్ల కూడా నాయ‌కులు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. మీడియా ముందుకు వ‌చ్చి ఏం మాట్లాడ‌ల‌న్నా కూడా నాయ‌కులు భ‌య‌ప‌డుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంద‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో గ‌తంలో మీడియాతో మాట్లాడ‌కుండా ఉండ‌ని నాయ‌కులు కూడా ఇప్పుడు మౌనం పాటిస్తున్నారు. పోనీ.. స్థానికంగా కూడా చంద్రబాబు ఇస్తున్న పిలుపును పెద్దగా లెక్క‌చేయ‌డం లేద‌ని అంటున్నారు. జిల్లాలో టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి టీడీపీకి బై చెప్పేశారు. ఇక రేప‌ల్లె ఎమ్మెల్యే అన‌గాని స‌త్యప్రసాద్ పార్టీ మార‌తార‌న్న వార్తలు వ‌స్తున్నాయి. ప్రస్తుతానికి ఆయ‌న సైలెంట్‌గా ఉన్నా పార్టీలో యాక్టివ్‌గా అయితే లేరు.

రాజధాని భూముల వ్యవహారం……

ప్రస్తుతం గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఇటీవ‌ల మీడియా ముందుకు వ‌స్తార‌ని ప్రచారం జ‌రిగినా.. ఆయ‌న త‌ప్పించుకున్నారు. రాజ‌ధాని భూముల విష‌యంలో ఆరోప‌ణ‌లు వెల్లువెత్తడం, జ‌గ‌న్ ప్రభుత్వం పేర్లతో స‌హా బ‌య‌ట‌కు తీయ‌డం వంటి కార‌ణాలు.. ఇప్పుడు వీరిని వేధిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అయినంత మాత్రాన‌.. పార్టీకి దూరంగా ఉండ‌డం అనేది మాత్రం సందేహంగానే ఉంది. ఇదిలావుంటే. ఒక్కోనేత‌పై ఒక్కో విధంగా ఆరోప‌ణ‌లు ఉన్నాయ‌ని కూడా అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్‌లో చ‌క్రం తిప్పిన య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు ప్రెస్‌మీట్లు పెడుతున్నా ఆయ‌న‌పై అనేక కేసులు ఉండ‌డంతో గుర‌జాల దాటి ముందుకు రాని ప‌రిస్థితి.

కీలకమైన నేతలు కూడా…..

పొన్నూరులో ఐదుసార్లు గెలిచిన న‌రేంద్ర నియోజ‌క‌వ‌ర్గం దాటి రావ‌డం లేదు. ప్రత్తిపాటి పుల్లరావు చిల‌క‌లూరిపేట‌లోనే కొట్టుమిట్టాడుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు లేని ప్రత్తిపాడు, స‌త్తెన‌ప‌ల్లిలో పార్టీ ప‌రిస్థితి ఘోరం. బాప‌ట్లలో మాత్రమే న‌రేంద్రవ‌ర్మ చాలా యాక్టివ్‌గా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏదేమైనా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయిలో చ‌క్రం తిప్పిన ఈ జిల్లా కీల‌క నేత‌లు ఎప్పటికి బ‌య‌ట‌కు వ‌స్తారో.. ఎప్పుడు పార్టీ నిల‌దొక్కుకుంటుందో చూడాలి. ఏదేమైనా ఒక వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు ఇక్కడే ఇబ్బందులు ప‌డుతుండ‌డం పార్టీ సానుభూతిప‌రుల‌ను తీవ్రంగా వేధిస్తోంది.

Tags:    

Similar News