టీడీపీలోనూ పోటీ ఎక్కువయిందే?

తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నప్పటికీ గుంటూరు జిల్లాలో మాత్రం ఫుల్లు యాక్టివ్ గా ఉంది. అమరావతి రాజధాని అంశం తనకు ప్లస్ గా మారుతుందని [more]

Update: 2020-09-20 13:30 GMT

తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నప్పటికీ గుంటూరు జిల్లాలో మాత్రం ఫుల్లు యాక్టివ్ గా ఉంది. అమరావతి రాజధాని అంశం తనకు ప్లస్ గా మారుతుందని భావించి టీడీపీ నేతలు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారు. రాజధాని పై జగన్ తీసుకున్న నిర్ణయం భవిష్యత్ ఎన్నికల్లో తమకు అనుకూలంగా మారుతుందని టీడీపీ నేతలు అంచనాలో ఉన్నారు. అందుకే పదవుల కోసం టీడీపీలో గుంటూరు జిల్లా నేతలు పోటీ పడుతున్నారు.

తమకే ఇవ్వాలంటూ పోటీ…..

టీడీపీ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ ఛార్జులను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దీనిపై చంద్రబాబు కసరత్తులు చేస్తున్నారు. నేతల అభిప్రాయాలను కూడా తెలుసుకుంటున్నారు. సీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేతలు పదవి తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి కనపర్చకపోయినా ముఖ్యంగా గుంటూరు జిల్లా నేతలు మాత్రం తమకే పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారు. గుంటూరు జిల్లాలో గుంటూరు, బాపట్ల, నరసరావుపేట మూడు పార్లమెంటు నియజకవర్గాలున్నాయి. ఈ మూడింటికి ఇన్ ఛార్జులను నియమించాల్సి ఉంది.

పరిశీలనలో ముగ్గురు పేర్లు…..

గుంటూరు నియోజకవర్గ కన్వీనర్ పదవి కోసం ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్ర గట్టిగా పోటీ పడుతున్నారు. ఆలపాటి రాజా ఎన్నికల ఫలితాల నుంచే యాక్టివ్ గా ఉన్నారు. నరేంద్ర గతంలో జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉండటంతో తనకే కావాలంటున్నారు. నరేంద్రకు పదవి ఇవ్వాలని ఎంపీ గల్లా జయదేవ్ కూడా సిఫార్సు చేశారని తెలుస్తోంది. అయితే చంద్రబాబు నేతలను సమన్వయం చేసుకుని వెళ్లే మాకినేని పెదరత్తయ్య వైపు చూస్తున్నారు. దీనిపై చంద్రబాబు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఆలపాటి రాజా వైపు ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది.

పేర్లు ఖరారయినా…..

ఇక నరసరావుపేట నియోజకవర్గంలో కన్వీనర్ నియామకానికి రాయపాటి సాంబశివరావు సూచనలు తీసుకోవాల్సి ఉంది. రాయపాటి రంగారావును నియమించాలనుకున్నా ఆయన సత్తెనపల్లి కోరుతున్నారు. దీంతో జీవీ ఆంజనేయులు పేరును చంద్రబాబు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఆర్థికంగా జీవీ బలంగా ఉండటంతో పాటు జీవీ నియోజకవర్గం కూడా నరసరావుపేట పరిధిలో ఉండటంతో ఆయనను నియమించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. బాపట్ల నియోజకవర్గానికి మాజీ ఎంపీ మాల్యాద్రి పేరు పరిగణనలోకి తీసుకున్నా ఆయన యాక్టివ్ గా లేకపోవడం, సుజనా వర్గంగా ముద్రపడటంతో ఆయన పేరును పక్కనపెట్టారు. ఇక్కడ నక్కా ఆనందబాబు పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద టీడీపీ పదవుల కోసం గుంటూరు జిల్లాలో పోటీ ఎక్కువగానే ఉందని చెప్పాలి.

Tags:    

Similar News