అమ‌రావ‌తి ఏరియాలోనే టీడీపీకి సీన్ లేదా?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నిక‌ల స‌మ‌రం ప్రారంభ‌మైన‌ప్పటి నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన జిల్లా గుంటూరు. రాజ‌ధాని ఉద్యమం ఇక్కడ కొద్ది రోజులుగా కొన‌సాగుతోంది. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ‌తో [more]

Update: 2021-02-21 06:30 GMT

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నిక‌ల స‌మ‌రం ప్రారంభ‌మైన‌ప్పటి నుంచి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన జిల్లా గుంటూరు. రాజ‌ధాని ఉద్యమం ఇక్కడ కొద్ది రోజులుగా కొన‌సాగుతోంది. రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ‌తో ఈ జిల్లాలో అధికార వైఎస్సార్‌సీపీకి ఖ‌చ్చితంగా ఎదురు దెబ్బ త‌గులుతుంద‌ని.. టీడీపీ స్వీప్ చేస్తుంద‌ని చాలా మంది భావించారు. విప‌క్ష టీడీపీ నేత‌లు కూడా ఈ జిల్లాలోనే తాము అద్భుత‌మైన ఫ‌లితాలు సాధిస్తామ‌ని క‌ల‌లు క‌న్నారు. పైగా ఈ జిల్లాలో టీడీపీ నుంచి ఉద్దండులు అయిన మాజీ ఎమ్మెల్యేలు, ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత‌లు ఉన్నారు. క‌ట్ చేస్తే వీరిలో చాలా మంది ఎన్నిక‌ల నామినేష‌న్ల సమయంలోనే చేతులు ఎత్తేశారు. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీ ఎత్తున అధికార వైసీపీకి అనుకూలంగా ఏక‌గ్రీవాలు న‌మోదు అవుతున్నా క‌నీసం త‌మ రాజ‌కీయ అనుభ‌వాన్ని ఉప‌యోగించి.. త‌మ పార్టీ నేత‌ల‌ను ఒప్పించి నామినేష‌న్లు వేయించ‌డంలోనే విఫ‌ల‌మ‌య్యారు. ఇక తొలి విడ‌త ఎన్నిక‌లు జ‌రిగిన తెనాలి డివిజ‌న్లలో పార్టీలో జూనియ‌ర్ నేత‌లే త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌త్తా చాటారు.

నామినేషన్ల సమయంలోనే…..?

వినుకొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఉమ్మడి జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ప‌నిచేసిన జీవీ ఆంజ‌నేయులు ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అధికార పార్టీకి అనుకూలంగా ఏకంగా 26 పంచాయ‌తీలు ఏక‌గ్రీవం అయ్యాయి. ఎమ్మెల్యే బొల్లా అనుభ‌వం జీవీకి ఎంత మాత్రం స‌రిపోదు.. అయినా జీవీ చేతులు ఎత్తేశారు. ఇక చిల‌క‌లూరిపేట‌లో పుల్లారావు పాత శిష్యురాలు విడ‌ద‌ల ర‌జ‌నీ టీడీపీ కంచుకోట‌ల్లో ఏక‌గ్రీవాలు చేయిస్తున్నా ఆయ‌న క‌నీసం టీడీపీ వాళ్లతో నామినేష‌న్లు కూడా వేయించ‌లేక‌పోయారు. మ‌రో దిమ్మతిరిగే ట్విస్ట్ ఏంటంటే చిల‌క‌లూరిపేట మండ‌ల టీడీపీ జ‌డ్పీటీసీ అభ్యర్థికే ఆమె వైసీపీ కండువా క‌ప్పేశారు.

అన్నింటా ఏకగ్రీవమే…..

పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గ కేంద్రమైన న‌ర‌సారావుపేట‌లో అయితే 45 పంచాయ‌తీల‌కు 30 వైసీపీకి ఏక‌గ్రీవం అయ్యాయి. నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ ఇన్‌చార్జ్ చ‌ద‌ల‌వాడ అర‌వింద‌బాబు కుడిభుజం వాళ్లే వైసీపీతో కుమ్మక్కయ్యి త‌మ గ్రామాల్లో అధికార పార్టీకి స‌హ‌క‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అర‌వింద‌బాబు క‌ష్టప‌డుతున్నా ఆయ‌న‌కు సొంత పార్టీలోనే శ‌త్రువులు దెబ్బేసిన‌ట్టే తెలుస్తోంది. ఇక మాచ‌ర్లలో ఎన్నిక‌ల‌కు ముందే 50 శాతం పంచాయ‌తీలే కాకుండా.. ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌లు వైసీపీకి ఏక‌గ్రీవం అయిపోయాయి. గుర‌జాల‌లో య‌ర‌ప‌తినేని ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో పూర్తిగా చేతులు ఎత్తేయ‌గా ( నాలుగు మండ‌లాల్లో ఒక్క నామినేష‌న్ కూడా లేదు ) .. పార్టీ సీనియ‌ర్ నేత పురంశెట్టి అంకులు హ‌త్య త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గంలో రోడ్డెక్కారు. స్థానిక ఎన్నిక‌ల‌ను ఆయ‌న ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా వైసీపీకి ఏక‌గ్రీవాల‌య్యాయి.

వీరు మాత్రం కొంత…..

విచిత్రం ఏంటంటే ఈ ఉద్దండులు అయిన నేత‌ల క‌న్నా జూనియ‌ర్ అయిన బాప‌ట్ల ఇన్‌చార్జ్ న‌రేంద్రవ‌ర్మ వైసీపీతో పోటాపోటీగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో 15 పంచాయ‌తీలు గెలిపించుకున్నారు. పొన్నూరులోనూ టీడీపీ, వైసీపీ పోటాపోటీగా స‌ర్పంచ్ ప‌ద‌వులు గెలుచుకున్నాయి. తెనాలిలో ఆల‌పాటి రాజా కూడా వైసీపీతో పోలిస్తే స‌గం పంచాయ‌తీల‌నే గెలిపించుకున్నారు. మాజీ మంత్రి న‌క్కా ఆనంద్‌బాబు ఇన్‌చార్జ్‌గా ఉన్న వేమూరులో వైసీపీకి 45 పంచాయ‌తీలు వ‌స్తే… టీడీపీ 15 పంచాయ‌తీల‌తో స‌రిపెట్టుకుంది. ఏదేమైనా గుంటూరు జిల్లాలో ఇంత మంచి ఛాన్స్ ఉండి.. రాజ‌ధాని ఉద్యమం జ‌రుగుతున్నా కూడా పార్టీ సీనియ‌ర్లు వాటిని ఫ‌లితాల రూపంలో చూపించ‌లేక‌పోయారు.

Tags:    

Similar News