వంశీని అలా వదిలిపెట్టారెందుకో?

తెలుగుదేశం పార్టీకి వచ్చిన అవకాశాన్ని కూడా చేజార్చుకుంటుంది. నిజానికి తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ గెలవడం కష్టమే. అయితే అదే సమయంలో ఆ పార్టీ డిమాండ్ [more]

Update: 2021-01-25 00:30 GMT

తెలుగుదేశం పార్టీకి వచ్చిన అవకాశాన్ని కూడా చేజార్చుకుంటుంది. నిజానికి తిరుపతి ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ గెలవడం కష్టమే. అయితే అదే సమయంలో ఆ పార్టీ డిమాండ్ చేయాల్సిన గన్నవరం నియోజకవర్గాన్ని మాత్రం వదిలేసింది. గన్నవరం నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున విజయం సాధించిన వల్లభనేని వంశీ వైసీపీికి మద్దతుదారుగా మారిపోయారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని తొలినాళ్లలో డిమాండ్ చేసిన తెలుగుదేశం ఆ తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు.

టీడీపీకి కంచుకోట….

గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ టీడీపీ జెండాయే ఎగురుతోంది. అలాంటి పరిస్థితుల్లో వల్లభనేని వంశీమీద సవాల్ విసరాల్సిన తెలుగుదేశం పార్టీ నేతలు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తుంది. వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖ పంపారు. అప్పటి నుంచే పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లపై వల్లభనేని వంశీ తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు.

మూడు గ్రూపులయినా….

కానీ తెలుగుదేశం మాత్రం ఎటువంటి చర్యలకు దిగడం లేదు. అదే నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీలో మూడు గ్రూపులున్నాయి. ఉప ఎన్నిక జరిగితే అది టీడీపీకి అడ్వాంటేజీగా మారుతుంది. గన్నవరంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావులు గ్రూపులుగా విడిపోయి నిత్యం ఘర్షణలకు దిగుతున్నారు. వైసీీపీలోని వంశీ వైరి వర్గాలే ఉప ఎన్నికకు డిమాండ్చేస్తున్నాయి. వల్లభనేని వంశీని రాజీనామా చేయాలని కోరుతున్నాయి.

ఎందుకు మౌనం?

కానీ తెలుగుదేశం మాత్రం ఈ డిమాండ్ విన్పించడం లేదు. ఇక్కడ టీడీపీ ఉన్నట్టా? లేనట్లా? అన్నది కూడా అర్థం కాకుండా ఉంది. రాజధాని అమరావతికి సమీపంలో ఉండటంతో రాజధాని తరలింపు ఎఫెక్ట్ కూడా ఈ నియోజకవర్గంపై పడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉండటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. వైసీపీలోని వర్గాలే ఉప ఎన్నికకు డిమాండ్చేస్తున్నాయి. ఇప్పటికైనా తెలుగుదేశం గన్నవరంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆ పార్టీ అభిమానులు కోరుతున్నారు.

Tags:    

Similar News