ఎవరి పంతం వారిదే … తెలుగు తమ్ముళ్ల సిగపట్లు

తెలుగుదేశం పార్టీ రాజమండ్రి అర్బన్ వెర్సెస్ రూరల్ లో తమ్ముళ్ల యుద్ధం అంతర్గతంగా కాదు బాహాటంగానే నడుస్తుంది. ఈ వర్గాల నడుమ సఖ్యత కుదర్చడానికి అధిష్టానం చేసిన [more]

Update: 2020-10-21 00:30 GMT

తెలుగుదేశం పార్టీ రాజమండ్రి అర్బన్ వెర్సెస్ రూరల్ లో తమ్ముళ్ల యుద్ధం అంతర్గతంగా కాదు బాహాటంగానే నడుస్తుంది. ఈ వర్గాల నడుమ సఖ్యత కుదర్చడానికి అధిష్టానం చేసిన ప్రయత్నాలు ఎలాంటి ఫలితాలు ఇచ్చినట్లు కనిపించడం లేదు. పార్టీ కార్యక్రమాలను వర్గాలు పోటాపోటీగానే నడిపిస్తున్నాయి. ఒక వర్గానికి మాజీ మంత్రి సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నేతృత్వం వహిస్తున్నారు. మరో గ్రూప్ ఆదిరెడ్డి అప్పారావు కుటుంబం నడుపుతుంది. ఇంకో గ్రూప్ కి గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ నాయకత్వం వహిస్తున్నారు. ఈ మూడు గ్రూప్ లు చేసే కార్యక్రమాల నడుమ కార్యకర్తలు మాత్రం నలిగిపోతున్నారు.

అమరావతి ఉద్యమంలో మరోసారి …

టిడిపి అధిష్టానం ఇచ్చిన అమరావతి ఉద్యమ పరిరక్షణకు ఈ మూడు వర్గాలు ఎవరికి వారే కార్యక్రమాలు చేపట్టడం చర్చనీయం అయ్యింది. వీరి నడుమ అంతర్యుద్ధాన్ని నివారించేందుకు పార్టీ అధిష్టానం పలు పంచాయితీలు ఏర్పాటు చేసినా ఫలితం లేకుండా పోయింది. అంతా కలిసి కార్యక్రమాలు చేయాలని లేని పక్షంలో ఎవరి నియోజకవర్గ పరిధిలో వారు చేసుకోవాలన్నది అధిష్టానం ఫత్వా. అయితే సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి డామినేషన్ అర్బన్ క్యాడర్ పై ఆయనకున్న పట్టు తో ఆదిరెడ్డి వర్గం ఆగ్రహంగానే ఉంది. పరిస్థితి ఇలానే ఉంటే పార్టీ మారిపోతామన్న బెదిరింపులు కూడా ఆ వర్గం నుంచి వెళ్లడంతో ఇటీవల పార్లమెంటరీ స్థాయిలో వేసిన కమిటీల్లో ఆదిరెడ్డి గ్రూప్ కే అధిష్టానం టిక్ పెట్టినట్లు తెలుస్తుంది.

ఆదిరెడ్డికి మరో సమస్య …

ఒక్క గోరంట్ల నుంచే కాకుండా ఆదిరెడ్డి ఆధిపత్యానికి మరో సీనియర్ నేత గూడా చైర్మన్ గన్నికృష్ణ గండికొట్టేస్తున్నారు. ఆయన తన గ్రూప్ తో సొంత కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎమ్యెల్యే ఆదిరెడ్డి భవాని ఆమె భర్త శ్రీనివాస్ నిర్వహించే ప్రెస్ మీట్లకు సైతం గన్ని దూరంగానే ఉంటున్నారు. పార్టీ పట్ల నిబద్ధత ఉన్న కృష్ణ సొంతంగానే ముందుకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు తప్ప ఒకరికింద పనిచేయడానికి అంగీకరించరని ఆయన వర్గీయుల మాట. ఈ గ్రూప్ ల గోల భరించలేకే ఇటీవల మాజీ కార్పొరేటర్ ఒకరు బిజెపి తీర్ధం పుచ్చుకోవడం క్యాడర్ లో ఆందోళన కలిగిస్తుంది. టిడిపి కి ద్వితీయ శ్రేణి నాయకులే బలం. వారు దూరం అయితే పార్టీ బలహీనపడే ప్రమాదం ఉందని క్యాడర్ ఆవేదన. వాస్తవానికి టిడిపి కి రాజమండ్రి పెట్టని కోట గా ఉంది. ఈ కోటకు ఇప్పుడు బీటలు వారుతున్నాయని తక్షణం అధిష్టానం రిపేర్ చేసి గ్రూప్ లను ఏకం చేయకపోతే వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో ఫలితాలు రివర్స్ అవుతాయన్న ఆందోళన పసుపు దళం వ్యక్తం చేస్తుంది

Tags:    

Similar News