రెస్క్కూ ఆపరేషన్ చేయాల్సిందేనా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లాలోనే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పార్టీకి నాధుడంటూ లేకుండా పోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన [more]

Update: 2019-09-28 12:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తన సొంత జిల్లాలోనే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ పార్టీకి నాధుడంటూ లేకుండా పోయారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ చిత్తూరు జిల్లాలో ప్రతి చోటా నాయకుడు కాలరెగరేసుకుని తిరుగుతారు. పార్టీ జెండాకు తానే ఓనర్ నంటూ పోజులిస్తారు. ఇలాంటి టీడీపీ నేతలకు చిత్తూరు జిల్లాలో కొదవ లేదు. గతంలో గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఉండేవారు. ఆయన మరణించిన తర్వాత చిత్తూరు జిల్లాలో చంద్రబాబు తర్వాత చెప్పుకోదగ్గ నేత ఎవ్వరూ లేకపోవడం గమనార్హం.

ఒక్క నియోజకవర్గంలోనే….

చిత్తూరు జిల్లాలో గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. చంద్రబాబు పోటీ చేసిన కుప్పం నియోజకవర్గం మినహాయించి మిగిలిన అన్ని సీట్లు వైసీపీ ఎగరేసుకుపోయింది. చంద్రబాబు కు సయితం మెజారిటీ తగ్గడంతో పార్టీలో ఆందోళన కలిగిందనే చెప్పాలి. ఎన్నికలకు ముందు అనేకమంది నేతలు చిత్తూరు జిల్లాలను ఏలాలని తిరిగారు. గల్లా అరుణకుమారి, పులివర్తి నాని, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్ నాధ్ రెడ్డి, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఇలా పేరున్న నేతలు చిత్తూరులో వైసీపీని చిత్తు చిత్తుగా ఓడించాలనుకున్నారు. బాగానే ప్రచారంలో తిరిగినా ఫలితాల వరకూ వచ్చేసరికి పూర్తిగా తెలుగుదేశం పార్టీ డీలా పడిపోయింది.

ఎన్నికలకు ముందు హడావిడి చేసి….

ఇక ఎన్నికల అనంతరం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ పరిస్థితి కనాకష్టంగా మారింది. పార్టీ కార్యక్రమాలకు కూడా పెద్దగా నేతలు ఎవరూ హాజరుకావడం లేదు. మాజీ మంత్రి అమర్ నాథ్ రెడ్డి ఎన్నికలకు ముందు చూపిన ఉత్సాహం ఇప్పుడు లేదు. ఆయన అప్పుడప్పుడూ అమరావతి ఎక్కువగా బెంగళూరు, హైదరాబాద్ లోనే ఉంటున్నారు. గల్లా అరుణకుమారి గుంటూరు రాజకీయాలకు పరిమితమయ్యారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు. గత ఎన్నికలలో తనయుడిని పోటీకి దింపి బొజ్జల చేతులు కాల్చుకున్నారు.

అడ్రస్ కూడా లేరు….

ఇక టీడీపీలో చేరి నానా హడావిడి చేసిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి జాడే లేదు. పార్టీలో చేరగానే నామినేటెడ్ పోస్టుకూడా దక్కించుకున్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కి కూడా పార్టీని పట్టించుకోవడం లేదు. ఇక పులివర్తి నాని ఒక్కరే జెండాను పట్టుకునే నేతగా మిగిలారు. అన్ని జిల్లాలనూ పర్యటిస్తూ నియోజకవర్గాల సమీక్షలు చేస్తన్న చంద్రబాబు చిత్తూరు విషయంలో మాత్రం కొంత గందరగోళంలోనే ఉన్నట్లు కన్పిస్తుంది. సమీక్షలకు నేతలు హాజరవుతారా? లేదా? అన్న సందేహం కూడా చంద్రబాబుకు లేకపోలేదు. మొత్తం మీద చంద్రబాబు సొంత జిల్లాలోనే పార్టీకి దిక్కే లేకుండా పోయారు.

Tags:    

Similar News