Chandrababu : దగ్గరవుతున్నారు… దూరం తగ్గింది

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని ముందుకు నడిపించడంపై క్లారిటీతో ఉన్నారు. ఈ క్లారిటీని ప్రజలకు దశలవారీగా తెలిపే కార్యక్రమానికి ఆయన శ్రీకారం [more]

Update: 2021-10-04 03:30 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీని ముందుకు నడిపించడంపై క్లారిటీతో ఉన్నారు. ఈ క్లారిటీని ప్రజలకు దశలవారీగా తెలిపే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారనే చెప్పాలి. ఎందుకంటే బద్వేలు ఉప ఎన్నిక బరి నుంచి తప్పుకోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. అసలు బద్వేలు ఉప ఎన్నిక నోటిఫికేషన్ కు ముందే చంద్రబాబు అభ్యర్థిని ప్రకటించారు. అంటే ఆయన ఎన్నికకు నెలలు ముందే సిద్దమయ్యారు.

తప్పుకోవడం…..

బద్వేలు ఉప ఎన్నికల్లో గెలుస్తామని కాదు కాని పోటీ చేయడం తమ బాధ్యతగా చంద్రబాబు భావించారు. క్యాడర్ ను కాపాడుకోవడంతో పాటు ప్రభుత్వంపై అసంతృప్తి ఎంతవరకూ ఉందన్న అంచనాకు వచ్చే వీలుంది. అందుకే ఆయన తిరుపతి ఉప ఎన్నికలో కూడా ఇదే రకమైన పద్ధతిని అవలంబించారు. తిరుపతి ఉప ఎన్నికకు, బద్వేలు ఎన్నికకు పెద్దగా తేడా లేదు. రెండు చోట్ల ప్రజా ప్రతినిధులు మరణిస్తేనే అక్కడ ఎన్నిక అనివార్యమయింది.

తిరుపతిలో….

కానీ తిరుపతిలో మృతి చెందిన ఎంపీ కుటుంబానికి టిక్కెట్ ఇవ్వకుండా ఇతరులకు ఇవ్వడంతోనే పోటీ చేశామని టీడీపీ నేతలు చెబుతున్నా అందులో వాస్తవం లేదు. ఒకవేళ బల్లి దుర్గాప్రసాద్ కుటుంబానికి టిక్కెట్ ఇచ్చినా పోటీ చేసి ఉండేవారు. చిత్తూరు జిల్లా తన సొంతది కావడం, కుప్పం నియోజకవర్గం ఆ పరిధిలో ఉండటంతో చంద్రబాబుకు హోప్స్ ఉన్నాయి. కానీ బద్వేలు అలా కాదు. జగన్ సొంత జిల్లాతో పాటు అక్కడ పోటీ చేసినా గెలవమని తెలుసు. మరీ వన్ సైడ్ గా విజయం సాధిస్తే పార్టీ పరువు పోయే అవకాశముంది.

పవన్ కు దగ్గరవ్వడానికే….

అందుకే చంద్రబాబు బద్వేలు బరి నుంచి తప్పుకున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. దీనికి తోడు త్వరలో తనకు మిత్రుడు అవుతారని భావిస్తున్న పవన్ కల్యాణ్ తన పనిని సులువు చేశారు. ఆయన కూడా అదే వ్యాఖ్యలు చేయడంతో తాను పవన్ ను గౌరవిస్తున్నట్లు చెప్పినట్లవుతుంది. దీంతో పాటు పార్టీకి అనవసర ఖర్చు అని కూడా చంద్రబాబు భావించారు. మొత్తం మీద బద్వేలు ఉప ఎన్నిక నుంచి తప్పుకోవడంతో చంద్రబాబు పవన్ కు మరింత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నట్లే కనపడుతుంది.

Tags:    

Similar News