జగన్ దెబ్బతో మరీ డీలా పడ్డారు?

ఏ పార్టీ కైనా విపక్షంలో ఉంటూ నెట్టుకు రావడం నేటి డబ్బుతో కూడిన రాజకీయాల్లో బాగా కష్టమైన పని. అందుకే అన్ని పార్టీలు ఆర్ధిక పరిపుష్టి బాగా [more]

Update: 2021-09-18 13:30 GMT

ఏ పార్టీ కైనా విపక్షంలో ఉంటూ నెట్టుకు రావడం నేటి డబ్బుతో కూడిన రాజకీయాల్లో బాగా కష్టమైన పని. అందుకే అన్ని పార్టీలు ఆర్ధిక పరిపుష్టి బాగా ఉన్న వారిని ఎంచుకుని వారికి నాయకత్వ బాధ్యతలతో పాటు ఎంపీ ఎమ్యెల్యేల టికెట్లు కట్టబెడుతూ వస్తుంటాయి. అధికారంలోకి రాకుండా పార్టీ నిర్వహణ ఖర్చును భరించడం కష్టం అనే భావనతోనే ప్రజారాజ్యం పార్టీని మెగాస్టార్ చిరంజీవి ముందు చూపుతో మూసేశారని రాజకీయ నిపుణులు చెబుతారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం పెద్దగా పార్టీ యంత్రాంగం లేకుండా వన్ మెన్ ఆర్మీగా 2014 నుంచి పార్టీని నెట్టుకొస్తున్నారు. 2019 ఎన్నికల తరువాత జనసేన ను విస్తరించే పని పెట్టుకున్నా ఆర్ధికంగా పార్టీ ఎక్కడివారు అక్కడి ఖర్చులు భరించక తప్పదన్న ఫార్ములాలోనే సాగుతుంది.

ఖర్చుపెట్టేవారే కనిపించడం లేదా … ?

ప్రస్తుతం ఏపీ లో ఉన్న అధికార వైసీపీ దెబ్బకు విపక్షాలన్నీ పూర్తిగా కుదేలయిపోయాయి. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షానికి చాలా నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల్లో టికెట్ గ్యారంటీ అనుకున్న వారు సైతం జేబులోనుంచి రూపాయి ఖర్చు చేయడం లేదని క్యాడర్ వాపోతుంది. ఉభయగోదావరి జిల్లాల్లో ఆర్ధికంగా బలంగా ఉన్న వారే టీడీపీ లో ఇంకా కొనసాగుతున్నారు. వీరంతా ఎన్నికల ముందు గాలి ని బట్టి చూసుకుందామనే ధోరణి తో కొనసాగుతున్నారని తెలుస్తుంది. ఎప్పుడో పెదబాబు, చినబాబు వచ్చినప్పుడు తప్ప ఖర్చు చేయడానికి వారికి ధైర్యం చాలడం లేదని టాక్.

అధికారంలో ఉన్నప్పుడు….

గత టీడీపీ ప్రభుత్వంలో కోట్ల రూపాయలు కూడగట్టుకున్నా కూడా పార్టీ కష్టకాలంలో ఎవరు ముందుకు రాకపోవడం అధినాయకత్వాన్ని సైతం కలవరపెడుతుంది. ఇదే పరిస్థితి ఇక ముందు కొనసాగి టీడీపీ నేతలు ఆ విధంగానే ముందుకు వెళితే మరింత క్యాడర్ అధికారపక్షంలోకి జంప్ కావడం ఖాయమనే అంటున్నారు అంతా. కరోనా పేరు చెప్పి జనంలోకి రాకుండా కార్యక్రమాలకు ప్రస్తుతం దూరం జరిగినా వచ్చే రెండున్నరేళ్ళు రాజకీయాల్లో జోరు పెంచకపోతే పార్టీకి కష్టమే దాపురిస్తుందని పసుపు దళంలో ఆందోళన మరింతగా పెరుగుతుంది. మరి దీన్ని చంద్రబాబు ఎలా సరిదిద్దుతారో చూడాలి.

Tags:    

Similar News