ఉలిక్కిపడుతున్న తెలుగుదేశం…?

భయం ఉంటేనే ఉలికిపాటు వస్తుంది. ఉన్న మాట అంటేనే ఉలికిపాటు అన్న పాత సామెత కూడా ఉంది. మరి తెలుగుదేశం పార్టీ విషయంలో చూస్తే ఏది కరెక్ట్ [more]

Update: 2021-04-02 08:00 GMT

భయం ఉంటేనే ఉలికిపాటు వస్తుంది. ఉన్న మాట అంటేనే ఉలికిపాటు అన్న పాత సామెత కూడా ఉంది. మరి తెలుగుదేశం పార్టీ విషయంలో చూస్తే ఏది కరెక్ట్ అన్న మీమాంసను పక్కన పెడితే మొత్తానికి పార్టీలో కలవరం అయితే చెలరేగుతోంది అని గట్టిగా చెప్పాల్సిందే. రెండేళ్ళుగా చూస్తే ఆ పార్టీకి వరస పరాజయాలు తప్ప మరేమీ లేదు ఈ నేపధ్యంలో ఏ చిన్న మాట అన్న ఉలిక్కిపడడం సహజమే. అవును ఎంత రాజకీయం మొరటు అనుకున్నా కూడా ఎవరికైనా ఈ సమయంలో మనసుకు ఇబ్బంది కలగడం సహజమే.

ఎందుకిలా…?

తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే నాలుగు దశాబ్దాల రాజకీయం చూసిన పార్టీ అది. అందులో సగం పైగా అధికారంలో ఉన్నా కూడా మిగిలిన కాలమంతా కూడా విపక్షంలో గడిపింది. తొలి అయిదేళ్ళూ ఎన్టీయార్ హయాంలో విపక్షంలో ఉన్నా కూడా ఆ తరువాత చంద్రబాబు జమానాలో ఇది ముచ్చటగా మూడవసారి ప్రతిపక్ష పాత్ర. అందువల్ల తెలుగుదేశం డీలా పడాల్సిన అవసరం అయితే లేదు. కానీ ఎందుకో భావి వారసుడిగా టీడీపీలో పేరున్న లోకేష్ మాత్రం తాజా పరిణామాలను అసలు తట్టుకోలేకపోతున్నాడులా ఉంది. ఆయన అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అవుతున్నట్లుగా కూడా ఉంది.

ఫూల్ అయ్యారా…?

ఒక ఆంగ్ల పత్రికలో తెలుగుదేశం పార్టీ బీజేపీతో విలీనం అవుతుంది అని న్యూస్ ఇచ్చారు. అది కూడా ఏప్రిల్ ఫూల్ న్యూస్ గానే ఇచ్చారనుకోవాలి. దానికి ఓవర్ రియాక్షన్ టీడీపీ నుంచి వచ్చింది. అది కూడా చంద్రబాబు తరువాత తానే అనిపించుకుంటున్న లోకేష్ నేరుగా రంగంలోకి దిగిపోయి ఆ పత్రికా యాజమాన్యాన్ని, జగన్ని కలిపి మరీ దూషించడమే ఇక్కడ విశేషం. తెలుగుదేశం పార్టీని విలీనం చేసుకోవడం అంటే మామూలు విషయమా. అయినా కూడా ఎన్నో వార్తలు గాలి గానో లేక ఫూల్ చేయాలనో వస్తూంటాయి. దానికి ఎక్కువగా ఆవేశపడితే క్యాడర్ కి అదే తప్పుడు సంకేతం ఇచ్చినట్లుగా ఉంటుంది.

చంద్రబాబు ధీమా ఏదీ..?

ఎన్టీయార్ హయాంలో టీడీపీకి తొలి పరాజయం 1989లో వచ్చినపుడు ఎన్టీయార్ బయట‌ ముఖం చూపించలేదు. అపుడు చంద్రబాబు మీడియాను ధైర్యంగా ఫేస్ చేశారు. ఒక ఎన్నికతో పోయేది ఏముంది. మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, మా తప్పులు దిద్దుకుంటామని చాలా కూల్ గా చెప్పారు మరి ఆయన గారి పుత్రరత్నంగా ఉన్న లోకేష్ కి తండ్రి పాటి ధైర్యం లేదా రాలేదా అన్న చర్చ అయితే సాగుతోంది. నిజానికి తెలుగుదేశం గతంలో ఎన్నడూ లేనంతగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. కానీ ఇప్పటికీ ఆ పార్టీకి పెట్టని కోటలా క్యాడర్ అయితే ఉంది. ఏపీలో పెద్దగా బలం లేని బీజేపీలో విలీనం అంటే ఎవరూ నమ్మరు. జస్ట్ జోక్ అనుకుంటారంతే. లోకేష్ కూడా దీన్ని అలాగే భావిస్తే ఆయన నాయకత్వానికి మెచ్చు తునకగా ఉండేది. కానీ ఈ కీలక సమయంలో రంకెలు వేస్తే అది పార్టీకి మరింత డేంజర్. మొత్తానికి టీడీపీలో ఎక్కడో సన్నగా వణుకు మొదలైంది అనడానికి లోకేష్ వ్యాఖ్యలు ఒక సంకేతామా?. ఏమో…?

Tags:    

Similar News