మరీ అంత రాజకీయ పేదగా ?

దేవుడిని జనాలు ఎందుకు మొక్కుతారు. ఎందుకు కొలుస్తారు. ఆయన వరాలు ఇస్తాడని. అలాగే నాయకుడిని కార్యకర్తలు ఎందుకు ఆరాధిస్తారు. మరెందుకు జేజేలు పలుకుతారు అంటే పదవులు ఇస్తాడని. [more]

Update: 2021-04-02 13:30 GMT

దేవుడిని జనాలు ఎందుకు మొక్కుతారు. ఎందుకు కొలుస్తారు. ఆయన వరాలు ఇస్తాడని. అలాగే నాయకుడిని కార్యకర్తలు ఎందుకు ఆరాధిస్తారు. మరెందుకు జేజేలు పలుకుతారు అంటే పదవులు ఇస్తాడని. అధికారంలో ఉండే నాయకుడికి విలువా దర్జా వేరు. సరే విపక్షంలోకి వచ్చినా కూడా కొన్ని పవర్స్ అలా కంటిన్యూ అవుతాయి. పూర్తిగా క్యాడర్ రాజకీయ అవసరాలు తీర్చకపోయినా కొంతలో కొంత అయినా పదవులను పంచుతూ ఓదార్చే సీన్ ఎపుడూ ఉంటుంది. కానీ తెలుగుదేశం నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఫస్ట్ టైమ్ అధినాయకుడి చేతులు బొత్తిగా ఖాళీగా కనిపిస్తున్నాయి.

ముచ్చటైకైనా….?

తెలుగుదేశానికి 2019 ఎన్నికలు ఎలాంటి సందేశాన్ని ఇచ్చాయంటే అయిదేళ్ల పాటు చేతులు ముడుచుకుని కూర్చోమని. ఆ పార్టీకి ఉన్న వారు తిప్పి తిప్పి చూస్తే 23 మంది. అందులో కొందరు ఇప్పటికే జారుకున్నారు. మరికొందరు సైలెంట్ అయ్యారు. నిఖార్సుగా ఎందరు ఉంటారో తెలియదు. ఈ సమయంలో ఒక్క ఎమ్మెల్సీ అయినా టీడీపీ గెలిపించుకోలేదు. రాజ్యసభ సీటు ఏ ఒక్కరికీ ఇప్పించుకోలేదు. మరీ ఇంత దీన స్థితి టీడీపీకి రావడం కంటే దారుణం వేరొకటి ఉండదు కదా.

అదీ పాయే….?

ఇక ఎమ్మెల్సీ పదవులలో స్థానిక సంస్థల కోటా కూడా ఉంటుంది. అంటే మునిసిపాలిటీలు, మండలాల్లో ఉన్న సంఖ్యాబలం బట్టి 13 జిల్లాల నుంచి పదమూడు మందిని ఆ కోటా కింద పంపించుకునే భాగ్యం ఉంది. కానీ ఇపుడు మునిసిపల్ ఎన్నికల ఫలితాలు చూస్తే ఒక్కటంటే ఒక్క జిల్లాలో కూడా టీడీపీకి బలం లేకుండా పోయింది. రేపటి రోజున జరిగే పరిషత్ ఎన్నికల్లో కూడా పెద్దగా బలం వస్తుంది అన్న గ్యారంటీ కూడా లేదు. దాంతో ఈ కోటా కింద కూడా ఒక్కరిని కూడా మండలికి పంపించే దర్జా టీడీపీకి లేనట్లే అంటున్నారు.

ఉత్త చేతులతోనే….?

రాజకీయ పార్టీ అంటే పదవులు ఇవ్వాలి. అవి కూడా అధికార పదవులు. వైసీపీ 2014లో విపక్షంలో ఉన్నా కనీసం కొన్ని అయినా ఎమ్మెల్సీలు గెలిపించుకునే బలాన్ని కలిగి ఉంది. అలాగే ప్రతీ రెండేళ్లకు ఒకరిని రాజ్యసభకు పంపుకునే చాన్స్ కూడా ఆ పార్టీకి వచ్చింది. కానీ టీడీపీ ఇప్పటి పరిస్థితే బొత్తిగా ఘోరం. బాబు ఉత్త చేతులతో ఉంటే క్యాడర్ అంతకంటే దిగాలుగా ఉంటోంది. గతంలో బాబు సీఎం గా ఉన్నపుడు ఇలాంటి పదవుల భర్తీకి అవకాశం వస్తే బాబు దర్జాయే వేరుగా ఉండేది. రోజుల తరబడి కూడికలూ తీసివేతలూ చేస్తూ ఆశావహుల్లో బీపీ పెంచేవారు. ఇపుడు బాబుకే విపక్ష నేత వైభోగం ఎన్నాళ్ళో తెలియని డోలాయమాన స్థితి. దాంతో ఎవరికీ ఏ పదవీ ఇవ్వలేక కుంచించుకుపోతున్నారు. ఇది నిజంగా శాపమే. టీడీపీ చరిత్రలో చీకటి అధ్యాయమే.

Tags:    

Similar News