హోప్ లేదనా? స్కోప్ ఇక ఉండదనా?

ఒక పార్టీ త‌ర‌ఫున రాజ‌కీయాలు చేసిన నేత‌లు.. ఎలా ఉండాలి ? ఎలా వ్యవ‌హ‌రించాలి ? కేవ‌లం అధికారం పోయినంత మాత్రాన‌.. లేదా అధికారం ద‌క్కనంత మాత్రాన‌.. [more]

Update: 2020-12-12 06:30 GMT

ఒక పార్టీ త‌ర‌ఫున రాజ‌కీయాలు చేసిన నేత‌లు.. ఎలా ఉండాలి ? ఎలా వ్యవ‌హ‌రించాలి ? కేవ‌లం అధికారం పోయినంత మాత్రాన‌.. లేదా అధికారం ద‌క్కనంత మాత్రాన‌.. పార్టీకి దూర‌మై పోవాలా ? పార్టీ అధినేత‌ను దూరం పెట్టాలా ? ఇప్పుడు ఇవే ప్రశ్నలు టీడీపీ నేత‌ల‌ గురించి.. ఆ పార్టీ సానుభూతి ప‌రుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అసెంబ్లీ స‌మావేశాలు ముగిశాయి. ఈ స‌మావేశాల‌కు టీడీపీ త‌ర‌ఫున పోయిన వారు పోగా.. మిగిలిన వారిలో ఎంత మంది వ‌చ్చారు ? అని చూస్తే.. దాదాపు ఆరుగురు నుంచి ఏడుగురు అస‌లు స‌భ మొహ‌మే చూడ‌లేదు. గ‌తంలో మంత్రిగా చ‌క్రం తిప్పిన గంటా శ్రీనివాస‌రావు కూడా స‌భ‌జోలికి రాలేదు.

పార్టీలోనే ఉన్నారా?

ఇక‌, ప‌లువురు నాయ‌కులు విజ‌య‌వాడ‌లోనే ఉండి కూడా స‌భ‌కు హాజ‌రుకాలేదు. మ‌రి వీరి ఉద్దేశం ఏంటి.. ? పార్టీలో ఉన్నారా ? లేరా ? కేవ‌లం అధికారంలో ఉన్న‌ప్పుడే పార్టీకి జేజేలు ప‌లుకుతారా ? ప‌దువులు పంచుకుంటారా ? అధికారం కోల్పోతే.. టీడీపీని ప‌ట్టించుకోరా ? కేవ‌లం పార్టీ అధినేతో.. లేదా కొద్ది మంది నాయ‌కులో పార్టీ కోసం ప‌నిచేయాలా ? అనే చ‌ర్చ సాగుతోంది. నిజానికి వైసీపీని తీసుకుంటే 2014 ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి వ‌స్తుంద‌ని అనుకున్నారు. కానీ, 67 మంది మాత్రమే గెల‌వ‌డంతో పార్టీ అధికారంలోకి రాలేదు. అంత మాత్రాన కీల‌క నేత‌లు ఎవ‌రూ పార్టీకి దూరంగా జ‌రిగిపోలేదు. అంతేకాదు.. పార్టీ త‌ర‌ఫున గ‌ట్టి వాయిస్ కూడా వినిపించారు.

నాడు జగన్ పార్టీ వాళ్లు….

23 మంది ఎమ్మెల్యేల‌ను, ముగ్గురు ఎంపీలు జ‌గ‌న్‌కు దూర‌మైనా ఉన్న వారంతా జ‌గ‌న్‌, పార్టీ కోసం ఎంతో కష్టప‌డ్డారు. ప్రతిప‌క్షంలో ఉన్నా పోరాటాలు చేసి, శ్రమించి మ‌రీ పార్టీని అధికారంలోకి తీసుకువ‌చ్చారు. నాడు పోయినోళ్లు పోయినా ఉన్న వాళ్లంతా పోరాటం విష‌యంలో ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గలేదు. జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించ‌క‌ముందు అస‌లు ఆ పార్టీయే క‌నుమ‌రుగైపోతుంద‌న్న ప్రచారం బ‌లంగా జ‌రిగినా కూడా పార్టీలో మిగిలిన నేత‌లు ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. పార్టీని అధికారంలోకి తెచ్చుకునే వ‌ర‌కు వైసీపీ నేత‌లు స‌మ‌ష్టిగా కృషి చేశారు. ఓర్పుతో వ్యవ‌హ‌రించారు.

ఏ కోశానా కన్పించడం లేదని….

ఇలాంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఈ త‌ర‌హా స‌మ‌ష్టి కృషి, ప‌ట్టుద‌ల‌, ఓర్పు.. పార్టీ కోసం ఏమైనా చేద్దాం.. అనే భావ‌న టీడీపీ నేత‌ల్లో ఏకోశానా క‌నిపించ‌డం లేద‌న‌న్నది విమ‌ర్శకుల మాట‌. అంతేకాదు.. పార్టీకోసం మేం ఏం చేశాం.. అనే మాట‌ల‌ను ప‌క్కన పెట్టి.. పార్టీ త‌మ‌కు ఏం చేసింద‌నే ప్రశ్నలు కూడా తెర‌మీద‌కి వ‌స్తుండ‌డం మ‌రింత దారుణంగా ఉంద‌ని అంటున్నారు. టీడీపీ నుంచి గెలిచిన న‌లుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూర‌మ‌య్యారు.. మిగిలిన వాళ్లలో కొంద‌రు ఎప్పుడు బ‌య‌ట‌కు వెళ‌దామా ? అని చూస్తుంటే మ‌రి కొంద‌రు మాత్రం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఒళ్లు హూనం ఎందుకు ? చేసుకోవాలి.. మ‌ళ్లీ పార్టీకి గాలి ఉంద‌నుకుంటే అప్పుడు బ‌య‌ట‌కు రావొచ్చన్న ఆలోచ‌న‌ల్లో ఉన్నారు.

అసలు బయటకే రాకుండా….?

ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు అస‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు, నియోజ‌క‌వ‌ర్గంలో తిరిగేందుకే కాదు.. క‌నీసం అసెంబ్లీకి వ‌చ్చేందుకు కూడా ఇష్టప‌డ‌డం లేదు. ఎన్నిక‌ల్లో ఓడిన సీనియ‌ర్ నేత‌లు కూడా ఒక్క ముక్క మాట్లాడ‌డం లేదు. చంద్రబాబు ఏం చేశార‌నేది ఇప్పుడు అప్రస్తుతం… మ‌ళ్లీ తిరిగి అధికారంలోకి వ‌చ్చేలా కృషి చేయాల్సిన అవ‌సరం టీడీపీ జెండా క‌ప్పుకొని పార్టీ పంచ‌న నిలిచిన ప్రతి ఒక్కరిపైనా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి త‌మ్ముళ్లు మార‌తారా ? లేదా పార్టీని వాళ్లకు వాళ్లే ముంచుకుంటారా ? అన్న ప్రశ్నల‌కు కాల‌మే ఆన్సర్ చేయాలి.

Tags:    

Similar News